రమణాశ్రమ లేఖలు 213 (10-1-49)

రమణాశ్రమ లేఖలు 213 (10-1-49)
Https://bhagavanraman.blogspot.com/2019/01/213-10-1-49.html

శివగంగ పీఠాధిపతుల రాక

పూరీ శంకరాచార్యులవారు వెళ్ళిన తరువాత ప్రసంగవశంగా ఒక భక్తుడు భగవానుని తో  “శంకర పీఠాధిపతులలో ఇక్కడికి వచ్చింది వీరొక్కరేనా?" అన్నాడు."నేను విరూపాక్ష గుహలో ఉండగా శివగంగ పీఠాధిపతులూ వచ్చారు. వారు ప్రస్తుతం  శివగంగ పీఠాధిపతులుగా ఉన్నవారి తండ్రికి తాత. వీరికీ వారికీ మధ్యన రెండు పీఠాంతరాలున్నవి” అన్నారు భగవాన్. “వారేమైనా భగవాన్ను ప్రశ్నించారా?” అన్నాడా భక్తుడు. “ప్రశ్నించడానికి ఏమున్నది? వారు మంచి వివేకం కలవారూ, పండితులూను. నన్ను చూచిన తరువాత తమ సమీపస్తులతో సుభి అంటే రమణుడే సుఖి. ఇలాంటి సుఖం నాకు వెయ్యి జన్మలకైనా లభించడం దుర్లభం' అన్నారట వారు” అని సెలవిచ్చారు భగవాన్. “వారు కూడా భగవాన్ ఉన్నచోటనే బసచేసారా?” అన్నాడా భక్తుడు.

     “లేదు, లేదు. అదొక విచిత్రమైన సన్నివేశం. వారు శిష్యులతో వచ్చి టవునులోని సత్రంలో బసచేసి నన్నక్కడకు రమ్మని అహ్వానించారు. మనమేమి పండితులమా పోయేందుకు. ఏమి అర్హత ఉన్నదని రానన్నాను. వారది విని తామే శిష్యులతో సహా బయలుదేరి, పెద్దపళ్ళెంలో సరిగంచు శాలువా నూట పదహారు రూపాయలు పెట్టుకొని, నావద్దకు రావాలని కొండ ఎక్కుతూ ఉంటే, నేను ములైపాల్ తీర్థంవద్ద నుండి కమండలం పుచ్చుకుని విరూపాక్ష గుహకు పోతూ ఉన్నాను. ఆ మధ్యలో ఉన్న వృక్షం దగ్గర ఉభయులనూ కలుసుకున్నాము. వారు పళ్లెం నాముందు పెట్టి, స్వామీ! ఇది తాము స్వీకరించాలి" అంటే నేను సమ్మతించలేదు. కడకు డబ్బు వారే తీసుకుని 'శీతకాలంలో కప్పుకోవడానికి ఉపయోగిస్తుంది, శాలువ గ్రహించడని తొందరించారు. తిరస్కారం కూడదని అది మాత్రం తీసుకొని సరిగంతా చించి, అంచులు కుట్టి కప్పుకుంటూ వచ్చాను. ఆ సరిగ మొన్నటి వరకు ఇక్కడే ఉండాలి. వారు వెంటనే వెళ్ళారు. అప్పటికే చాలా వృద్ధులు ఇక్కడికి వచ్చి వెళ్ళిన కొద్ది రోజులకే సిద్ధి పొందారు” అని సెలవిచ్చారు భగవాన్.

  "శృంగేరి పీఠాధిపతులెవ్వరూ రాలేదా?” అన్నారా భక్తులు. "లేదు నృసింహ భారతుల వారుండగా రావాలని చాలాసార్లు యత్నించారు. నన్ను గురించి ' ఆ బ్రాహ్మణస్వామి సుఖంగా ఉన్నాడా?” అని ఎప్పుడూ అడుగుతూ ఉండే వారట. 'అన్నారు భగవాన్. 'వారు ఆంధ్రులా?' అన్నాను. 'అవును. ఏమి? అన్నారు భగవాన్. "నృసింహ భారతి అనేవారు తెలుగులో మంచి రసవత్తరం గానూ,
ఆధ్యాత్మికంగానూ దేవీనక్షత్రమాలా కీర్తనలు రాసారు. వారూ వీరూ ఒక-రేనా' అని అడిగాను. “ఉండవచ్చును. వారు పండితులూ, కవులూను" అని సెలవిచ్చారు భగవాన్.

“వారు రావాలని యత్నించి కూడా ఎందుకు రాలేదో?” అన్నారా భక్తులు. “ఏమున్నదీ. పీఠాధిపతులాయె. ఎన్నో నిబంధనలు. చుట్టూ ఉన్నవారు ఒక పట్టాన రానిస్తారా?” అన్నారు భగవాన్. “చుట్టూ ఉన్నవారేం చేస్తారు భగవాన్ విచిత్రంగా చెపుతారే?” అన్నారా భక్తులు. “ఏం చేస్తారా. చూడండి ఇప్పుడు మన స్థితి ఎలాగుందో. జైలుకు పెట్టినట్టే కర్ర కటకటాలు పెట్టారు. గిరి గీసినట్లది దాటరాదు. ఒకరు విడిస్తే ఒకరు కాపలా. కదిలామంటే కపట్దార్. డ్యూటీ ప్రకారం అదుగో వారు వస్తున్నారు. వీరు వెడుతున్నారు. డ్రస్సు లేదన్నమాటే కాని పోలీసులకూ వీరికీ భేదం ఏమున్నది? వారి అధీనంలో మనమున్నాము. లఘుశంకకు పోదామన్నా వెనక కాపలా తప్పదు. అదీ టైం ప్రకారమే లేవాలి. ఎవరు గానీ ఆసులో పర్మిషన్ తెచ్చుకుంటే ఏదైనా చదవాలి, మాట్లాడాలి కానీ, లేకుంటే లేదు. దీన్ని ఏమంటారు. జైలుకూ దీనికి ఏం భేదం? ఇంచుమించువారికీ ఇంతే. మతాధిపత్యమంటే అదీ ఒక జైలే. వారేం చేస్తారు పాపం ' అని సెలవిచ్చారు భగవాన్
 
“అందుకే ఈశ్వరునకు భక్తపరాధీనుడన్న పేరు వచ్చింది కాబోలు అన్నాను. "అవును స్వామిత్వానికే ఇంత పాటుంటే వారిపాటు చెప్పాలా? ఎవరు ఏపేరుతో పిలిస్తే ఆ పేరున పలకాలి. ఏ రూపంతో రమ్మంటే ఆ రూపంతో రావాలి. ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి. అడుగు దాటి కదలరాదంటే అల్లాగే నిలిచిపోవాలి. పరాధీనతగాక వారికేం స్వతంత్రం 'ఉంది' అని చెప్పారు భగవాన్.
Telegram
T.me/bhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ