రమణాశ్రమ లేఖలు 210 (24-11-48)

రమణాశ్రమ లేఖలు 210 (24-11-48)
Https://bhagavanraman.blogspot.com/2019/01/210-24-11-48-7-12.html
గురుపాద పద్మం

భగవాన్ కుడిపాదానికి అడుగువైపున ముందు భాగంలో ఎర్ర లేదామర (లేతతామర) రేకవంటిది పెద్ద మచ్చ వున్న సమాచారం నీవు గమనించావో లేదో. నేనూ చాలాకాలం చూడలేదు, ఈ చలికాంలో ఒకనాడు అది గమనించి కందిందేమోనన్న భీతితో "అయ్యో!  పాదానికేమి?" అన్నాను " అదా, మరేం లేదు చిన్నప్పటినుండి ఉన్నదే" అన్నారు భగవాన్. నాకు అప్పుడు అంతగా మనసు తట్టలేదు. నిన్న సాయంత్రం ప్రసంగవశంగా అలివేలమ్మ అత్తగారితో ఈ విషయం ముచ్చటిస్తే ఆమె "నేనూ ఒకసారి ఇదే విధంగా భయపడి భగవాన్ను అడిగితే నప్వుతూ 'అది పుట్టుమచ్చ. ఈ దొంగను పట్టుకునేందుకు ఇదే కదా గుర్తయింది' అని అన్నారమ్మా భగవాన్. పుట్టినప్పుడే ఉన్నదట. అది చూచే మా పినతండ్రి గుర్తించారట.” అని చెప్పింది.

    మహాపురుషులకు బొడ్డున మాణిక్యం, అరికాలున తామరపద్మం ఉంటుందని చిన్నప్పుడు కాశీమజిలీ కథలలో వినేవాళ్ళం కదా. ఆ చిహ్నం ఇదే కాబోలునని  యోచిస్తూ పడుకుంటే, కలలో ఆ పాదమే గోచరించింది. అదే చింతనతో ఈ ఉదయం 7-1/2 గంటలకే ఆశ్రమానికి వెళ్లాను. భగవాన్ అప్పుడే గోశాల వద్ధనుండి వచ్చి సోఫామీద కూర్చున్నారు. అందరి నమస్కారాలూ అయిన తరువాత నేను నమస్కరించి ఆ పాదంవైపే పరికించి చూస్తూ నిలబడ్డాను. భగవాన్ చూచి "ఏమి?" అంటూ తల ఊపారు. “ఏమీ లేదు. మహాపురుష లక్షణమైన ఆ పాదం చూస్తున్నాను" అన్నాను. భగవాన్ చిరునవ్వుతో 'సరిపోయింది' అని పేపరు. విప్పబోతున్నారు. “అత్త కూడా 'ఆ మచ్చ యేమి?' అని అడిగితే 'ఈ దొంగను పట్టుకునేందుకు ఇదే గుర్తయిందని భగవాన్ సెలవిచ్చారటే?" అన్నాను.

  భగవాన్ పేపరు అవతలవుంచి పద్మాసనస్థులై “అవును. మా పినతండ్రి సుబ్బయ్యరు పోయినప్పుడు, నెల్లియప్పయ్యరు మధురలో ఉంటే అణ్ణామలై తంపురానువల్ల నేను ఇక్కడ ఉన్నానని తెలిసినట్లు రమణలీలలో ఉంది కదా. ఆ తంబిరాను ఎంతచెప్పినా నెల్లియప్పయ్యరుకు తమవాడవునో కాదో అపనమ్మకమే.వారిక్కడకి వచ్చినప్పుడు ఈ మచ్చ చూచే తమవాడన్న నమ్మకం కలిగింది." అని సెలవిచ్చారు. "పాపం, వారికప్పుడు ఎంత ఆత్రుత కలిగిందో?" అన్నాను.

   "ఆత్రుత కాదా మరీ. తండ్రిలేని వాళ్ళమని మమల్ని ఎంతో జాగ్రత్తగా చూసేవారు. నేనిలా వచ్చానా. ఏమైనానో అన్న భయమే. ఇంతలో సుబ్యయ్యరు కూడా పోవడంవల్ల అన్ని కుటుంబాల భారం వారి నెత్తినే పడ్డది. అప్పుడే నేనిక్కడున్నానని తెలిసింది. ఆత్రుతతో పరుగెత్తి వచ్చారు. సుబ్బయ్యరుకైతే దర్పమూ,ధైర్యమూ బాగా ఉన్నవి కానీ, వీరు పరమసాధువు.
సుబ్బయ్యరైతే నన్ను విడిచి వెళ్ళే వారు కాదు. ఎత్తి మూట కట్టుకునైనా తీసుకుని పోయుందురు. మనం ఇక్కడే ఉండవలసిన యోగం ఉన్నందున వారు ఉన్నంతకాలం నా సంగతి తెలియనేలేదు. వారు పోయిన ఒక నెలలో ఈ సమాచారం తెలిసింది. నెల్లియప్పయ్యరు ఆధ్యాత్మిక చింత కలవారు, పరమ సాధువు కనుక  వాని కేల మనము తొందర కలిగించడమని విడిచి వెళ్ళారు.' అని చెప్పి ఊరుకున్నారు భగవాన్.

  "ఆ తోటకు కావలిగా ఉన్న రామనాయకర్, వారిని కూడా తోట లోపలికి రానీయలేదట కదూ?" అన్నాను. “అవును, చీటీ రాసి పంపారందుకే. ఆ చీటీ రాసేందుకూ వారి వద్ద పెన్సిల్ లేదు. పెన్ లేదు. ఏం చేస్తారు పాపం. ఒక వేపపుల్ల చీల్చి, రక్కెసపొదలో ఒక్కపండువుంటే దాన్ని చిదిపి,ఈ పుల్లతో ఆ రసం ముంచి రాసి పంపారు. సరే. లోపలికి వచ్చి, నేను తమతో వచ్చే విధం లేదని
తెలుసుకున్నారు. ఆ తరువాత ప్రక్కనున్న తోటలో ఒకరు కొంచెం చదివినవారు నలుగుర్ని పోగుచేసుకొని గ్రంథకాలక్షేపం చేస్తూవుంటే, వారివద్దకు మా పినతండ్రివెళ్ళి 'అయ్యా! మావాడు ఏలాగున్నాడు?' అని అడిగారు. అతని దృష్టిలో నేనేమీ తెలియనివాళ్లే. అందువల్ల '  ఎబ్బే,ఆ  కుఱ్ఱవాడు చదువులేకుండా, మొరటు వైరాగ్యంతో కూర్చుంటున్నాడండీ. కొంచెం విద్యాగోష్టి వుంటే మంచిది' అన్నారు వారు. వీరికి అసలే చిన్నవయస్సే, ఎవరివద్దా ఏమీ తెలుసుకోలేదే, ఏమైపోతాడో అని బెంగ. అందువల్ల వారితో 'అయ్యా! మా వాణ్ణి కాస్త కనిపెట్టి వుండి, ఏమైనా బోధించండి బాబూ' అని చెప్పి చక్కాపోయినారు. వారికి చాలాకాలం నాకేమీ తెలియదనే అభిప్రాయం. ఒకటి రెండుసార్లు నాకు బోధ చేయాలని చూసారు కానీ నేను లక్ష్యపెట్టలేదు. కడకు ఒకసారి ఈశాన్యంలో నేను గీతాసారం ప్రవచనం చేస్తుండగా వారు వచ్చారు. అప్పుడు, నాతో వాదించి నేను చెప్పే సమాధానాలన్నీ విని 'అబ్బో, ఇంతటి మహానుభావుడవా? ఏమీ తెలియదు, చదువు రాదు అని అనుకున్నాను' అంటూ దిఢీలున నమస్కరించి వెళ్ళిపోయినారు.నెల్లియప్పయ్యరుకు మాత్రం చాలాకాలం ఆ కీంచ వుండేది” అని సెలవిచ్చారు భగవాన్.

  "వారు తిరిగి రానేలేదా?” అన్నాను. “రాకేమి విరూపాక్ష గుహలో ఉండగా రెండుసార్లు వచ్చారు. ఒకసారి వచ్చినప్పుడు నేనేమీ మాట్లాడలేదు. అదివరకు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పటికీ, వారు వస్తున్నారని తెలిస్తే పెద్దలు, వారి ఎదుట మనమేమి మాట్లాడేదని పలక్కుండా కూర్చునే వాణ్ణి. వారి కించ ( బెంగ) తీరేదెట్లా. మరొకసారి వచ్చినప్పుడు ఏమయిందనుకున్నారు, వారు వచ్చేవరకూ తెలియనే తెలియదు. విరూపాక్ష గుహలో ఉండగానే, కొందరు దక్షిణామూర్తి స్తోత్రానికి అర్థం చెప్పమంటే గుహలో కూర్చునే చెప్పడానికి ఆరంభించాను. నిత్యం ద్వారానికి ఎదురు ముఖంగా కూర్చునేవాణ్ణి, ఆనాడు వెన్ను తిప్పి
కూర్చున్నాను. అందువల్ల వారు వచ్చింది తెలియలేదు. ముందే వచ్చి బయట ఉండే వింటున్నారట. 'నానాఛిద్ర' అనే శ్లోకం వరకూ వచ్చాం. దానికి అర్ధం చెప్పి వ్యాఖ్యానిస్తూ ఉండగా, తటాలున లోపలికి వచ్చి కూర్చున్నారు. మధ్యన ఆపేందుకు
లేదు. ఏం చేసేది. పోనీ లెమ్మని నిరాఘాటంగా వ్యాఖ్యానించాను. వారు అదంతా విని, 'మనవాడు సామాన్యుడు కాడు. విషయమంతా బాగా తెలుసుకున్నాడు ఇక ఫరవాలేద'ని కించ వదలి తృప్తితో వెళ్ళారు. అంతవరకూ దిగులే. చరమదశలో
కించ వదలింది. ఆ వెళ్ళటం వెళ్ళటం మళ్ళీ రానేలేదు. కొద్ది రోజుల్లోనే గతించారు.' అంటూ డగ్గుత్తిక వహించారు భగవాన్

“ఈ విషయం చరిత్రలో లేదే, ఎందుకు రాయలేదో?” అన్నాను. “ఉండవలసిందే. ఏమో వారడగ లేదు, నేను చెప్పనూ లేదు” అని సెలవిచ్చారు భగవాన్.
. telegram
T.me/bhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ