రమణాశ్రమ లేఖలు  216 (15-1-49)

రమణాశ్రమ లేఖలు  216 (15-1-49)
https://bhagavanraman.blogspot.com/2019/01/216-15-1-49.html
అరుణాచల దివ్యదృశ్యాలు

  ఈ మధ్యాహ్నాం రెండింటికే భగవాన్ సన్నిధికి వెళ్ళాను. అట్టే జనం లేరు.
సేవకులు, చొరవగల భక్తులూ కొందరు ఉన్నారంతే.   భగవాన్   వారితో
యిష్టాగోష్టిగా మాట్లాడుతున్నారు. ఆ ప్రశంగవశంగా ఒక భక్తుడు  శ్రీవారి
నుద్దేశించి" ఈ కొండ మీద పెద్ద పెద్ద దేవాలయాలు, తోటలూ మొదలైనవి
కనిపించినట్లు భగవాన్ ఒకసారి సెలవిచ్చారే, అదంతా భగవాన్ కొండమీద
ఉండగానేనా?" అన్నాడు.

   “అవును.    విరూపాక్షగుహలో ఉండగానో ఏమో కళ్ళు మూసుకుని 
ఉన్నాను. కొండమీదుగానే అలా ఈశాన్యం వైపున పోతూ ఉంటే ఒక చోట
మంచి పూలతోట, పెద్ద దేవాలయం, చక్కని  ప్రహరి, ఆ ప్రహరి లోపల పెద్ద
నంది, అన్నీ కనుపించినవి. విలక్షణమైన వెలుతురు. ఎంతో చక్కగా ఉంది.
చూస్తూ ఉండగానే పూజాకాలమయింది. గంటకొట్టారు. వెంటనే కళ్ళు తెరిచాను”
అన్నారు భగవాన్. “ఒక పెద్ద గుహ వున్నట్లూ భగవాను ఎప్పుడో చెప్పారు కదా?”
అన్నారా భక్తులు. “అవునవును. అదీ కొండమీద ఉండగానే.అలా అలా
పోతూండగా ఒకచోట పెద్దగుహ కనపడింది. ఆ గుహలో ప్రవేశించి చూతును కదా
అనేక జలధారలూ, రమ్యమైన తోటలూ, ఆ తోటల మధ్యన కోనేళ్ళూ, తీర్చిన
బాటలూ, చక్కని వెలుతురూ ఎంతో వింతగా ఉంది. పోగా పోగా ఒక వనంలోని
సరోవరం ఒడ్డున, ఒక వృక్షంకింద సిద్ధపురుషుడు, దక్షిణామూర్తి వలె ఆసీనుడై
ఉన్నాడు. వారిచుట్టూ చాలామంది మునులు కూర్చుని ఉన్నారు. వీరేదో
అడుగుతున్నారు. వారేదో చెపుతున్నారు. ఆ స్థలమంతా నాకు చిరపరిచితం
వలెనే ఉంది. అంతే కళ్ళు తెరిచాను. ఆ తరువాత కొన్నాళ్ళకు సంస్కృతంలో
వున్న అరుణాచల పురాణం చూస్తే ఈశ్వరవాక్కుగా చెప్పబడిన:

శ్లో. అత్రసిధ్ధః పునర్నిత్యం సురార్చితః|
మమాంతరే గుహా దివ్యా ధ్యాతవ్యా భోగసంయుతాం ||

శ్లో. అగ్ని స్థంభ మాయం రూప మరుణాద్రి రితి శ్రుతః|
ధ్యాయన్ లింగం మమ , బృహస్మదం,కుర్యాత్ ప్రదక్షిణం||

     (అరుణాచల మహాత్యం-- పూర్వార్థం-9- అ.) అన్న శ్లోకాలు రెండూ
కంటబడినవి. ఈ రెండిింటిలోనూ ఆ గుహను గుఱించీ సిద్ధపురుషుని గురించి
చెప్పబడి ఉన్నందువల్ల , అరే! మనకు తోచిందే ఈ శ్లోకాలలో సిద్ధపురుషుని, అని 
ఆశ్చర్యం కలిగి అప్పుడే దానికి అనువాదంగా  అరవంలో 'అంగియురు వాయు
మొళి మంగుగురియహ'అన్న పద్యం రాసాను. తాత్పర్యం ఏసుంటే 'అగ్ని (జ్యోతి)
స్వరూపుడనయ్యు ప్రకాశమును మరుగుపరచి, గిరిగా నుండుట లోకము
ననుగ్రహించుటకే. ఇక్కడ సిద్దరూపమున సదా నివసింతును. నాలో పొంగి
(వెల్లి విరిసి)  వెలుగు గుహ, బహుభోగ సమన్వితమై యుండుట నీలో
నెరుంగుము' అని భావం.అందుకు అనుగుణంగా ఆ మధ్య ఆది అణ్ణామల
దేవాలయానికి జీర్ణోద్ధరణ జరిగినప్పుడు, గర్భగుడికి లోవరుసన పెద్ద సొరంగం
కనిపించింది.  ఆ సొరంగం ఎక్కడిదాక ఉందో చూద్దామని కొందరు అందు
ప్రవేశించి చూసి, ఆది అరుణాచల అంతగర్బాగానికి పోయిందని తెలుసుకొని
ముందుకు పోలేక తిరిగి వచ్ఛారనీ తెలిసింది. ఓహో! మనకు తోచిందీ,పురాణంలో
చెప్పింది నిజమే సుమా.ఇదే ఆ గుహామార్గమని అనుకున్నాను. ఆ గుహలో నుంచి
సిద్ధపురుషులు రాత్రికి రాత్రి వచ్చి ఈశ్వరుని సేవించి వెడుతూ ఉంటారని ప్రతీతి.
అంతవరకెందుకు. ఈమధ్య ఇక్కడే అటువంటివి గోచరించినని, కొండకు
వెడదామని వెడుతూ ఉంటే, అదుగో ఆ మెట్లు దిగేసరికి అదొక రాజధానివలె
పెద్ద పెద్ద మేడలూ, తీర్చినట్టున్న రాజమార్గాలూ, మంచి వెలుతురూ, అంతా ఒక
పట్టణ ప్రదేశంవలెనే ఉంది. ఒక చోట మీటింగు జరుగుతూ ఉంది. చాడ్విక్ కూడానే
ఉన్నాడు. అతను 'భగవాన్! ఇదంతా ఇంత ప్రత్యక్షంగా ఉంది కదా. దీన్ని స్వప్నమంట
ే ఎవరు నమ్మగలరు?' అని అడుగుతాడు పైగా". ఆంతా అప్పుడు జరుగుతున్నట్లే ఉంది.
ఇంతలో కళ్ళు తెరిచాను" అని సెలవిచ్చారు భగవాన్.

  " ఇదంతా నిజంగా స్వప్నమేనా? " అన్నారొక భక్తులు. "ఏమో, స్వప్నమో,ఏదో.
ఏది నిజం?"అని సెలవిచ్చి మౌనం వహించారు భగవాన్.
Telegram
T.me/bhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ