రమణాశ్రమ లేఖలు 254 (26-7-49)
రమణాశ్రమ లేఖలు 254 (26-7-49)
https://bhagavanraman.blogspot.com/2018/12/254-26-7-49.html
జ్ఞానయజ్ఞం
మొన్న ఉదయం గుఱ్ఱం సుబ్బరామయ్యగారు వచ్చారు. వారు వస్తే భగవాన్
వద్ద సదా మాట్లాడుతూనే ఉంటారు కదా. ఈ ఉదయం కూడా అదే విధంగా
మాట్లాడుతూ “నేనిక్కడికి వచ్చేటప్పుడు మద్రాసులో దిగి నాగమ్మ అన్న డి.ఎస్.
శాస్త్రి గారింటికి వెడితే అక్కడ గీతాకాలక్షేపం జరుగుతున్నది” అన్నారు. భగవాన్
సానుభూతితో “అవును. ప్రారంభించేందుకు ముందు అంతా ఇక్కడికి వచ్చే
వెళ్ళారు. ఇప్పుడు ఏ అధ్యాయం చదువుతున్నారు?” అన్నారు. “నాల్గవ అధ్యాయం
జ్ఞానయోగం చదువుతున్నారు. నేను వెళ్ళినప్పుడు 'జ్ఞాని అయిన తరువాత
వారు చేసే కర్మలన్నీ బ్రహ్మకర్మలే. అంతా యజ్ఞమే' అంటూ 'జుహ్వతి' అనే పదం వల్ల తెలియజేసేవి ఇరువది అయిదు నుండీ ముప్పది వరుకూ ఉన్న శ్లోకాలు చదివి ఒకదానియందు ఒకదాన్నీ హోమం చేస్తారన్న తాత్పర్యం
వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అందులో 'శ్రోత్రాదీ నీంద్రియాణ్యన్యే సంయమాగ్నీషు జుహ్వతి' అన్న దానికి ‘ఇంద్రియాలను జయిస్తున్నారన్న మాట'.అన్నారా వ్యాఖ్యాతలు. నాకు అది సరిగా బోధపడలేదు. భగవాన్ వివరంగా సెలవీయాలి'
అన్నారు సుబ్బరామయ్యగారు.
బాలీసు నానుకొని ఉన్న భగవాన్ పద్మాసనస్థులై కూర్చుని అవునండీ. నిజమే.
"శ్రోత్రాదీ నీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి
శబ్దాదీ న్విషయానన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి|| (అ-4---శ్లో_26) అని ఈ హోమవిధి ముందు ఒక్కొక్కటీ విడదీసి చెప్పారు. ఎలాగంటే
'యోగులైనవారు కొందరు చెవులు, కళ్ళు మొదలైన జ్ఞానేంద్రియాలను
సంయమాగ్నిలో హోమం చేస్తున్నారనీ, మరికొందరు శబ్దాది విషయాలు
ఇంద్రియాలనే అగ్నులలో హోమం చేస్తున్నారనీ' కదా తాత్పర్యం. ఇలా చెప్పి మళ్ళీ,
'సర్వాణీంద్రీయ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే
ఆత్మసంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే|| (అ-4-శ్లో-27)
అనీ అన్నారు. అంటే ఇంద్రియకర్మలూ, ప్రాణకర్మలూ ఆత్మసంయమాగ్నిలో
హోమం చేస్తారని తాత్పర్యం. అలా చెప్పిన్నీ తిరిగి ప్రాణం అపానంలోనూ,
అపానం వ్యానంలోనూ అంటూ ఒక్కొక్కటీ మరొకదానిలో హోమం చేస్తారన్నారు.
ఒక్క ఇంద్రియ ప్రాణాదులే కాదు. కౌమారం పౌగండంలోనూ, పౌగండం
కైశోరంలోనూ, కైశోరం యౌవనంలోనూ, యౌవనం వార్ధక్యంలోనూ హోమం
అవుతున్నది. ఉచ్చ్వాస నిశ్వాసములూ అంతే. సదా ఒకదానితో ఒకటి హోమం
అవుతున్నది. మనకు తెలియకుండానే ఈ హోమం జరుగుతున్నది ఇప్పుడు
తెలిసి చేయడమే జ్ఞానయజ్ఞమంటారు” అని సెలవిచ్చారు.
వేరొక భక్తులందుకొని “ఆ జ్ఞానయజ్ఞం చేసేందుకు జీవదోషాలు పోవాలి
అంటారు గదా? ఆ దోషాలు పోయేదెల్లా?” అన్నారు. “ఎల్లాగా! ఆత్మాన మరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిం!
జ్ఞాననిర్మథ నాభ్యాసాత్పాశం దహతి పండితః
అని కైవల్య ఉపనిషత్తులో చెప్పారు. తనను అధరారణిగను, చేసి ప్రణవం
ఉత్తరారణిగను చేసి, జ్ఞానాభ్యాస మథనం వల్ల బ్రహ్మజ్ఞాని అజ్ఞానమనే పాశాన్ని
దహింపజేస్తాడని తాత్పర్యం. ఈ అర్థం అవగతం చేసుకొని ఆచరణలో పెడితే
జీవదోషాలు పోతవి” అని సెలవిచ్చారు భగవాన్.
అన్నిటికన్న 'నేనెవడ? ననే విచారణయే ముఖ్యమని కదా భగవాన్
సెలవిస్తారు?” అన్నారా భక్తులు. “అదేనండీ, విచారించేందుకు తానొకడుండాలి
కదా? తానొకడు, వస్తువొకటి. అదే అధరారణి, ఉత్తరారణి. విచారణ అనేదే
మథనం. ఆ మథనం చేయగా చేయగా విజ్ఞానమనే అగ్నిపుట్టి తాను వేరు,
వస్తువు వేరు అనే అజ్ఞానపాశాన్ని దహిస్తుంది. అంటే జీవదోషాలు పోత వన్నమాట.
అప్పుడు తాను తానుగానే వుంటాడు. అదే మోక్షం. దాన్నే జ్ఞానయజ్ఞమనీ
అంటారు. ఏదో ఒకటి” అని సెలవచ్చి మౌనం వహించారు భగవాన్.
Telegram
T.me/bhagavanRaman
Comments
Post a Comment