రమణాశ్రమ లేఖలు 227 ( 20-2-49)
రమణాశ్రమ లేఖలు 227 (20-2-49)
Https://bhagavanraman.blogspot.com/2019/01/227-20-2-49.html
తామస పదార్థాలన్నీ నిషేధమే
నాలురోజుల క్రిందట 'గృహలక్ష్మి' పత్రిక వచ్చింది. భగవాన్.పుటలు తిప్పి
చూస్తూ తమలో తామే నవ్వుకుంటున్నారు. ఏదో విచిత్రం ఉంది కాబోలు
అనుకున్నాను. తొమ్మిదీ ముప్పావయింది. భగవాన్ బయటికి వెళ్ళబోతూ పత్రిక
నా వద్దకు పంపి “అందులో వెల్లుల్లి మాహాత్మ్యం ఉంది చూడండి” అని నవ్వుతూ
లేచి వెళ్ళారు. నేను ఇంటికి తెచ్చి చదివితే, వెల్లుల్లి వల్ల కలిగే మేలును ఎంతో
వర్ణిస్తూ, దానితో చేసే పిండి వంటలూ, ఊరగాయలూ, పచ్చళ్ళూ మొదలైన
వన్నీ ఎలా చేసేదీ వివరించి, ఉల్లికి ఉన్న మహత్తు మరి దేనికీ లేదన్నట్లు తమాషాగా రాసి ఉంది. కడుపుబ్బేట్టు నవ్వు వచ్చింది. భగవాన్ కూడా ఇందుకే నవ్వారు కాబోలు అనుకున్నాను. రెండున్నరకు భగవాన్ సన్నిధికి వెడితే నా రాక కిటికీలలో నుండే చూచి
మళ్ళీ నవ్వుకుంటున్నారు భగవాన్. హాల్లో అడుగు పెట్టానో లేదో " ఏం
వెల్లుల్లి మాహాత్మ్యం చదివారా? పద్యం కూడా ఒకటుందే” అన్నారు భగవాన్.
"చదివాను. పద్యం కూడా చూచాను. ఉల్లి చేసిన మేలు తల్లి అయినా
చేయదనే సామెత మా వైపున ఉంది. ఆ పద్యం అదే భావంతో రాసారు. అన్నాను.
"ఆ సామెత ఈ దేశంలోనూ ఉంది. అది నిజమే. దేహానికి ఎంతో మంచిదంటారు.
నిజంగా అదీ అటువంటిదే. వాతహారీ,బలకరమూను. చంటిపిల్లలకు
అమృతం వంటిది. అసలు ఉల్లికి అమృతమనే పేరుంది" అన్నారు భగవాన్.
"ఆ పేరేందుకు వచ్చింది?" అన్నారొకరు.
భగవాన్
చిరునవ్వుతో "అదా. దానికొక చిత్రకథ ఉంది. ఏమంటే, దేవతలూ, దానవులు క్షీర
సాగరాన్ని మథించినప్పుడు అమృతం పుట్టిందా. ఆ అమృతకలశం
దానవులు తీసుకొని పారిపోతుంటే దేవతలు విష్ణువుకు మొర పెట్టుకోవడం, విష్ణువు మోహినీ రూపంతో వచ్చి దానవులను మాయచే భ్రమపెట్టి అమృతమంతా
దేవతలకే పోయడం చూచి రాహువనే రాక్షసుడు చల్లగా దేవతల పంక్తిలో కుర్చుని అమృతం గ్రహిస్తే సూర్యచంద్రులా మర్మం తెలుసుకొని మోహినికి సంజ్జ చేస్తే ఆమె చేతిలో అమృతం , ఉన్న గరిటెను ఒక్క విసరు విసిరిందనీ, అదే చక్రమై ఆ రాక్షసుని శిరస్సు ఖండించిందనీ, అప్పటికే అమృతం
గొంతువరకూ దిగి ఉండడం వల్ల వాని తల గ్రహరూపమై ఆకాశంలో నిలిచి
పగ సాధించే నిమిత్తం సూర్యచంద్రులిద్దరినీ పట్టి బాధిస్తూ ఉంటుందనీ, అదే
మనకు ఏటేటా కనుపించే గ్రహణమనీ వాడుకలో ఉన్నదేనా? ఆ మొండెం
క్రిందపడేటప్పుడు అమృత బిందువులు చింది భూమిపైపడి ఉల్లిగా మొలిచిందని
దేని లోనో చూచాను. అందుకే ఉల్లిని అమృతం అంటారు. ఎంతో మంచిది. అయితే అసురసంపర్కంవల్ల మనస్సుకు తామసభావం కలుగుతుందని
సత్వగుణార్జనలో ఆసక్తిగలవారు దాన్ని నిషేధించారు" అని సెలవిచ్చారు.
ముల్లంగి, ములగ ఇత్యాదులూ నిషేధమనే అంటారు కదా?” అన్నారా భక్తులు "అవును
పుచ్చకాయ, ముల్లంగి, ములగ, నేతిబీర, నీరుల్లి, ఇంకా తామసపదార్థాలన్నీ నిషేధమే. ఆహారం ఎంతెంత సాత్వికంగా ఉంటుందో, అంతంత బుధ్ధి వికసిస్తుంది. కూటూ, సాంబారు, రసము అన్నీ వేసుకుని ఫుల్ గా తింటే హాహా..హుహు అంటూ ఆపసోపాలు పడాలి. సాత్వికమైన సాధకం ఏదో ఒకటి వేసుకుని తింటే ఎంతో హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఆ మాట వినేది వినేదెవరు? అన్నారు భగవాన్.
" భగవానేదో వింతగా సెలవిస్తారే. ఎందుకు వినరు?" అన్నారా భక్తులు. నిజమేనండి. ఎవరూ వినరు స్వామికి లడ్డూ తేవాలి, జిలేబి తేవాలి, అదీ ఇదీ అనేవారేగానీ మిరియాల చారూ అన్నమయితే మేలనేవారే లేరే. స్వామిది పేరు. స్వామికెందుకో ఇవన్నీను. పూర్వం దండపాణిస్వామి వండేవారు, అప్పటి వంట విధానమే వేరు. ఏమంటే, ఉదయమే ఒక బాన పొయ్యిమీద
పెట్టి మధ్యాహ్నం వరకూ ఏ కూరలు వచ్చినా అన్నీ తరిగి దాల్లో వేసేది.
సాంబారు కాచేదీను. కలియబెట్టేందుకు గరిటేది. ఒక చెక్కపేడు
బాగా చెక్కి కలియబెట్టేవాళ్ళం. ఒక్కటే ఆధరువు. దానితో అన్నం తింటే ఎంతో
రుచిగా ఉండేది. పని తక్కువే. ఆశ్రమంలో ఈ అట్టహాసమంతా
వచ్చిన మొదట్లో లేదు. వంట ఏం చెయ్యాలి స్వామీ!' అని అడిగేవాళ్ళు.
బియ్యం ఉన్ననా? ఉన్నవి. నీళ్ళున్నవా? ఉన్నవి. ఉప్పు? ఉంది. ఊరగాయ?
ఉంది. మజ్జిగ? ఉంది. మరింకేం? ఏం కావాలి?' అనేవాణ్ణి. తరువాత అలా
అడగడం మాని 'అది చేస్తాం, ఇది చేస్తాం' అంటారిప్పుడు. 'సరిసరి' అంటాను.
తగిన సలహా కూడా చెపుతాను. మనదేం పోయింది. నేను మాత్రం నా
పద్ధతి విడువక అన్నీ కలిసి ఒకే ఆధరువుగా పెట్టుకుంటాను. పదిమంది
చేరాక వారి యిష్టం. మన మూలంగా వారినేందుకు కష్టపెట్టేది" అని
సెలవిచ్చారు భగవాన్.
Telegram
T.me/bhagavanRaman
Comments
Post a Comment