రమణాశ్రమ లేఖలు 235 (28-3-49)
రమణాశ్రమ లేఖలు 235 (28-3-49)
Https://bhagavanraman.blogspot.com/2018/12/blog-post_79.html
దశబ్రహ్మల కథ
ఈ మధ్యాహ్నం కొంచెం ఆలస్యంగా భగవాన్ సన్నిధికి వెళ్ళాను. గడియారం
చూస్తే మూడున్నర అయింది. నిన్ననే వచ్చిన కొత్తవారొకరు భగవానుకు సమీపంలో
కూర్చుని ఆత్మానందాన్ని గుఱించి ప్రశ్నిస్తుంటే భగవాన్ చిరునవ్వుతో
“నీవెవరో తెలుసుకో ముందు. అది తెలుసుకుంటే అంతా ఆనందమే. అసలు ఆనందమే నీ స్వరూపం' అని సెలవిస్తున్నారు.
ఇక్కడ నివాసంగా ఉంటున్న ఒక భక్తుడందుకొని "నేనెప్పుడూ ఆనందంగా ఉండేలాగున అనుగ్రహించండని లోగడ తమరిని అడిగితే అదే నీ స్వభావం,అదే నీ స్వరూపం, అదే మోక్షం' అని భగవాస్ సెలవిచ్చారు కదా?” అన్నాడు
భగవాన్ నవ్వుతూ “అవునవు" నని అక్కడేవున్న డాక్టర్ శ్రీనివాసరావుని చూచి
“ఏం డాక్టర్. వ్యాధి వస్తేనే కదా డాక్టరు రావాలి, మందివ్వాలి అంటాము.
లేకుంటే ఎందుకు? నిన్న వంట్లో బాగుంది. నేడు తలనొప్పి. నేడది వచ్చింది
కనుక మందు కావాలి అంటాం. ఎందుకు? అది పోయి స్వాభావికంగా
ఉండేటందుకు. అదే విధంగా ఆనందమూ స్వాభావికమే. కాకుంటే, ఆది
కావాలనడం ఎందుకు?" అని సెలవిచ్చారు.
ఆ డాక్టరందుకొని “భగవాన్ ఎప్పుడూ ఇదంతా మనస్సువల్లనే వస్తుందనీ,
పోగొట్టుకుంటే పోతుందనీ సెలవిస్తూ ఉంటారు. వాసిష్టంలో కూడా ఇదంతా
మనస్సంకల్పాన్ని బట్టి వస్తుందనీ, మనసే సమస్తం సృష్టిస్తుందనీ చెప్పి వుంది.
కాని అది ఎలా సంభవం భగవాన్” అన్నాడు. “ఏలాగేమిటి. దశబ్రహ్మల కథలో
చెప్పలేదూ? అది వాసిష్ఠంలోనిదే కదా.” అన్నారు భగవాన్. "ఆ కథ
సెలవిస్తారా?" అన్నారింకొక భక్తులు.
భగవాన్ ఉత్సాహంతో “ఒకానొకప్పుడు సృష్టికర్తయైన బ్రహ్మ పగలంతా
సృష్టికార్యం నెరవేర్చి రాత్రి కాగానే ఆ పని విరమించి నిద్రపోయాడు. రాత్రి
గడిచింది. తిరిగిలేచి కాలకృత్యాలు తీర్చుకొని సృష్టికి ఉపక్రమిద్దామని నిర్మల చిత్తంతో కాశం వంక చూచేసరికి అక్కడ అనేక బ్రహ్మాండాలు గోచరించినవి. ఆ బ్రహ్మాండాలలో
తన వ్యాపారమంతా సక్రమంగా నడుస్తున్నది. 'అరే! నేను సౄష్టించేంతవరుకూ లయావస్థలో ఉండవలసిన లోకాలు స్థిత్యవస్థలో ఉన్నవే. ఇవన్నీ ఏ విధంగా కలిగినవి?' అన్న ఆశ్చర్యం కలిగి తన మనశ్శక్తిచేత ఆ లోకాలలోని
ఒక సూర్యుణ్ణి రప్పించి 'అయ్యా! ఈ సృష్టి సమస్తం ఏ విధంగా
కలిగింది?' అని ప్రశ్నించాడు.
ఆ సూర్యుడు 'ప్రభో! నీవు బ్రహ్మవు కదా. నీవెరుగనిది ఏముంది? అయినా నా వల్లనే
వినాలని ఉంటే వినండి' అని చెప్పడం ఆరంభించాడు. స్వామీ! తమ యొక్క
గత కల్పంలో కైలాసపర్వతం క్రింద ఉన్న పట్నంలో ఒక విప్రుడు సంతానహీనుడై పతివ్రతయైన భార్యతో కూడి పరమేశ్వరుని ఆరాధించి పది మంది కొడుకులను కన్నాడు. ఆ బాలురు కాలక్రమమున సకలశాస్త్ర పారంగతులై
అభివ్రుద్ది నందుతూ వచ్చారు. కొన్నాళ్ళకు ఆ దంపతులు కాలవశులై శరీరయాత్ర
చాలించారు. ఆ బాలకులు దుఃఖాక్రాంతులై ముఖ్యబంధువు లెవ్వరూ లేనందువల్ల ఆ ఇంట్లో ఉండలేక కైలాసపర్వత శిఖరం ఆరోహించి, తపస్సు చేద్దామని
తలపెట్టి తమలో తామే దేనివల్ల మనకు దుఃఖోపశాంతి కలుగుతుందా అని
ఆలోచించసాగారు. సంపదవల్ల సౌఖ్యం లభిస్తుందని ముందు యోచించి
-ఉస్సి! ఒకరికన్న ఒకరు పెద్దగా ధనికులు ఎందరో వున్నారు. మండలాధిపతి
మొదలు మహేంద్రపదవికీ ఒకటే విధం. వారికన్న అధీకులు ఉండనే
ఉన్నారు. దేనియందూ పరిపూర్ణత లేదు' అని అంతా నిశ్చయించారు. కడకు
వారిలో జ్యేష్ణుడు 'వీరందరినీ సృష్టించేవాడు బ్రహ్మ కనుక బ్రహ్మత్వం శ్రేష్టమని
నా అభిప్రాయం' అన్నాడు. వారంతా సంతోషించి ఆ పదవి పొందడానికి
ఉపాయం ఏమిటి?' అన్నారు. ఆ జ్యేష్టుడు రవంత యోచించి 'అది అంత
కష్టంకాదు. అన్నిటికీ మనస్సే మూలకారణం.
అందువల్ల మనమంతా ఏకాంత ప్రదేశంలో కూర్చుని "నేను కమలం మీద
కూర్చున్నాను. దివ్యతేజోవంతుడను. చతుర్ముఖుడను. ప్రపంచం సృష్టిస్తున్నాను.పాలిస్తున్నాను. సంహరిస్తున్నాను' అని ఏకాగ్రచిత్తంతో ఇతర సంకల్పములు
విడిచి ధ్యానం చేద్దాం. దేహాభిమానం పూర్తిగా త్యజిద్దాం. నేనూ అదే విధంగా చేస్తాను.' అని బోధిస్తే వాళ్ళంతా సంతోషించి ఏకాంత ప్రదేశానికి వెళ్ళి అదే విధంగా చేసారు. చేయగా చేయగా వారికి "నేనేం చతుర్ముఖుడను'అనే తలపు ధృడపడి పూర్వ దేహములపై స్మ్రుతి తప్పింది.
తరువాత ఆ దేహములు పండిన ఆకుల వలె రాలిపోయినవి. వారి ధృడసంకల్ప ప్రభావం వల్ల ఈ బ్రహ్మాండములు పదీ గోచరిస్తున్నవి. వారు పదుగురూ బ్రహ్మలైనారు.
వారి సంకల్ప సంస్కారములు
పదీ చిత్తాకాశమున నిలిచి ఉన్నవి. నేను ఆ బ్రహ్మాండములలో ఒకదాని యందున్న సూర్యుణ్ణి'అని చెప్పి ఆ సూర్యుడు
యథాస్థానానికి వెళ్ళాడు. ఇదే దశ బ్రహ్మలకధ.
వాసిష్టంలో ‘నవీన సృష్టి' అనే పేరుతో విపులంగా రాసి ఉంది" అని సెలవిచ్చారు భగవాన్.
"అయితే, నేనెప్పుడూ ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి
అనుకుంటూ ఉంటే ఆ ఆనందం స్థిరంగా ఉంటుందా? అన్నారా మొదట
ప్రశ్నించినవారు. “ఆహా! ఆ సంకల్పం దృఢపడితే అలాగే ఉంటుంది. అయితే అది
తప్ప వేరేదీ తోచకుండా ఉండాలి. అదీ సూత్రం” అని మౌనం వహించారు భగవాన్.
Telegram
T.me/bhagavanRaman
Comments
Post a Comment