రమణాశ్రమ లేఖలు 208 (20-10-48)
రమణాశ్రమ లేఖలు 208 (20-10-48)
https://bhagavanraman.blogspot.com/2019/01/208-20-10-48.html
సాధు సంగం
నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు టవున్ నుండి ఒక సువాసిని తన బిడ్డలు, మనుమలు మనుమరాళ్ళు మొదలైన వారితో సహా భగవాన్ సన్నిధికి వచ్చింది. చూడగానే గుర్తించి భగవాన్ " ఓహో, కాంతీ ! నీవా! ఎవరో అనుకున్నాను. అన్నారు నవ్వుతూ. ఆమె చనువుగా దగ్గరకు వెళ్ళి తన సంతతినంతా భగవానుకు చూపి నమస్కరించి ఆడవాళ్ళ స్థలానికి వచ్చి కూర్చుంది. భగవాన్ నా వైపు చూసి ' ఇది ఎవరో తెలుసా? 'అన్నారు ' తెలియదు' అన్నాను. టవునులో శేషాచలయ్యరు అనేవారున్నారు. వారి కుమార్తె ఆమె ఎచ్ఛెమ్మ మేనకోడలు చెల్లమ్మ, రామస్వామయ్యరు కూతురు రాజమ్మ. ఆమె ఇంకా కొందరు ఆడపిల్లలున్నారు. వీరంతా ఒకే వయసువాళ్ళు. నేను కొండమీదుండగా వీరు పసివాళ్ళు. సదా కొండ ఎక్కి నావద్దకు వస్తూ ఉండేవారు. వాళ్ళ బొమ్మ సామాన్లు కూడా నా వద్దకు తెచ్చేవారు. తెచ్చి బొమ్మపెళ్లిళ్లు చేస్తూ ఆడుకునేవారు. ఒక్కొక్కప్పుడు గుజ్జెనగూళ్ళు అని చెప్పి పప్పూ, బియ్యం మొదలైనవి తెచ్చి వండి తింటూ నాకు కూడా పెట్టేవారు” అని సెలవిచ్చారు భగవాన్.
"భగవాన్ వాళ్ళతోకూడా ఆడుకునేవారు కాబోలును?” అన్నాను. "ఊ. ఎప్పుడనుకుంటే అప్పుడే వచ్చేసేవారు. అప్పుడంతా చిన్నతనం, స్వతంత్రం. ఇప్పుడు పెద్ద సంసారిణి అయింది. వచ్చేందుకు లేదు. చాలారోజుల కాపడం వల్ల ఎవరా అనుకున్నాను” అని సెలవిచ్చారు భగవాన్. “మగపిల్లలతో గోలికాయలే కాకుండా ఆడపిల్లలతో గచ్చకాయలున్నూ ఆడేవారన్నమాట. వాళ్ళందుకు
పెట్టిపుట్టారు" అన్నాను. భగవాన్ మందహాసంతో 'అవు' నన్నట్లు ఆమోదం చూపుతూ “ఆ రోజుల్లోనే చెల్లమ్మ ఒకనాడొక కాగితం చేతితో పట్టుకొని నావద్దకు వచ్చింది. ఆ కాగితం ఏమా అని చూస్తే అందులో,
'సజ్జనసంగే సంప్రాప్తి సమస్త నియమై రలం!
తాలవృంతేన కిం కార్యం లభ్ధే మలయమారుతే||'
అన్న శ్లోకం వున్నది. అప్పుడే దానికి అనువాదం ‘సాధు సంగత్తాల్ అన్న పద్యం రాసాను. తరువాత 'ఉన్నది నలువది” అనుబంధంలో అది చేర్చాము. తెలుగులో నే రాసిన వచనం ఉంది కదూ?' అని అడిగారు. 'అవును. వుంది,
'సాధు సంగము కలిగిన నియమము లన్నియు నక్కర లేదు మందా నిలము వీవగా విసనకర్రవలన పని ఏమి కలదు!
అన్నదే కదా?” అన్నాను. “అవు” నన్నట్టు తల వూపారు భగవాన్.
"అసలు చెల్లమ్మకు ఆ కాగితం ఎక్కడ దొరికింది? ఎందుకు తెచ్చింది" అన్నాను. “అదా. ఎచ్చమ్మ ఎప్పుడూ ఏకాదశి అనీ, కృత్తిక అనీ ఉపవాసాలు చేస్తూ ఉండేది కదూ. ఆమెతోపాటు ఈమె కూడా ఉపవాసాలుండడం ఆరంభించింది.
పసితనమాయె. వాడిపోయేది. ఎచ్చమ్మ సాధారణంగా అమె చేతికిచ్చి నాకు అన్నం పంపేది. ఒక కృతిక నాడు ఉపవాసంతోనే నాకు అన్నం తెచ్చింది. అమె తిననిది మనమెలాగ తినడమని నాకు సంకటం. ఇదంతా నీ కెందుకమ్మా! అని ఆమెకి చెప్పి ఏదోవిధంగా సమాధానపరచి ఆనాటికి తినిపించాను. మర్నాడది అన్నం పట్టుకుని కొండ ఎక్కుతూంటే త్రోవలో ఆ కాగితం దొరికిందట. ఏదో శ్లోకం ఉందే, స్వామికి చూపుదామని తెచ్చింది. చూస్తే ఇదీ శ్లోకం. ఇదుగో చూడూ. నిన్న నేను చెప్పిన విషయమే ఉన్నదిందులో” అన్నాను.'అర్దమేమిటి?' అన్న దది. అప్పుడు ఆ పాట రాసి అర్థం చెప్పాను. అంతటితో అది ఉపవాసాలు విడిచిపెట్టింది. దానికి నా మాటంటే చాలా గురి. పెద్దదయిన తరువాత కూడా కాగితం రాసిందంటే “శ్రీరమణ' అని రాయంది ఏమీ రాసేది కాదు. ఈ పిల్లలంతా వాళ్ళకు వచ్చిన పద్యాలూ, పాటలూ అన్నీ నా వద్ద అప్పచెప్పేవాళ్ళు. చెల్లమ్మ పోయినప్పుడు వీళ్ళందరికీ సొంత చెల్లెలు పోయినట్లే అనిపించింది” అంటూ గద్దదకంఠులైనారు భగవాన్.
"ఆమె పోయిందని విన్నప్పుడు భగవానునకున్నూ దుఃఖం వచ్చిందని చరిత్రలో రాసారే,నిజమేనా?” అన్నారొక భక్తులు. 'అవునవును, నిజమే” నని మౌనం వహించారు భగవాన్. “జ్ఞాని దుఃఖితులలో దుఃఖి, సుఖులలో సుఖి” అని భగవాన్ లోగడ సెలవిచ్చే ఉన్నారు కదా.
Telegram
T.me/bhagavanRaman
Comments
Post a Comment