రమణాశ్రమ లేఖలు 220 (20-1-49)

రమణాశ్రమ లేఖలు 220 (20-1-49)
https://bhagavanraman.blogspot.com/2019/01/220-20-1-49.html
పరస్పర శాపములు

               ఈ మధ్య తిరుచ్చుళి వెళ్ళి వచ్చిన ఒక భక్తుడు శ్రీవారి నుద్దేశించి
“తిరుచ్చుళిలో భూమినాథేశ్వర ఆలయానికి ఎదుటనున్న శూలతీర్థపు గట్టున
ఒక అశ్వత్థవృక్షం ఉంది కదా, ఆ వృక్ష మూలంలో గౌతములు తపస్సు చేసారని
అక్కడివారంతా అంటారే, నిజమేనా? వారక్కడ తపస్సు చేయడానికి కారణం
ఏమిటి?” అన్నాడు. “అదా, నిజమే. సంస్కృత త్రిశూలపుర మాహాత్మ్యంలో,
గౌతములు తపస్సు చేయడానికి ఆవర్తక్షేత్రానికి వెళ్ళడం, సనకుల ప్రేరణ
వల్లనేనని చెప్పివున్నది. తమిళ్ తిరుచ్చుళి పురాణంలో వేరు విధంగా ఉంది.
ఏమంటే గౌతములు ఇంద్రునీ అహల్యను శపించిన విషయం అందరికీ తెలిసినదే కదా,ఇంద్రుడు గౌతమ రూపంలో అహల్యను సమీపిస్తే ఆమె ముందు తన పతియని  భ్రమించి పొరపడిన విషయం గౌతములు విచారించక ఘోరంగా పాషాణం కమ్మని శపించడం చూసి, అహల్య సాధారణోక్తిగానే "బుధ్ధి లేని మునీ !
యథార్ధం విచారించి, దానికి తగిన పరిహారం చెప్పక ఈ విధంగా శపించావే, నాకు విమోచనం ఎప్పుడు, ఏ విధంగా కలుగుతుందో, అనుగ్రహించి అదైనా చెప్పరాదా? అని అడిగిందట.గౌతములది విని 'శ్రీరామావతార సమయంలో ఆ మహాత్ముని పాదధూళి సోకిన వెంటనే నీకు విమోచనం అవుతుందని చెప్పిన
వెంటనే ఆమె పాషాణత్వము పొందిందిట.

   గౌతములు ఆ స్థలం వదలి అనుష్టానంలో ప్రవర్తించబోతే వారి బుద్ది స్థిరత లేక అనేక విధాలుగా  భ్రమించ సాగిందిట. ఆ భ్రమ అంతకంతకూ అధికం కావడం వల్ల, వారు ఇంచుక యోచిస్తే తమ సతియైన అహల్య యొక్క దోషం సరిగా విచారించక శపించినప్పుడు తనను ఆమె 'ఓ బుద్దిలేని మునీ' అని సంబోధించిన మాట స్ఫురణకు వచ్చిందిట. ఆమె మహాతపస్విని కదా, అందువల్ల ఆ సాధారణోక్తియే అమోఘమైన శాపంగా పరిణమించిందని అందుకు పరిహారం, ఈశ్వరుని తాండవదర్శనమేనని నిశ్చయించి, చిదంబరానికి వెళ్ళారట. అక్కడ 'త్రిశూలపురంలో నీకు తాండవదర్శనం అనుగ్రహిస్తాను' అన్న అశరీర వాక్కు విన వచ్చిందిట. వెంటనే గౌతములు ఆ స్థలం వదిలి, ఆవర్తక్షేత్రానికి (త్రిశూలపురం) అభిముఖంగా నడిచి, ఆ క్షేత్రాన్ని సమీపించారు. ఆ స్థలం గోచరించినంతనే, వారి చిత్తం ప్రసన్నత నంద నారంభించిందిట. వారక్కడ దీర్ఘకాలం నివసించి తపస్సు చేయగా, ఈశ్వరుడు ప్రసన్నుడై ధనుర్మాసంలో ఆర్ద్రానక్షత్రం నాడు, ఆనందతాండవ దర్శనం అనుగ్రహించారట. అప్పుడే గౌతములు ఆ వృక్షమూలమున నివసించి, తపస్సు చేసారని అంటారు. గౌతములు తాండవ దర్శనానంతరం ఈశ్వరుని నుతించి యథాస్థానానికి వెళ్ళి యథాక్రమంగా వర్తింప సాగినారట.

  "ఆ తరువాత, అహల్య శ్రీరాముని పాదధూళిచేత పవిత్రమై, తిరిగి
సహజరూపం పొంది, గౌతములను సమీపిస్తే వారూ సంతోషంతో ఆమెను ,
చూచి 'ఈశ్వరుని కల్యాణమహోత్సవ దర్శనం చేసిన తరువాత గృహస్థధర్మం
ఆరంభింతా'మని చెప్పి సతీసమేతులై ఆవర్తక్షేత్రానికి వెళ్ళి శ్రీ తనునాధుని ప్రార్థిస్తే
కరుణానిధియైన శంకరుడు, వారిద్దరికీ కల్యాణమహోత్సవ దర్శనం
అనుగ్రహించాడు. గౌతములూ ఈశ్వరుని వినుతించి అతరాయములన్నీ
నివారణ కాగా, యథాప్రకారం పత్నీ సమేతంగా తపశ్చర్యను ఆరంభించారు
ఇది తమిళ పురాణవచనం” అని సెలవిచ్చారు భగవాన్.

“గౌతములకూ శాపం తగిలిందన్న గాథ ఒకటుందా? నేనెప్పుడూ వినలేదు
అన్నాను.
 
  “ఈ పరస్పర శాపముల కథ తిరుచ్చుళి పురాణంలో మాత్రమే ఉంది.
రామాయణంలో జనకసభయందున్న శతానందులు శొపోపహతమై ధృతి
చెడి వెతలగుందుచూ గతికానక పడివున్న తమ తల్లి, రామపదరజ స్పర్శ చేత
చిన్మయ స్పూర్తి నందినదై, ఆ రాముని వినుతించి తమ తండ్రి వద్దకు వెళ్ళిన విషయం విశ్వామిత్రులు చెప్పగా విని, జననీజనకుల పునస్సమావేశానికి ఆనందించారని చెప్పి ఉందే గాని ఇదంతా లేదు” అని సెలవిచ్చారు భగవాన్.

  “అయితే, అహల్య పాషాణమై ఉందనడం కూడా మనసుకేనా ఏమి?"
అన్నారొక భక్తులు. “అవును. మనస్సుకు కాక శరీరానికా మరి?  శరీరం రాతివలె పడివున్నదనీ, రాముడు కాలు పెట్టి రాతిని నాతిగా చేసాడనీ సాధారణ జనులు భావిస్తారే గాని అదెలా సంభవం? మనస్సు ఆత్మ విజ్ఞానాన్ని మరవడమే
కాక, ఏ గతీ తోచక, పాషాణంవలె జడత్వం వహించిందన్న మాట. మహాపురుష సందర్శనం వల్ల ఆ జడత్వం వదలింది. ఆమె మహా తపస్విని కనుక తత్ క్షణమే చిన్మయ స్పూర్తి పొంది,శ్రీరాముని తత్త్వమయునిగా వినుతించింది .ఈ సూక్ష్మార్థం రామాయణంలో  ఉంది. రాముడు గౌతమాశ్రమ ప్రాంతంలో కాలు పెట్టే సరికే మనఃపుష్పం  వికసించ  నారంభించిందట "  అని సెలవిచ్చారు భగవాన్
Telegram
T.me/bhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ