రమణాశ్రమ లేఖలు 211 (22-12-48)
రమణాశ్రమ లేఖలు 211 (22-12-48)
https://bhagavanraman.blogspot.com/2019/01/211-22-12-48.html
పచ్చయమ్మ దుర్గ
నేడు మంగళ వారం కదా. నిన్న సాయంత్రమే భగవానుని సెలవు పొంది వేకువజామున మూడున్నరకే బయలుదేరి గిరిప్రదక్షిణం వెళ్ళాను పచ్ఛయమ్మ కోవెల వైపుకు వచ్చేసరికి సూర్యోదయమైంది. ప్రొద్దెక్కలేదు కదా, పచ్చయమ్మ కోవెల వద్దకు వెళ్ళి అక్కడ నుండి గిరిపాదమందున్న అడవిమార్గంగా వెడితే పూర్వం శ్రీవారికి హార్ట్ ఆగినపుడు ఆనుకొని కూర్చున్న తాబేటిబండను చూడవచ్ఛునని చూచి ఆ దారినే ఆశ్రమం చేరుకుందామని తోచి కోవెల ముందున్న కోనేటి వద్దకు వెళ్ళాను. అక్కడ ఎవరో స్నానం చేస్తుంటే "దేవాలయం తెరిచి ఉందా?" అన్నాను,
"నేను అర్చకుడనమ్మా! తలుపు తెరుస్తాను” అన్నాడాతడు. భగవాన్ అప్పుడప్పుడూ అక్కడ ఉండేవారని విన్నాము కనుక ఆ స్థలం చూడవలెనన్న కుతూహలంతో ఎన్నిసార్లు వెళ్లినా, ఆ వేళకు అర్చకులురాక తలుపులు మూసే ఉండేవి. ఈనాడది చూచే అవకాశం చిక్కినందుకు ఆనందం కలిగి అర్చకునితో ఆలయంలోకి ప్రవేశించాను. గౌతమాది ఋషి సేవితయై ఉన్న అమ్మను దర్శించి, అర్చన చేయించి, విభూతీ కుంకుమా ప్రసాదంగా గ్రహించి, కొండపాదాన్ని అనుసరించే నడుస్తూ తాబేటి బండ ఉండే స్థలం గుర్తించలేక, ఆ మార్గంగానే ఆశ్రమానికి వచ్చాను. భగవానుకు నమస్కరించి లేవగానే నా చేతులలో పొట్లాలు చూచి “ఏమది?” అని ప్రశ్నించారు భగవాన్. పై సమాచారం విన్నవించాను.
భగవాన్ తమ సమీపంలో వున్న సుందరేశయ్యరును చూచి “ఏమోయ్. అమ్మ పచ్చయమ్మ ప్రసాదమట. తేవోయ్” అని తెప్పించుకొని నుదుట ధరిస్తు "ఆ కోవెలకు కుడి ప్రక్కన కొత్తగా కట్టినవి రెండుగదులున్నవి, చూచారు కదా?” అన్నారు నాతో, “చూచాను. ఎవరో పొయ్యి పెట్టి వంట చేసుకుంటున్నారు” అన్నాను. 'ఆ-ఆ, అదే. వంట నిమిత్తమే అవి ప్రత్యేకంగా కట్టించారు. కట్టిన కొత్తలో మేమంతా గిరిప్రదక్షిణం వెళ్ళి పచ్చయమ్మ కోవెలలో బసచేద్దామని సామానంతా తీసుకొని వెళ్ళాం. అక్కడ పని చేస్తున్న అధికారులు మా రాకకు చాలా సంతోషించి 'ఈ కొత్త గదుల్లో ముందు మీరే బసచేసి వండి విందారగించండి స్వామీ! ఇవి తయారైన వెంటనే యాదృచ్ఛికంగా మీరు రావడం మా భాగ్యం' అన్నారు. ఇంకేం మేమే గృహప్రవేశం చేసిమన్న మాట. నాయనా, మేమూ నివాసంగా ఉంటూ వచ్చినప్పుడు ఆ గదులు లేవు. అమ్మ సన్నిధిలోనే అన్నీ చేసేవాళ్ళం” అని సెలవిచ్చారు భగవాన్.
'ఆ దేవికి పచ్చయమ్మ అన్న పేరెందుకు వచ్చింది'? అన్నాను. పచ్చ అంటే శ్యామల వర్ణం. అంటే నలుపన్నమాట. పార్వతి నలుపు కదా. గౌతమాశ్రమానికి వచ్చిన దేవి 'పచ్చయమ్మ' అన్న పేరుతో ఆ ప్రదేశంలో కొన్నాళ్ళుండి ఈశ్వరునుద్దేశించి తపస్సు చేసిందట. ఆ తరువాత గిరికి ప్రదక్షిణంగా బయలుదేరి అక్కడక్కడ తపస్సుచేసి, కడపట అపీతకుచాంబయై శివుని అర్ధశరీరం పొందిందట” అని సెలవిచ్చారు భగవాన్.
" పార్వతికి దుర్గానామం ఎందుకు ఏర్పడ్డదో? అన్నారొక భక్తులు. దదుర్గముడనే రాక్షసుణ్ణి వధించి శాంతించిన దేవీ రూపానికే దుర్గాభిధేయం కలిగిందని అంటారు“ అన్నారు భగవాన్." ఈ ఊళ్ళో ఉన్న దుర్గాలయంలో ఖడ్గతీర్దం ఉంది కదా. అది ఏవిధంగా ఏర్పడ్డదో"? అన్నారా భక్తులు."దేవి మహిషాసుర వధకోసం అక్కడనుండే బయలుదేరిందని,ఆ మహిషాసురుని చంపగానే వాడు కంఠంలో కట్టుకున్న శివలింగం దేవి చేతికి అంటుకుని వదిల లేదని , ఆమె తిరిగి ఇక్కడికే వచ్చి స్ధానం చేద్దామని చూస్తే ఎక్కడా నీరు లేదని, అప్పుడామె తన ఖడ్గంతో భూమిని చీలిస్తే ఆ తీర్థం ఈ ప్రాదుర్భవింఛిందనీ, దేవి జలకమాడి తన చేతి నంటుకొనిఉన్న శివలింగాన్ని ఒడ్డున ప్రతిష్టించి ఆ తీర్థంలోనే అభిషేకపూజాదులు నిర్వర్తించి,తన్నావేశించిన రాజస భావాన్ని పరిత్యజించి భక్తాభీష్టఫల ప్రదాయినియై ఇక్కడ వెలిసిందని ప్రసిద్ధి ఆ తీర్థం జీవవాహిని. అక్కడ వెలిసింది ని ప్రసిద్ధి తీర్థం జీవన వాహిని ఇక్కడ ఎంత జలాభావం కలిగినా ఆ తీర్థంలో మాత్రం తప్పక నీళ్ళుంటవి." అని సెలవిచ్ఛారు భగవాన్.
“ఆ కోవెలలో శ్రీచక్రమేదో శిథిలమైతే భగవాన్ సరిచేసారని విన్నామే' అన్నారా భక్తులు. "అవును. నేను విరూపాక్షగుహలో ఉండగా దుర్గాంబ కోవెలకు కుంభాభిషేకం జరిగింది. ఆ ఉత్సవానికి ముందే కొంచెం శిథిలమైన శ్రీచక్రం నా వద్దకు తెచ్చి' స్వామీ! ఇది సరిచేసి ఇవ్వాలన్నారు. సరే నని సరిచేసి ఇచ్చాను నిజమే."అంటూ మౌనం వహించారు భగవాన్.
Telegram
T.me/bhagavanRaman
Comments
Post a Comment