రమణాశ్రమ లేఖలు 207 (10-10-48)

రమణాశ్రమ లేఖలు 207 (10-10-48)
https://bhagavanraman.blogspot.com/2019/01/207-10-10-48.html
బాలురతో చెర్లాటలు

కొద్దిరోజుల క్రిందట కావ్యకంఠ గణపతిశాస్త్రిగారి కుమారుడు మహాదేవశాస్త్రి
గారు వచ్చారిక్కడికి. భగవాన్ వారిని మాకందరికీ పరిచయం చేసి ఫలానా
వారని చెప్పారు. వారు ప్రస్తుతం ఈ గ్రామంలోనే నివసించడంవల్ల మొన్న
మధ్యాహ్నం ఇష్టాగోష్ఠిలో వారి ప్రసక్తి వచ్చింది. భగవాన్ ఉత్సాహంతో “ఇదుగో
నేను విరూపాక్షగుహలో ఉండగా, 1903లో అనుకుంటాను, నాయన
కటుంబంతో సహా వచ్చారు. అప్పటికి ఈ మహాదేవన్ నాలుగయిదేళ్ళవాడు.
నాయన నాకు నమస్కరించి పిల్లవాడితో 'స్వామికి నమస్కారం చేయరా" అన్నారు.
వాడు వినీ విననట్లు నిర్లక్ష్యంగా ఊరుకున్నాడు.కర్రవాడు కదా పోనీలే అని వారూ ఊరుకున్నారు. వాడు కొంచెమాగి ధిడీలున సాష్టాంగ పడి ' అహం భో అభివాదయే' అన్నట్లు ఉపనయనమయిన వారు చేసే విధంగా చెవులు పట్టుకుని నా కాళ్ళు తాకి నమస్కారం చేసాడు. ఏమిరా ఇంత చిన్న వానికి ఈ విధానం
ఎలా తెలిసిందా అనుకున్నాను. తరువాత యోచించా ,సంప్రదాయా న్ననుసరించి
వస్తుందని” అని సెలవిచ్చారు.

“అవును. ఏదైనా వంశక్రమానుగతంగానే రావాలి అన్నాను. భగవాన్ అందుకొని “నిజమే. ఈ మహాదేవుడు ఇప్పుడిలా మారిపోయాడు.
చిన్నతనంలో చాలా చురుకుగా ఉండేవాడు. నేను ఎక్కువగా వానితోనే మాట్లాడేవాణ్ణి
చూతగుహలో ఉండగా నాయన పచ్చయమ్మ కోవెలలో ఉమా సహస్రం చదివే
నిమిత్తం ఆప్తులందరినీ రమ్మని ఆహ్వానించినప్పుడు మళ్ళీ వారి కుటుంబమంతా వచ్చింది. మహాదేవ ఏడెనిమిదేళ్ళవాడు. “ఏమిరా, నన్ను చూసిన జ్ఞాపకం ఉందా?” అన్నాను. వాడు ఏమీ బదులీయక దూరంగా వెళ్ళి ఆడుకోవడం
ఆరంభించాడు. కొంతసేపటికి నన్ను చూచే నిమిత్తం ఎవరో వచ్చారు. వారు
నమస్కరించి 'స్వామీ! ముందొకసారి వచ్చాము. జ్ఞప్తి వున్నదా?' అన్నారు. జ్ఞప్తి లేక నేనేమీ పలకలేదు. కొంచెం సేపుండి ఏదో మాట్లాడి వెళ్ళారు. వారు వెళ్ళిన తరువాత ఆడుకుంటున్న మహాదేవ ఇదంతా ఎలా కనిపెట్టాడో ఏమో గునగున పరుగెత్తుకుని వచ్చి 'స్వామి! ఆ వచ్చిన వారు ముందు ఏమడిగారు?'అన్నాడు.
“ముందొక పర్యాయం వచ్చాము జ్ఞాపకం ఉందా?' అన్నారు,' అన్నాను. స్వామి
ఏమన్నారు?' అన్నాడు. 'జ్ఞాపకంలేక పలకలేదు' అన్నాను. 'నన్ను మీరడిగారే
అదీ ఇంతే' అన్నాడు. నవ్వు వచ్చింది. ఒకనాడు ఏం చేసాననుకున్నారు. మహాదేవుని
వీపుమీద కూర్చోబెట్టుకొని పచ్చయమ్ము కోవెలకు ఎదురుగా వున్న కోనేటిలో ఈదుతూ అవతల ఒడ్డుకు పోయేందుకు ఆరంభించాను.  ఇద్దరం మునిగేట్టున్నాం. మనం ఏమైనా కానీ వాణ్ణి కాపాడాలే ఎల్లాగా, ఏమా అని  అనిపించింది. చివరికి ఏదో విధంగా ఒడ్డుకు చేర్చాను” అన్నారు భగవాన్.

  "సంసారసాగరమే తరింపజేసే మహాత్ములకు అదో లెక్కా?" అన్నాను. "నాయనా,భగవానూ పాండవతీర్థంలో ఈతకొట్టేవారటే" అన్నారింకొకరు. " అవునవును.  ఆ రోజుల్లోనే. ఒకరినొకరు మించిపోవాలని వంతులుపడి ఈదేవాళ్ళం. అదొక సరదా” అన్నారు భగవాన్. “పిల్లలతో గోలీకాయలూ మొదలైన ఆటలన్నీ
ఆడేవారటే?” అన్నారు మరొకరు. “నిజమే. విరూపాక్షగుహలో ఉండగానే అవన్నీను. గోలీలాటలకై తవ్విన గుంటలు ఇప్పటికీ ఉండాలక్కడ. ఆ వచ్చే పిల్లలు ఒక్కొక్కప్పుడు మిఠాయి పొట్లాలు తెచ్చేవాళ్ళు. అంతా భాగాలు
పంచుకొని తినేవాళ్ళం. దీపావళి వస్తే టపాకాయల్లో కూడా స్వామికొక భాగమని
పంచి తెచ్చేవాళ్ళు. అంతా కలిసి కాల్చేవాళ్లం. బలే తమాషాగా ఉండేది" అని
చిరునవ్వుతో సెలవిచ్చారు భగవాన్.

  గోపాలబాలుని లీలలు జ్ఞప్తికి వచ్చినవి. ఇప్పటికీ చిన్నపిల్లలేమైనా
ఆటవస్తువులు తెస్తే తామూ చిన్నపిల్లలవలెనే నటిస్తారు భగవాన్.
“స తత్ జ్ఞో బాలోన్మత్తపిశాచవ జ్జడవృత్త్యా లోక మాచరేత్".

(మహావాక్య రత్నమాల)
Telegram
T.me/bhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ