రమణాశ్రమ లేఖలు 218 (18-1-49)
రమణాశ్రమ లేఖలు 218 (18-1-49)
https://bhagavanraman.blogspot.com/2019/01/218-18-1-49.html
కుండలినీ శక్తి చిన్మయ దేహాలు
నిన్న ఉదయాన ఒక ఆంధ్రయువకుడు భార్య సమేతంగా వచ్ఛాడిక్కడికి, హిమాలయ ప్రాంతాలన్నీ చుట్టి వచ్చాడట. మధ్యాహ్నం మూడు గంటలకు భగవానుని సమీపించి,"స్వామీ! కుండలినీశక్తి విజృంభణ,శక్తినిపాతం
యోగమార్గంలో వెళ్ళే వాళ్ళకేనా? భక్తి, ప్రేమ ఇత్యాది మార్గానుసారులకూ ఉంటుందా?" అన్నాడు. "కుండలినీశక్తి లేనివారెవ్వరు? అందరికీ ఉంటుంది
ఆ శక్తియొక్క యథార్థస్వరూపం తెలుసుకున్నప్పుడు దానినే అఖండాకారవృత్తి
అనీ, అహంస్పురణమనీ అంటారు. ఏ మార్గానుసారులకైనా కుండలినీ శక్తి
నిపాతం ఉండనే వున్నది. పేరొక్కటే భేదం" అన్నారు భగవాన్. " ఆ శక్తి
పంచముఖముల లేస్తుందని, పదిముఖముల లేస్తుందనీ, నూరుముఖముల
లేస్తుందనీ, వెయ్యి ముఖములనీ అంటారే, ఏది నిజం? అయిదా, పదా,నూరా,
వెయ్యా?" అన్నారా పృచ్చకులు. "శక్తి ఏకముఖమే నండి. ఇన్ని ముఖముల
విజృంభించడం అంటే, అది భావనయే కదా? శక్తి ఒక్కటే" అని సెలవిచ్చారు భగవాన్.
"ఆత్మ నెఱుగుటకు అనాహతంలో దృష్టి నిలపాలని కొందరూ, సహస్రారంలో
అని కొందరూ, మూలాధారంలోనని కొందరూ అంటారే, ఏది ముఖ్యం?" అని
మళ్ళీ ప్రశ్న. "అన్నీ ముఖ్యమే. ఆత్మ అంతటా ఉంది. మూలాధారంలో చూడాలని
కొందరూ, అనాహతంలోనని కొందరూ, సహస్రారంలోనని కొందరూ అంటారు.
ఏదైనా ఒక్కటే. కాని, అన్నిటికీ ఉత్పత్తి లయస్థానం అనాహతమే కదా?" అన్నారు భగవాన్." అయితే, జ్ఞాని అయినవాడు తానేగిన మార్గాను సారమే కాక ఇతర మార్గాలను వృత్తులకు నన్నూ సహాయం చేయగలడా? అన్నారా పృచ్చకులు. "ఆహా! తప్పకుండా, ఏం మార్గంలోని వారికైనా సహాయం చేయగలడు. ఎలాగంటే, ఈ కొండ ఉందనుకో, పైకి ఎక్కేందుకు ఎన్నో మార్గాలు. తానెక్కిన దోవనే రమ్మంటే
ఒకరికి నచ్ఛవచ్ఛు, ఇంకొకరికి నచ్చకపోవచ్చు. నచ్చని వారిని అటే రమ్మంటే రాలేరు. అందువల్ల ఏ దోవ ననుసరించినవారికి ఆ దోవనే పైకి వచ్చేందుకు సహాయం చేస్తారు. మార్గమధ్యంలో ఉన్నవారికి ఇంకొక దారిలోని మంచి చెడ్డలు తెలియవు కానీ , శిఖరమెక్కి కూర్చున్నవారికి అన్ని దోవలూ కనిపిస్తూనే
ఉంటవి. ఇలా తప్పుకో బాబూ. అలారా నాయనా, అని చెప్పి చూపగలరు. అందరికీ గమ్యస్థానం ఒకటేకదా" అని సెలవిచ్చారు భగవాన్.
ఆ యువకుడు భగవాన్ సెలవిచ్చిన వాటికి సంతృప్తిపడక ఈ ఉదయాన మళ్ళీ
"కుండలినీశక్తి ఆ విధంగా లేస్తుంది. ఈ విధంగా లేస్తుంది" అంటూ అడగడం మొదలుపెట్టాడు. భగవాన్ వినీ విననట్లుంటే వారు అదే పనిగా అడిగారు. 'నాకా మార్గాలేం తెలుసునండీ. తెలిసినవారి నడగండి" అన్నారు భగవాన్. ఆ యువకుడిక ఆ ప్రసంగం విడిచి చిన్మయదేహాలను గుణించి ఎత్తుకుని
“మా గురువుగారు చిన్మయరూపంతో అప్పుడు దర్శనమిచ్చారు.
ఇప్పుడు దర్శనమిచ్చారు. అప్పుడు మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడారు" అంటూ
దివంగతులైన తమ గురువుగారి మహిమలు చెప్పసాగాడు. భగవాన్ పలక్కుండా
ఊరుకున్నారు. కొంతసేపు అల్లాగే గడిచింది. కడకు ఆ యువకుడు "కృష్ణుడు
చిన్మయదేహంతో ఇప్పటికీ ఉన్నాడంటారు నిజమే కదా?” అన్నాడు. భగవాన్
సావధానులై “చిన్మయదేహమంటే శరీరాన్ని బట్టా చెప్పింది. చిన్మయమంటే చిత్ ప్రకాశం అన్నమాట. ఆ ప్రకాశం ఎప్పుడూ ఉన్నదే.
"అహమాత్మా గుడాకేశ! సర్వభూతాశయస్థితః
అహ మాదిశ్చ మధ్యంచ భూతానా మంత ఏవచ"
అంటే, ఈ స్థూలరూపంతోనే అందరి హృదయాల్లోనూ ఉన్నాడని అర్థం.
స్ఫురణ రూపంగా అందరి హృదయాల్లోనూ ఉన్నాడన్నమాట. ఆ అహంస్పురణకే చిత్ ప్రకాశమనీ, చిన్మయమనీ పేర్లు." అని సెలవిచ్చారు."ఆ మహాపురుషుల శరీరాలకు కూడా ఆ విధంగానే చెపుతారా? వారి, అంటే కృష్ణుడి శరీరం చిన్మయమై అలాగే ఉంటుందంటారే?, అన్నాడా యువకుడు. “ఓహో! ఆ శరీరం అల్లాగే చిన్మయమై ఎక్కడో కూర్చున్నదనా అర్ధం?,ఈ లోకమంతా చిన్మయమే. అందులో ఆ ఒక్క శరీరం మాత్రం చిన్మయమైనదా ఏమి? సాక్షాత్కారాలు ఇదే విధం. ఎక్కడనుంచో ఇల్లా శరీరంతో దిగుతారట. సాక్షాత్తు సదా ఉండేదాన్ని వదలి, త్కారమట, కారం, సాక్షాత్కారం అన్నారు భగవాన్.
“మా గురువుగారు లోకాన్ని ఉద్ధరించే మహాపురుషులు ఇక పుట్టగలరని
సెలవిచ్చారు. వారెప్పుడు వస్తారో తాము చెప్పగలరా?” అన్నాడాతడు మళ్లీను.
భగవాన్ బదులు చెప్పలేదు. సమీపస్థులగు భక్తులొక రందుకొని “అయ్యా,
ఎదురుగా కనపడుతున్న మహాపురుషులను చూస్తూ వారి తత్వం గ్రహించలేక
మహాపురుషులు ఎప్పుడు వస్తారని వారినే ప్రశ్నిస్తారేమిటి? మీ గురువుగారినే
అడక్కపోయారూ? చాలు చాలును. చిన్మయ దేహంతో ఉన్న మీ గురువుగారి
వద్దకు వెళ్ళి ఆడగండి” అంటూ ఎదిరించారు.
ఆ యువకుడు అంతటితో అణగిపోయి ప్రసంగం విరమించాడు.
Telegram
T.me/bhagavanRaman
Comments
Post a Comment