రమణాశ్రమ లేఖలు 214 (13-1-49)
రమణాశ్రమ లేఖలు 214 (13-1-49)
https://bhagavanraman.blogspot.com/2019/01/214-13-1-49.html
దీక్షా స్వీకారం
భగవాన్ శివగంగ పీఠాధిపతుల సమావేశాన్ని గురించి, నృసింహభారతుల వారిని గురించి చెప్పిన మాటలు విన్న ఒక భక్తుడు భగవానుని చూసి "చాలా కాలం క్రిందట శృంగేరి పీఠం నుంచి ఎవరో ఒక వచ్చి భగవాన్ను దీక్షా స్వీకరణం చేసుకోవలసిందని చెప్పారట కదూ"అన్నాడు." అవునవును నేను విరూపాక్ష గుహకు వచ్చిన మొదటి రోజుల్లోనే శృంగేరీ మఠంలో ఉండే ఒక శాస్త్రులవారు నన్ను చూడాలని ఒకనాటి ఉదయాన వచ్చారు,నన్ను చూసి చాలా సేపు మాట్లాడి చాలా వరుకు సంగతి గ్రహించి భోజనార్థం ఊళ్ళోకి వెళ్ళబోతూ నాకు దగ్గరగా నిలిచి, భక్తితో చేతులు జోడించి స్వామీ ! నాదొక విన్నపం చిత్తగించాలి.' అన్నారు ఏమది? అన్నాను. వారు వినయవిధేయతలతో స్వామీ! తాము బ్రాహ్మణులుగా జన్మించినందువల్ల శాస్త్రోక్తంగా దీక్షాస్వీకారం చేసుకోవద్ధా ? పూర్వంనుండీ వచ్చిన ఆచారం కదా, అవన్నీ తమకు తెలిసినవే. నేను చెప్పేది ఏముంది. తమరిని మా గురుపరంపరా స్తోత్రం లో చేర్చుకోవలెనని ఉంది. అందువల్ల భగవాస్ అనుజ్ఞ ఇస్తే మా మఠం నుండి అన్ని సామాన్లతో ఇక్కడికే వచ్చి దీక్ష ఇవ్వగలరు. పోనీ మీకు అఖండకాషాయం ఇష్టం లేకుంటే ఈ కౌపీనమైనా కాషాయంగా ధరిస్తే మంచిదని ప్రార్థిస్తున్నాను. మీరు బాగా నీయవచ్ఛును. నేను కొండ దిగి భోజనం చేసి ఈ మూడు గంటల వేళకు తరిగి రాగలను. మా మఠంలో అందరూ మిమ్ములను గురించి ప్రసిద్ధిగా విని, చూసిరమ్మని పంపితే వచ్చాను. అనుగ్రహించాలి' అని చెప్పి వెళ్ళారు.
వారు వెళ్ళిన కాస్సేపటికల్లా ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఒక మూటపట్టుకొని వచ్చాడు. ముఖం ఎప్పుడో చూచినట్లే ఉంది. ఆ మూటలో పైన పుస్తకాలున్లట్లు బైటికి తెలుస్తూ ఉన్నవి. వచ్చీ రావడమే ఆ మూట నా ఎదుట పెట్టి చిరపరిచితునివలే 'స్వామీ! నేను ఇప్పుడే వచ్చాను. స్నానం చేయలేదు. ఈ మూట చూచేవారుఎవరూ లేరు. కొంచెం చూచుకో' అని చెప్పి వెళ్ళాడు. వారటు వెళ్ళగానేఎందుకో నాకు మూట విప్పి పుస్తకాలు చూద్దామన్న బుద్ధి పుట్టింది. విప్పగానే "అరుణాచల మాహాత్మ్యం” అన్న సంసృత అక్షరాలున్న గ్రంథం నా కంటబడ్డది. ఆ మాహాత్యం సంస్కృతంలో కూడా ఉందన్న సంగతి నాకు లోగడ తెలియదు అందువల్ల ఆశ్చర్యం కలిగి పుస్తకం తెరిస్తే ముందు ఈశ్వరవాక్కుగా స్థల విశేషాన్ని గుణించి చెప్పిన ఈ క్రింది శ్లోకం కంటపడ్డది.
“యోజనత్రయమాత్రేస్మిన్ క్షేత్రే నివసతాం నృణాం!
దీక్షాదికం విన్ఆప్యస్తు మత్సాయుజ్యం మమాజ్ఞయా!!”
తాత్పర్యం:- ఈ స్థలమునకు (ఈ అరుణగిరికి) మూడు యోజనముల లోపల నివసించేవారికి ఆచరించదగిన దీక్షాదులేమీ లేకున్నప్పటికీ పాశరహితమైన నా సాయుజ్యము సిద్ధము. ఇది నా యాజ్ఞ.
(అరుణాచలమాహాత్మ్యం. పూర్వార్థం అ--4--శ్లో--25)
ఆ శ్లోకం చూడగానే ఆ. సరి. సరి, ఆ శాస్త్రులవారికి చెప్పేందుకు ఇది సరియైన సమాధానంగా దొరికిందని, వెంటనే ఆ ఒక్కటీ కాగితములు రాసుకుని చేసుకొని ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఎక్కడ రాబోతాడోనని యథాప్రకారం మూటకట్టి పెట్టాను. సాయంత్రం శాస్త్రులవారు రాగానే ఈ శ్లోకం చూపాను. వారన్నీ చదివిన వారే కనుక మరి మాట్లాడక అతిశయించిన భయభక్తులతో నమస్కరించి వెళ్ళిపోయి, నృసింహ భారతుల వారికి ఈ విషయమంతా చెప్పారట. వారెంతో నొచ్చుకొని " ఇక చాలును ఈ ప్రయత్నం విరమించండి' అని అన్నారట. తరువాత, ఆ శ్లోకానికి అనువాదంగా 'యోజనై మూన్జామిత్తల వాసర్కు' అన్న వృత్తం రాసాను.
అప్పుడది అరుణాచల స్తుతిపంచకానికి ఆదిలో చేర్చాము. ఇదే విధంగా, ఎందరో వారి వారి మార్గాలకు త్రిప్పాలని చూచేవారు. వట్టివట్టి మాటలెన్ని చెప్పినా 'సరి సరి' అనేవాణ్ణే కాని, దీక్షాస్వీకారం చేసుకోండి అని అంటే మాత్రం ఒప్పేవాణ్ణి కాదు, తప్పుకునేందుకు ఇదే విధంగా ఏదో ఒక ఉపాయం దొరికేది. పద్యాలు రాయడం అంతే. నేనుగా సంకల్పించి ఒక్కటీ రాయలేదు. ఏదో ఒక కారణం పెట్టుకొని ఎవరో ఒకరు అడిగేవారు. ఏదో ఒక ప్రేరణతో రాసేవాణ్ణి. అంతే” అని సెలవిచ్చారు భగవాన్.
“ఈ ఒక్క పద్యానికే ఇంతకథ వున్నదే?” అన్నారా భక్తులు. “ఆ”అవును. ఒక్కొక్కదానికి ఒక్కొక్క కథ ఉంది. అన్నీ రాస్తే అదే ఒక గ్రంథమవుతుంది” అన్నారు భగవాన్. “భగవాన్ సెలవిస్తే రాయవచ్చును” అన్నా నేను. “నీకేం పనిలే” దంటూ మాట మార్చారు భగవాన్
“ఆ మూట తెచ్చిన బ్రాహ్మణుడు మళ్ళీ వచ్చాడా?” అన్నారా భక్తులు. “ఏమో, వారు వచ్చిందీ లేనిదీ జ్ఞప్తిలేదు కానీ, మూటమాత్రం లేదు. మనకి కావలసింది దొరికింది చాలదూ?" అన్నారు భగవాన్. "అరుణాచలేశ్వరుడే ఈ రూపంతో వచ్చాడన్నమాట” అన్నారా భక్తులు. “ఊ. ఊ” అంటూ తలవూపి భగవాన్. మౌనం వహించారు భగవాన్.
Telegram
T.me/bhagavanRaman
Comments
Post a Comment