రమణాశ్రమ లేఖలు 217 (16-1-49)

రమణాశ్రమ లేఖలు 217 (16-1-49)
https://bhagavanraman.blogspot.com/2019/01/217-16-1-49.html

పెద్ద ఆత్మ

  దాదాపు  పదిరోజులు క్రిందట ఒక అమెరికన్ యువకుడు వచ్చాడిక్కడికి.
అతను ఫోటోలు తీస్తాడని తెలిసి ఇక్కడివారిలో కొందరు అరుణాచలేశ్వర
ఆలయంలో వేయికాళ్ళ మండపంలో నివసించే ఏనుగును రప్పించి జూబ్లీ
హాలుకు ప్రక్కనే ఉన్న మైదానంలో నిలిపారు. భగవాన్ గోశాలవైపుకు వెళ్ళి
తిరిగి వస్తూ ఆ ఏనుగు దగ్గర నిలిచి, ఆహారం యిపిస్తూ ఉండగా ఆ అమెరికన్
ఫోటో తీసాడు. ఆ తరువాత అతడిక్కడ రెండు రోజులు మాత్రమే ఉండి
వెళ్ళాడు. వెళ్ళగానే ఆ నెగెటివ్ సరిచేసి ఫోటో పంపాడు. ఆ ఫోటో నిన్న
ఉదయం పది గంటలు దాటిన తరువాత ఎవరికో చూపేందుకుగాను భగవాన్
సన్నిధికి తెస్తే అంతా వింతగా చూడసాగారు. ఆ ఫోటో వెనకపక్క ఇంగ్లీషులో
ఏమోరాసి ఉన్నదనీ అంతా చెప్పుకున్నారు. నాకది అర్థంకాక “ఏమని రాసారు?”
అన్నాను మెల్లగా.

     భగవాన్ నవ్వుతూ “ఏమీ లేదు. శరీరాన్ని ఎఱుగని పెద్ద ఆత్మ, ఆత్మని
ఎఱుగని పెద్ద శరీరము ఒకే స్థలంలో ఉన్నవని రాసారు” అని చెప్పారు.
“అంటే వారి అభిప్రాయం ఏమనో?” అన్నాను. “ఏమున్నది. ఆ ఏనుగు అంత
శరీరం ఉన్నా ఆత్మ నెఱుగదు. ఆ కారణంవల్ల ఆహారం ఏది యిచ్చినా ఎంత
యిచ్చినా చాలక ఘీంకార శబ్దం చేస్తూ నిలిచింది. అందువల్లనో ఏమో అది
ఆత్మ నెఱుగని పెద్ద శరీరమట. నేను తూలుతూ ఎలాగో నిలబడ్డాను కదు.
అందువల్లనో ఏమో శరీరాన్నెఱుగని పెద్ద ఆత్మనట. అదే వారి అభిప్రాయమై
ఉండవచ్చును" అన్నారు భగవాన్. “అవును అది నిజమే. భగవాన్ ఎప్పుడూ
శరీరాన్ని అంటనట్లే ఉంటారు కదా" అన్నారొక భక్తులు.

   భగవాన్ చిరునవ్వుతో “ఆ. అదే, అదే. మద్రాసు మ్యూజియంలోని
దక్షిణామూర్తి విగ్రహం వలే ఉన్నానని చింతా దీక్షితులు రాసాడు. సౌరీస్
సెల్యూలాయిడ్ బొమ్మలా ఉన్నానని రాసింది. ఏదో ఒకటి” అని సెలవిచ్చారు.
"జడభరతుడు కూడా ఎప్పుడూ శరీరాన్నంటకుండా ఉన్నట్లే ఉండేవారుకాబోలు"
అన్నారా భక్తులు. “అవునవును" అన్నారు భగవాన్. "అయితే వారు శరీరాన్ని
ఎరుగని పెద్ద ఆత్మ గా ఉండటం వల్లనేనా జడభరతుడనే పేరు వచ్చింది?"
అన్నారా భక్తులు. "కాక మరేమి? జడం వలే పడిఉన్నదనా అర్ధం. శరీరాన్ని లక్ష్యం
చేయని ఆత్మస్వరూపులన్నమాట." అని సెలవిచ్చారు భగవాన్.

    ఇందుకు తార్కాణంగా ఇక్కడికి వచ్చిన మొదటి రోజుల్లో శ్రీ భగవానే
అరుణాచలేశ్వర ఆలయ ప్రాకారంలో ఇప్ప చెట్టు కింద, పూదోటలోనూ,
వాహన మండపంలోనూ ఇంకా అక్కడక్కడా శరీరాన్ని లక్ష్యం చేయకా
కర్చుని ఉన్నప్పుడు అటు వచ్చే పోయే జనసామాన్యం వారిని చూసి" జడం వలే
కూర్చుని ఉన్నాడు, ఎవరో పిచ్ఛవాడు." అని అనుకుంటూ పోయేవారనీ , వారి
మాటలకు తమలో తామే నవ్వుకుంటూ " ఈ పిచ్చ అందరికీ పడితే ఎంత
బాగుండును" అని అనుకునే వాడిని అని భగవాన్ అనేక సార్లు సెలవిచ్చారు.
అదే కాక కుంజుస్వామి భగవానుని సేవ కొరకు సర్వాధికారిచే నియమితులైఉన్న
రోజుల్లో భగవానుని శరీరము ,తలా ,వణుకుతూ , తూలుతూ ఉండడం చూచి,
అంతేవాసులే తప్ప అన్యులులేని సమయంలో, శ్రీవారి నుద్దేశించి వినయంగా,
"భగవానుకు నడి వయస్సులోనే తలా, ఒళ్ళూ వణకుతూ వుండడమూ,
కట్టపట్టుకొని నడవడమూ వచ్చాయే అందుకు కారణం ఏమిటి?” అని
అడిగారట. భగవాన్ మందహాసంతో “ఏమున్నదీ. ఒక చిన్న గుడిసెలో పెద్ద
ఏనుగను కట్టివేస్తే ఆ గుడిసె ఏపాట్లు పడక ఏమవుతుంది? ఇదీ అంతే” నని
సెలవిచ్చారట.

    ఆ మాటలలో ఎంత మహత్తరమైన అర్థం ఉందో చూచావా? ఆ అర్థం
అందరికీ విశద పరచక అప్పుడప్పుడు పరిహాసోక్తిగా “చూచారా, మీ అందరికీ
రెండే కాళ్ళు అయితే నాకు మూడవ కాలుంది." అని సలవిస్తూ ఉంటారు భగవాన్.
మహావాక్య రత్నమాలలో జ్ఞానిని గూర్చి ఏ విధంగా చెప్పారో చూడు.
  "అంధవజ్జడ వచ్ఛాపి మూకపఛ్ఛ మహీం చరేత్"
Telegram
T.me/bhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ