రమణాశ్రమ లేఖలు 209 (20-11-48)

రమణాశ్రమ లేఖలు 209 (20-11-48)
https://bhagavanraman.blogspot.com/2019/01/209-20-11-48-telegram-t.html
అగ్రహారం లో భిక్ష

ఈ మధ్యాహ్నాం రెండున్నర నుండీ తాము ఈ ఊరుకు వచ్చిన కొత్తలో జరిగిన సమాచారాలన్నీ మాతో ప్రసంగిస్తూ కూర్చున్నారు భగవాన్. మూడు గంటలు అయింది. గంభీరం కుప్పన్నగారు ఒక కల్యాణ పత్రిక తెచ్చి భగవానుకిచ్చి నమస్కరించారు. భగవాన్ వారితో ఆ పెళ్ళి ముచ్చట్లను గురించి రవంత మాట్లాడి, వారు కూర్చోగానే మా వైపు చూచి " గంభీరం శేషయ్య మనుమరాలికి
కల్యాణమట. ఆ పత్రిక అదే” అని సెలవిచ్చారు. 'అలాగా' అన్నాను. భగవాన్ చిరునవ్వుతో" వీరికి గంభీరం అనే ఇంటి పేరు ఎందుకు వచ్చిందో తెలుసా?" అన్నారు. 'తెలియదే' అన్నాను “అక్కన్న మాదన్నల వంశం వీరిది.తన మంత్రులైన అక్కన్న,మాదన్నలకు గోల్కొండ పాదుషా యిచ్చిన బిరుదు అది. ఇప్పుడదే ఇంటి పేరయింది.కడలూరులో  భగవంతస్వామి సమాధి ఉంది కదా. ఆ భగవంతస్వామి వీరి వంశం వారే." అని సెలవిచ్చారు భగవాన్ "అలాగా, అయితే, భగవంతస్వామి బ్రాహ్మణులా?" అన్నాను.

  “అవునవును. వారు శరీరాన్ని లక్ష్యం చేయకుండా ఎక్కడో పడిఉంటే సోమసుందరం పిళ్ళై ఉన్నారే, వాళ్ళ తల్లికి తండ్రి కడలూరులో ఉన్నారప్పుడు. వారు వీరిని చూచి తమ యింటికి తీసుకొని వచ్చి ఉంచుకున్నారు.కడకు వారింట్లోనే సమాధి అయినారు. ఈ కుప్పన్న వాళ్ళు వారున్నంతకాలం వారి నాశ్రయించుకొనే ఉండేవారు. వారు పోయిన తరువాత నన్ను పట్టుకున్నారు.
వీరు గంభీరం శేషయ్యకు అన్నకుమారులని  తెలుసు కదూ?" అన్నారు భగవాన్. “అది తెలుసును. వీరు ఆంధ్రులు కదా. అయ్యరు శబ్ధం వచ్చిందెందుకో?” అన్నాను. “అదా, వీరంతా చాలాకాలంగా ఈ దేశంలోనే ఉండటం వల్ల ఈ శబ్దం వచ్చింది. కొన్ని తరాలుగ ఉంటున్నారట. నేను గురుమూర్తంలో ఉండగా శేషయ్యరు అన్న కృష్ణయ్యరు  ఈ ఊళ్ళో సాల్టు ఇనస్పెక్టరుగా ఉన్నారు. నేను గురుమూర్తంనుంచి వచ్చి అయ్యంకులము అనే కోనేటికి ఎదురుగావున్న అరుణగిరినాథ ఆలయంలో కొన్నాళ్ళున్నాను. అప్పుడు
ఒకరాత్రి అగ్రహారంలోకి భిక్షనిమిత్తం వెడితే ఆ కృష్ణయ్యరింట్లో చాపమీద నలుగురు కూర్చుని మైనపువత్తి దీపం పెట్టుకొని చీట్లపేక ఆడుతూ ఉన్నారు. నేను చెయ్యి తట్టేసరికి ఉలిక్కిపడి అంతా లేచారు. కృష్ణయ్యరు సిగ్గుపడుతూ ఆ సరంజామా అంతా గబగబా తీసివేసి అన్నం కలిపి తెచ్చి భిక్షపెట్టారు. అప్పుడు వారెవరో నాకు తెలియదు. శేషయ్యరు వచ్చిన తరువాత ఆయన మా అన్నే' నని చెప్పేరు.' అయ్యో, స్వామి భిక్షకు వస్తే పేకాడుతూ కూర్చున్నామే' అని వారెంతో నొచ్చుకున్నారట. తరువాత వారు పేక ఆడడమే మానివేసారు” అన్నారు భగవాన్.
 
  “అక్కడుండగా భగవాన్ స్వయంగా భిక్షకు వెళ్ళేవారన్నమాట' అన్నాను.  “అవునవును. రాత్రికిరాత్రి వెళ్ళేవాణ్ణి.1898 ఆగష్టులోనో సెప్టెంబర్ లోనో అక్కడికి వచ్చాను. రాగానే నా దారి నాది నీ దారి నీవు చూసుకోమని చెప్పి పళనిస్వామిని కూడా పంపివేసాను. కాని వారు తిరిగి సాయంకాలానికే నావద్దకు వచ్చి చేరారు. అయితేనేమి, నేను భిక్షకు పోతూనే ఉండేవాణ్ణి. ఒక్కొక్కప్పుడు పగలు
కూడా వెళ్ళేవాణ్ణి. రాత్రిళ్ళు స్వామి భిక్షకు వస్తారని అంతా లాంతర్లు వాకిట్లో పెట్టుకొని కూర్చుండేవారు. శేషయ్యరు అన్నకూడా అలాగే నా రాకకు ఎదురు చూస్తూ కూర్చునేవారు. అక్కడ ఒక్క నెల కాబోలు ఉన్నాను. అగ్రహారానికి సామీప్యం కావడం వల్ల గుంపు జాస్తి అయింది. ఈ ఉపద్రవమంతా మన కెందుకని కొండమీదకు వెళ్లాను. ఆ రోజుల్లో భిక్షకు వెళ్ళడమంటే బలే హుషారుగా వుండేది. అంతా అన్నం కలిపి చేతులో ముద్దలు వేసేవారు. రెండు మూడు ముద్దలు వేసేవారు వేయించుకొని తినేవాణ్ణి. నాలుగైదు ఇళ్లల్లో
తినేసరికి కడుపు నిండేది, వెళ్లిపోయేవాణ్ణి” అని సెలవిచ్చారు భగవాన్.

“మిగతా వారంతా 'అయ్యో, మన యింటికి రాలేదే' అని అనుకునే వాళ్లేమో” అన్నాను. “ఆ…అందుకే మరుదినం ఇంకో పక్కకి పోయేవాణ్ణి. మొత్తం మీద ఆ అగ్రహారంలో ఒక్క యిల్లుకూడా బాకీ ఉండదనుకుంటాను” అని భగవానంటే “ఆ గృహస్థులెంత పుణ్యం చేసారో?” అన్నాను. “ఔనౌ" నన్నట్లు తలవూపి మౌనం వహించారు భగవాన్.
Telegram
T.me/bhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ