రమణాశ్రమ లేఖలు 221(22-1-49)
రమణాశ్రమ లేఖలు 221(22-1-49)
https://bhagavanraman.blogspot.com/2019/01/22122-1-49.html
ఆత్మానందము
నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు ఇద్దరు తీర్థయాత్రాపరులు శ్రీవారి సన్నిధికి వచ్చి కూర్చున్నారు. వారిని చూస్తే ఏదో అడగవలెనని యోచిస్తున్నట్లు ఉంది. కొంచెం ఆగి ఒక యువకుడు “స్వామీ! ధ్యానానికి కళ్ళు మూసుకొని కూర్చున్నంతవరకూ ఫరవాలేదు గాని, తెరవగానే విషయేంద్రియాలు బాధిస్తవే,
ఎలాగు?" అన్నాడు. “ఎలాగేమి? కళ్ళు తెరిస్తే మాత్రం ఏమవుతుంది. కిటికీలు
తెచిపెట్టి గదిలో పడుకొని నిద్రపోయినట్లుగా మనస్సును పడుకోబెట్టి
నిద్రపుచ్చితే సరి” అన్నారు భగవాన్.
“అంటే, మనస్సును విషయాలవెంట పోకుండా అణచవలెనని కదా అర్థం.
ఆ మనస్సును ఎంత అణచాలని యత్నించినా అణగదే?” అన్నాడతడు. “అది
సరి. అందుకే 'పిల్లవాడు తన నీడను పట్టుకోవాలని పరుగులు పెట్టి ఎంత
దూరం పోయినా చిక్కక, ఏడ్వసాగితే తల్లివచ్చి వాణ్ణి పట్టుకొని నిలిపి వుంచినట్లు
విషయాదులవెంట పరుగెత్తే మనస్సును పట్టివుంచాలి' అని అంటారు. అది
నిజమే కదా!”అని సెలవిచ్చారు భగవాన్. “ఏ విధంగా పట్టి నిలుపగలం?” అన్నాడా యువకుడు. “వేదాంతవాక్య శ్రవణమననాదుల వల్ల మనస్సును పట్టి
నిలిపి ఉంచాలి” అన్నారు భగవాన్. “అంటే, విషయానందం విడిచిపెట్టి ఆత్మానందాన్ని పట్టుకోవాలన్నమాట. అంతేనా?” అన్నారు మరొకరు. “ఆనందం ఉండేదే కదా. విషయాలే విడవటం. విషయాలు విడిస్తే ఆనందం వుండనే ఉన్నది.ఆ ఉన్నదే ఆత్మ. ఉన్నదాన్ని పట్టుకొనుట ఏమి? తన స్వభావమేనాయే” అన్నారు భగవాన్. “ఆ స్వభావాన్నే స్వరూపమనీ అంటారా?” అన్నారా పృచ్ఛకులు, అవును స్వభావం వేరూ, స్వరూపం వేరూనా ఏమి?” అన్నారు భగవాన్.
ఆనందమే స్వరూపమైతే అనుభవించేదెవరు?” అన్నారా పృచ్చకులు. “అదే నండీఅనుభవించేవాడు ఉన్నంతవరకూ 'ఆనందమే స్వరూపమని చెప్పాలి.
అనుభవించేవాడు లేకుంటే ఆనందానికి ఒక రూపమేది? ఉన్న తత్త్వమే
మిగులుతుంది. ఆ ఉన్నదే ఆనందం. అదే తాను. అది వేరు, తాను వేరు అని
అనుకున్నంతవరకూ అనుభవించేవాడూ, అడిగేవాడు ఉంటారు కానీ, అదే
తానని తెలుసుకున్న తరువాత అనుభవించేవాడే ఉండడు.అడిగేదెవరు?
చెప్పేదేమి? ఏదో పరిభాషలో ఆనందమే స్వరూపమని చెప్పవలసి వస్తుంది. అని
సెలవిచ్చారు భగవాన్.
“అది సరేగాని స్వామీ, ఎంత ప్రయత్నించినా అణగక ఈ మనసు స్వరూపం
గోచరించకుండా కప్పుకుంటున్నదే, ఎలాగు?” అన్నారా పృచకులు. భగవాన్
చిరునవ్వుతో చిటికెనవేలు కంటికి అడ్డం పెట్టుకుంటూ పక్కనున్న వారిని
చూచి "ఇదుగోనోయ్. చూడూ. ఈ చిన్న చిటికెనవేలు కంటికి అడ్డమై
లోకమంతా మరుగైనట్లు కప్పుకున్న విధంగానే చిన్న మనసు అడ్డుకుని
బ్రహ్మమును గోచరించకుండా కప్పుకుంటుంది. చూడు దాని సామర్థ్యం"
అని సెలవిచ్చారు.
Telegram
T.me/bhagavanRaman
Comments
Post a Comment