రమణాశ్రమ లేఖలు 215 (14-1-49)
రమణాశ్రమ లేఖలు 215 (14-1-49)
https://bhagavanraman.blogspot.com/2019/01/215-14-1-49.html
నవమణిమాల
భగవాన్ దీక్షాస్వీకార విషయమైన కథ చెప్పగా విన్ల ఒక భక్తుడు ఈ
ఉదయం ఎనిమిది గంటలకు శ్రీవారి సమీపంలో కూర్చుని ఇష్టాగోష్టిగా
మాట్లాడుతూ “పూర్వం, చిదంబరం నుండి కూడా ఎవరో వచ్చి నటరాజ
దర్శనార్థం రావలసిందనీ భగవాన్ను తొందరించారట కదూ?, అన్నాడు.
“అవునవును, అదీ విరూపాక్ష గుహలో ఉండగానే, 1914 లేక 1915
లోనో అనుకుంటాను. చిదంబరంలో వుండే దీక్షితుల (అర్చకుల) లో ఒకరు
మన సంగతంతా విని వచ్చి, టవునులో బసచేసి, నిత్యం గుహకు వస్తూ
పోతూ ఉండేవారు. వచ్చినప్పుడల్లా అదీ యిదీ మాట్లాడడంలో అపుడప్పుడు
"స్వామీ! ఈ దక్షిణాపథంలో ఉన్న పంచలింగాలలో* అంబరలింగం గొప్పది
కదా, తాము ఒక్కసారి అక్కడకి దయచేసి, నటరాజ దర్శనం చేసుకోరాదా?
దయచేయండని తొందరచేస్తూ వచ్చారు. ఆ సందర్భంలోనే ఒకనాడు
ఒక కాగితం మీద “అచలనే యాయిను మచ్చపై తన్నిల్' అనే వెణ్పా పద్యం
రాసాను.
తాత్పర్యం ఏమంటే 'తండ్రి (శివుడు) అచలుడే అయినను ఆ సభ
(చిదంబరం)లో అచలయైన అంబ ఎదుట ఆడును. (నటరాజ నృత్యమని
భావం) అచలరూపమందు ఆ శక్తి ఉపశమింపగా ప్రకాశించే వెలుగును
అరుణాచలమని తెలియుము' అని. అంటే, చలించే అంబరలింగము కన్న
చలనరహితమై ప్రకాశించే అరుణాచలమే శ్రేష్టమని భావం. ఆ పద్యం
చూచిన తరువాత వారు నన్నక్కడకు రమ్మని పిలవడం మానివేసారు.
తరువాత ఆ పద్యం నవమణిమాలకు మొదటిదిగా చేర్చాము" అని
సెలవిచ్చారు భగవాన్.
{"పృధ్విలింగం -తిరువారూరు, అప్పులింగం- జంబుకేశ్వరం, తేజోలింగం-
అరుణాచలం,వాయులింగం -శ్రీకాళహస్తి, అంబరలింగం-చిదంబరం.}
"నమణిమాల పద్యాలన్నీ ఇదే విధంగా అప్పుడప్పుడు రాసారు కాబోలు?”
అన్నాడు వెంకటరత్నం. “అవునవును” అంటూ భగవాన్ చిరునవ్వుతో ఇలా
సెలవిచ్చారు."ఇంచుమించు ఆ రోజుల్లోనే ఒకనాడు ఈశ్వరస్వామి ఏం
చేశారనుకున్నారు?తమిళనాడులో ఒట్టకూత్తరు అనే ఒక మహాకవి, ప్రజలతో
పందెం చరిచి పాడిన పద్యాలలో “ఇడుక్కప్పుబడుం నిరుప్పుక్కొండుడన్'
అనే పద్యం చదివి 'భగవాన్ ఇదే భావంతో, ఇదే చందస్సులో, ఈ విధమైన
యతిప్రాసలతోనే, ఒక పద్యం రాయాలి' అని పట్టుబట్టి కూర్చున్నారు. ఒట్టకూత్తరు
ఆ విధమైన యతిప్రాసలతో పద్యం రాస్తానని ప్రజలతో పందెం చరిచి, చింగళరాజా
తనకిచ్చిన పారితోషికములను గురించీ, తన పాండిత్య ప్రతిభను గురించి, సభలో
పొగుడుకుంటూ ఆ పద్యం రాసారు. నన్నూ అదే విధంగా రాయమంటారు వీరు.
ఏం చేసేదీ? అప్పుడు ప్రస్తుతం నవమణిమాల లో ఎనిమిదవదిగా ఉన్న
'భువిక్కుట్పొంగిడుం భువిచ్చొరుంగవన్' అన్న పద్యం రాసాను.
తాత్పర్యం ఏమంటే ‘భూమికి అతిశయమగు, భూమినాథేశ్వరుని పురమైన
తిరుచ్చుళియందు, పుణ్యాత్ముడైన సుందరమయ్యరనే పతికి, అళగమ్మ అనే
సతికి జన్మించిన నన్ను, భూవిభుడైన అరుణాచలుడు తన హృదయ ముప్పొంగ,
భువిని గల విషయములచే కలుగు తాపమునుండి తప్పించి, చిన్మయము
జ్వలింప, తన్మయ ముప్పొంగ, తన పదము నాకిచ్చెను' ఇదే భావం. మిగతా
ఏడు పద్యాలున్నూ ఇదే విధంగా ఏదో ఒక కారణం వల్లనే రాయడమయింది.”
“ఆ కారణాలు కూడా ఏవో సెలవిస్తే” అన్నాను. “సరి సరి. నీకేమీ పనిలేదు”
అని అంటూ ప్రసంగం తప్పించారు భగవాన్. ఇప్పటికి ఇంతే ప్రాప్తమని
ఊరుకున్నాను.
Telegram
T.me/bhagavanRaman
Comments
Post a Comment