రమణాశ్రమ లేఖలు 250 (5-6-49)
రమణాశ్రమ లేఖలు 250 (5-6-49)
https://bhagavanraman.blogspot.com/2018/12/250-5-6-49.html
నిరపేక్ష
శాటిన్ పట్టుపరుపులూ, దిండ్లూ, ఫానులూ మొదలైన వాటియందు భగవాన్
చూపిన నిరపేక్ష, నిన్న మొన్నటి జాబులలో రాసాను. ఇప్పుడే కాదు. ఎప్పుడూ
అటువంటి విలువగల వస్తువులందు శ్రీవారికి నిరపేక్షయే. 1946 సెప్టెంబరులో
శ్రీవారికి స్వర్ణోత్సవం జరిగింది కదా. ఆ ఉత్సవం ఇంకొక్క నెల రోజులున్న
దనగా బరోడారాణి “భగవాన్ సోఫామీద పరచవలసిం” దని జరీపూలతోనూ,
చమ్మీ కుచ్చులతోనూ నిండి వున్న ముఖమల్ పట్టుశాలువా బంగీద్వారా పంపింది.
ఆఫీసువారది భగవాన్ సమీపంలో పనిచేసే రాజగోపాలయ్యారు కిచ్చి భగవాన్ వద్దకు పంపారు. వారది తెచ్చి చూపి “సోఫామీద పరుస్తా" మంటే వద్దని వారించారు
భగవాన్. ఆ భక్తుడది భగవాన్ పాదాల కింద వేయబోతే జాపిన ముడుచుకొని తిరిగి జాపకుండా అలాగే కూర్చున్నారు భగవాన్.ఆ భక్తుడది పనికాదని ఆ శాలువ తీసి బాలీసుపైన కప్పాడు. వెంటనే బాలీసు నానుకోవడం
మాని సోఫా మధ్యకు జరిగి, పద్మాసనస్థులై పలక్కుండా కూర్చున్నారు భగవాన్.
ఇక లాభంలేదని ఆ శాలువ మడిచి ఆఫీసులోకి తీసుకొని వెళ్ళాడా భక్తుడు. వారటుపోయిన తరువాత భగవాన్ యథాప్రకారంగా కూర్చుని
సమీపస్తులతో ‘చొకాలూ, కోట్లూ, తలపాగాలూ ధరించి దర్జాగా ఉండేవారికేగాని
మనకెందు కివన్నీను? వాటిమీద కూర్చోవాలంటే పల్లేరుకాయల మీద
కూర్చున్నట్లు ఉంటుంది. వట్టి వళ్ళూ, బట్టతలా అన్నట్లున్న మనకు
అవన్నీ ఎందుకు? ఈ తుండే మనకు పట్టుశాలువ, బంగారు ఖండువానూ" అన్నారు.
" కొన్ని చోట్ల అటువంటివి వాడతారు కదా. అందువల్ల పంపారు కాబోలును" అన్నారొక భక్తులు. “కావచ్చును. అయితే అవన్నీ వాడుకునేంత హోదా మనకేమున్నది? నేనొక బిచ్చగాణ్ణి. మన హోదాకు ఇప్పుడున్నదే ఎక్కువ.
ఈ సోఫా, ఈ పరుపులూ, ఈ దిండ్లూ ఇదంతా ఎందుకు? మీరంతా ఒప్పుకోరు
కాని, ఆ నేలమీద ఈ తుండుగుడ్డ పరుచుకొని కూర్చుంటే ఎంతో తృప్తిగా
ఉంటుంది” అన్నారు భగవాన్. “ఆ తుండు గుడ్డయినా రవంత పెద్దది
కాగూడదంటారు కదా భగవాన్?" అన్నారు మొదలియార్. “ఇంకా పెద్దది
ఎందుకండోయ్. అర్ధ గజం వెడల్పూ, ముక్కాలు గజం పొడుగూ ఉంది.
చెమటపోస్తే తుడుచుకునేందుకూ, ఎండలో వెడితే తలమీద కప్పుకునేందుకూ,
చలివేస్తే కంఠానికి చుట్టుకునేందుకూ, అవసరమైతే కింద పరచుకొని
కూర్చునేందుకూ అది సరిపోతుందే. ఇంకా పెద్దది పెట్టుకొని ఏం చేస్తాం?” అని సెలవిచ్చారు భగవాన్.
ధనవంతులలో కొందరు అప్పుడప్పుడు వెండి గ్లాసులు,పళ్ళాలూ తెచ్చి
“భగవాన్ వాడుకోవా" లంటూ ఉంటారు, భగవాన్ వాటిని తాకనైనా తాకకుండా ఆఫీసు మూలంగా వస్తే ఆఫీసులోకి, విడిగా తెస్తే ఎవరివి వారికీ ఇచ్చి పంపిస్తూ ఉంటారు. అందువల్ల అవయితే లాభంలేదని 1947లో డాక్టర్ గణపతి అయ్యరు భార్య జానకీ అమ్మాళ్ భగవాన్ వాడుకోడానికి వెండి గుబ్బల పావు కోళ్ళు ఒక
భక్తుని ద్వారా పంపింది. భగవాన్ అవి తాకిచూచి దగ్గరున్న వారితో "వారు
ధనవంతులు. వెండి గుబ్బల పావుకోళ్ళు వారికి కాని మనకెందుకయ్యా తిరిగి
వారికే ఇచ్చి పంపండి. స్వామి తాకినారు, అది చాలును అని చెప్పమనండి.
మనకు భగవంతుడిచ్చిన పాదాలున్నవి. ఎందుకి అలంకారాలు, వారిని
కిచ్చివేయండి” అని ఇప్పించి పంపారు సుమా.
వెండిగుబ్బలవి కాకుంటే మానె, వట్టి చెక్కలైనా కాళ్ళకు తొడుకోరు
మండు వేసంగిలో కాళ్లు మలమల మాడుతున్నా అలాగే నడుస్తారు కాని ఏమీ
వాడడం ఎప్పుడూ లేదాయె. పాతహాలు నుంచి గోశాలకు వెళ్లే మార్గంలో ఆఫీసు
వరకూ ఆ మధ్య సిమెంటు చేసినప్పుడు వేసంగిలో మిట్టమధ్యాహ్న మప్పుడూ
భగవాన్ అదే విధంగా నడుస్తూ ఉండడం చూడలేక కొందరు భక్తులు నీకు
చల్లడానికి ఆరంభిస్తే “నా నిమిత్తం ఇన్ని నీళ్ళు వృథాగా నేలమీద పోస్తున్నారే
చలివేంద్రం పెట్టి ఈ నీళ్ళన్నీ బీదజనానికిస్తే ఎంత ఉపయోగం. నా నిమిత్తం
ఇద్దరుముగ్గురు కష్టపడి ఇన్ని నీళ్లు వృథాచేయడం ఎందుకు? వ” ద్దని వారించారు.
భగవాన్. అంతటితో అది విరమించి సిమెంటు చేసినంత వరకూ పందిరి వేసారు
సుమా. వట్టివేళ్ల తడికలు కట్టి నీళ్ళు చల్లినా అలాగే అనేవారు భగవాన్,
ఈ విధంగా ప్రవర్తించే ఈ మహాత్యాగపురుషునకు, ఈ విరాగికి వెండి
గుబ్బల పావుకోళ్ళూ, శాటినుసిల్కు పరుపులూ, ముఖమల్ దిండ్లూ మొదలైన
ఆడంబర వస్తువుల మీద రక్తి ఉంటుందా? స్వేచ్ఛావిరుద్ధమైన ఈ వైభవాలన్నీ
వారికెందుకు. విరాగమే వారికి అలంకారం, శివ విభూతియే వారి వైభవం సుమా.
Telegram
T.me/bhagavanRaman
Comments
Post a Comment