రమణాశ్రమ లేఖలు 205 (20-9-48)
రమణాశ్రమ లేఖలు 205 (20-9-48)
https://bhagavanraman.blogspot.com/2019/01/blog-post.html
జ్యోతిషం
నాల్గయిదు రోజులక్రితం ఒక దైవజ్ఞుడు వచ్చాడిక్కడికి. వచ్చిన మరుదినం ఉదయం పది గంటలకు జ్యోతిషశాస్త్ర రీత్యా భగవానుని చాలా చాలా ప్రశ్నిస్తే భగవాన్ సయుక్తికంగా బదులిచ్చారు. సారాంశం ఏమంటే, “స్వామీ! జ్యోతిషశాస్త్ర రీత్యా అది అప్పుడు జరుగుతుంది, ఇది ఇప్పుడు జరుగుతుంది, అది ఆ గ్రహబలము, ఇది ఈ గ్రహబలము అని చెపుతారే, అది యథార్థమేనా?” అన్నది వారి ప్రశ్న. ' నేను అనే అహంత ఉన్నంత వరుకు అన్నీ నిజమే.ఆ అహంత నశించినపుడు ఏదీ నిజం కాదు.' అని సెలవిచ్చారు భగవాన్.
" అయితే అహంత నశించినవారికి జ్యోతిషం యదార్థం కాదంటారా? " అన్నారా పృచకులు." కాదనేందు కేమున్నదండీ, చూచేవాడుంటేనే చూడటం ఉంటుంది. అహంత నశించినవారు చూచినా చూడనివారే. కిటికీ తెరిచే ఉంటుంది. లోపల చేసేవాడుండి చూడాలి కానీ కిటికీ చూస్తుందా?" అన్నారు భగవాన్. "తాను లేకుంటే శరీరయాత్ర ఏ విధంగా సాగుతుంది?" అన్నారా పుచ్చకులు. "అదే అదే. శరీరం ముసకొక యిల్లు. నీవుంటేనే ఈ ఇల్లు బాగుంటుంది కాని లేకుంటే బాగుండదు. అందువల్ల, మనం ఉన్నంతవరకు నినాసయోగ్యంగా చేసుకుంటున్నాము అన్న విషయం తెలుసుకొని ఆ తెలివిని సదా విడువకుండా వుండాలి. విడిస్తే శరీరం నేననే భావన వచ్చి బాధిస్తుంది. అప్పుడన్నీ యథార్హమే. ఆ భావన నశించడమే అహం నాశనం.ఆ అహంత నశించినప్పుడు ఏదీ నిజం కాదు. జరిగేది జరుగుతుంది. జరుగనిది జరగనే జరగదు" అని సెలవిచ్చారు భగవాన్.
“జరిగేది జరుగుతుంది. జరగనిది జరగనే జరగదని సెలవిస్తారే, ఇక మంచి చేయాలని అనడం ఎందుకు?" అని మళ్ళీ ప్రశ్న. "మంచి చేస్తే సుఖం కలుగుతుంది. అందువల్ల చేయాలన్నారు" అని సెలవిచ్చారు భగవాస్. “అవును దుఃఖం ఆగంతుకమనే కదా పెద్దల వాక్యం' అన్నారా భక్తులు. "ఆహా! దుఃఖం ఆగంతుకమే. సుఖమే యథార్థం. ప్రతి జీవీ సుఖం కావాలని అనడం అసలు తన సహజస్థితి సుఖరూపం కావడంవల్లనే. ఆగంతుకమైన దుఃఖాన్ని పోగొట్ట డానికే అన్ని సాధనలున్నూ, తలనొప్పి మధ్యలో వచ్చింది కనుకనే మందు వేసి పోగొట్టాలి. పుట్టింది మొదలూ చచ్చేదాకా ఉండేదైతే పోగొట్టుకోవడం ఎందుకు? వ్రణాలూ, వ్యాధులూ, డాక్టరు వైద్యంవల్ల తగ్గినట్లే, అనేక ప్రతిబంధకాలవల్ల కలిగే దుఃఖం ఆ ప్రతిబంధకాలను శాంతింపజేసే సాధనల వల్ల తొలగించ వచ్ఛును. ఇదొక వ్యాధి. దీనికి మూలం అజ్ఞానం. దానికి జ్ఞానమనే మందు పడితే అంతర్భూతమైఉన్న అన్నిరకాల వ్యాధులూ ఒకేసారి పోతాయి" అని చెప్పారు భగవాన్.
"సాధన వల్ల సద్యఃఫలితాలు కలగడం కద్ధా?"అన్నారా పృచకులు " కొన్ని సద్యః ఫలిస్తవి. కొన్ని ఫలించవు. ఎందువల్లనంటే తీవ్రతాతీవ్రతల ననుసరించి అది నడుస్తుంది. పుణ్యం కానీ పాపం కానీ తీవ్రంగా చేస్తే వెంటనే ఫలిస్తుంది. నిదానంగా చేస్తే నిదానమే. అయితే దేనికి ఫలించక తప్పదు" అని సెలవిచ్చారు భగవాన్.
Telegram
T.me/bhagavanRaman
Comments
Post a Comment