రమణాశ్రమ లేఖలు 245 (23-5-49)
రమణాశ్రమ లేఖలు 245 (23-5-49)
Https://bhagavanraman.blogspot.com/2018/12/245-23-5-49.html
భూతదయ
1946లో ఒకదినం మధ్యాహ్నం రెండింటికి ఆశ్రమంలో వండిన జంతికలు
భక్తులందరకూ పంచిపెట్టి భగవానుకూ ఇచ్చారు. భగవాన్ అవి తిని నీళ్ళు తాగి
బయటికి వెళ్ళి వచ్చిన తరువాత, సోఫాపక్కన వున్న కిటికీవద్దకు కొన్ని కోతులు వచ్చాయి. భగవాన్ చూసి"పాపం ఆ జంతికలు వీటికి పెడితే బాగా తింటాయి. తీసుకురండయ్యా " అన్నారు సేవకులతో. ఒకరు లేచి వంట ఇంటి నుంచి తిరిగివచ్చి కోతులకు కూడా జంతికలు ఎలా వస్తాయి? అని అక్కడి వారున్నారు" అన్నారు." ఓహో ! మనకెలా వచ్చాయి? అన్నారు భగవాన్.
ఒక భక్తుడందుకొని " రేషన్ కాలం కాదా?" అన్నారు." రేషన్ కాలం అయితే
ఏమండీ. మనకు మాత్రం రేషన్ ఉందా? వాటికి ఎందుకుండదు?
కోతులకు కావాలని రేషన్ కార్డు తెస్తే తీరిపోతుంది. మనకంటే అవే ఎక్కువ ఇష్టంగా తింటాయి. వాటికి లేకుంటే మనకు మాత్రం ఎందుకు? అంతా తింటూ ఉంటేఆ బిడ్డలు ఎలా చూస్తున్నారో చూడండి." అన్నారు భగవాన్. అంతటితో వాటికీ భాగం వచ్చింది.
అది మొదలు ముందు వాటిభాగం డబ్బాలో పడ్డ తరువాతే ఏదైనా గ్రహించేవారు భగవాన్. అంతకు ముందూ వాటిభాగం తీసిన తరువాతే అందరికీ ఆరగింపు అయ్యేదట. మధ్య పొటమరించిన మార్పిడి భగవాన్ మందలింపుతో
మాయమయింది. పూర్వం జయంతీ, మహాపూజాది ఉత్సవ సమయాల్లో
భగవాన్ కోతులకోసం కొంత అన్నం విడిగా తీయించి, అది ముద్దలు చేసి,
గంపలనిండా పెట్టుకొనివెళ్ళి పల్లాకోత్తులో కూర్చుని వినోదంగా ఒక్కొక్క కోతికి
ఒక్కొక్కముద్ద చొప్పున స్వయంగా తామే నోటికి అందించేవారట. షష్టిపూర్తి
సమయం (1939) లో జరిగిన ఈ విందుయొక్క వినోద దృశ్యం ఒకరు
ఫోటో తీసారట. అప్పటి శ్రీవారి ముఖవిలాసం ఆ ఫోటో చూస్తే తెలుస్తుంది.
1946లోనే ఒకదినం ఉదయాన ఏం జరిగిందనుకున్నావు? ఉడుతలు
జీడిపప్పు కోసం భగవాన్ సోఫా మీదికి వచ్చాయి. భగవాన్ వద్దవుండే డబ్బాలో
పప్పు అయిపోయింది. వేరుశనగపప్పు ఇచ్చారు. అవి తినక మారాం
చేయడానికి ఆరంభించాయి. “లేదురా బాబూ. ఏం చేసేదీ?” అనీ లాలించి చెప్పారు
భగవాన్. ఊహూ , కాళ్ళావేళ్ళా పడి ఒకటే మారాం పెట్టినవి. కృష్ణస్వామితో " సామాను గదిలో ఏమైనా ఉన్నదేమో అడగండయ్యా "అన్నారు భగవాన్. వెళ్ళి పదిబద్దలు పట్టుకొని వచ్చాడు. "ఏం? ఇవేనా ఉన్నది?" అన్నారు భగవాన్. “ఇవాళ పాయసం చేస్తున్నారట. అందులోకి సరిపడునంతే ఉన్నదని ఊ కొంచెమే ఇచ్చారు." అన్నాడు కృష్ణ స్వామి. చిరాకు తో "సరిసరి పాయసంలోకి జీడిపప్పు తక్కువైతే రుచి ఉండదు కాబోలు. పాపం ఏదీ
సయించక మారాం చేస్తున్నవంటే ఇయ్యక పాయసంలో వేస్తారట. పాయసంలోకి జీడిపపప్పు లేకుంటే ఎవరు ఏడుస్తారో, పాపం, ఆ బిడ్డలు చూడండి ఎల్లా అల్లాడుతున్నారో" అన్నారు. అంతటితో పాయసంలో పడే జీడిపప్పు కాస్తా ఉడుతల పొట్టల్లోనూ, హాల్లో డబ్బాలోనూ పడ్డది.
ఆ సాయంత్రానికే డాక్టరు అనంతనారాయణరావు పట్నంనుండి వస్తూ
రెండు వీసెల జీడిపప్పు తెచ్చి "ఉడుతల కొఱకు తెచ్చా” ననీ చెపుతూ సన్నిధిలో
సమర్పించారు. భగవాన్ చిరునవ్వుతో కృష్ణస్వామిని చూచి “అదుగోనయ్యా చూడు
వాటికి కావలసినవి అవే సంపాదించుకుంటున్నవి. మిమ్మల్ని యాచిం
పనిలేదు. ఇది వాటి సొమ్ము, అంతా జాగ్రత్త పెట్టండి. సామానుగదిలో మాత్రం
ఇవ్వరాదు సుమా. జాగ్రత్త" అన్నారు.
1947 జనవరిలో ఒకనాటి ఉదయం తొమ్మిది గంటలకు ఆవు లక్ష్మి
కాళ్ళూ, ఒళ్ళూ, తోకా అంతా బురదమయం చేసుకొని ముక్కువైంట రక్తంతో,
సగం తెగిన కట్టుతాడుతో, గబగబా పరుగెత్తుకుంటూ వచ్చి హాల్లో చొరబడ్డది.
నేను హాలు వెలుపల వసారాలో వున్నాను. ఆమె యెకాయెకి భగవాన్ సోఫాకు
దగ్గరగా వెళ్ళింది. సేవకులు కొంత చిరాకుతో “బురదతోనే లోపలకు వచ్చిందే?”
అంటున్నారు. రానీరానీ, ఎల్లా వస్తేయేమి? రా అమ్మా రా” అంటూ భగవాన్
ఆమె ఒళ్ళంతా నిమిరి ముఖం సవరించి మెడ నిమురుతూ “ఇదేమి? ఇదంతా
రక్తమే?" అని సేవకులను అడిగారు. “ఇప్పుడే కొత్తగా ముక్కుకు తాడు వేసారు,”
అన్నారొక రందులో, “ఓహో! అదా కారణం. ఇంకేమీ. నాతో చెప్పుకోడానికి
వచ్చింది. పాపం దానికి బాధ కాదా మరి. సహించలేక ఒళ్లు కడుక్కోకుండానే
పరుగెత్తుకొని వచ్చింది. ఏం చేసేదీ?” అని జాలి వహించి “ఇడ్లీ గిడ్లీ ఏదైనా
పెట్టండి" అన్నారు భగవాన్. అరటిపళ్ళు ఇస్తూ బయటికి పిలుచుకొని వచ్చారు
సేవకులు. నేను వంటయింటి నుండి ఇడ్లీ తెచ్చి పెట్టాను. ఆమె సమాధానపడి స్వస్థానానికి వెళ్ళిపోయింది.
మేమంతా లోపలకు వచ్చి కూర్చున్న వెనుక భగవాన్ సేవకులను చూచి మందహాసంతో “ఏమయ్యా. మీరంతా వచ్చి మీమీ బాధలు
చెప్పుకోవడం లేదూ. అదీ అంతే. బురదతో వచ్చిందని చిరాకెందుకూ?
మనకు మాత్రం బాధ ఉన్నప్పుడు బట్ట బాగుందా? జుట్టు బాగా
ఆలోచన తోస్తుందా?” అన్నారు సుమా, నెమళ్ళమీద శ్రీవారికున్న
ఆదరాభిమానాలు చెప్పవలసిన పనేలేదు. ఇటువంటి సాధుజంతువులపైన
జాలి వహించడమే కాక చిరుతలూ, పాములూ మెదలైన కౄర జంతువులకూ శ్రీవారి సన్నిధి ఆశ్రయభూతమే అనడం చరిత్ర ప్రసిధ్ధమే కాక
ప్రత్యక్షగోచరమూ అయివుంది. చిరుతపులి పిల్లలను గుణించిన ప్రథమభాగంలో రాసే ఉన్నాను. పాముల విషయమై ఈ మధ్యనే ఒక సంఘటన జరిగింది.
అది ఏమంటే, ఈ నెల నాల్గవ తేదీన పాతాళలింగ దేవాలయం తెరవడానికి జరిగే ఉత్సవానికి రాగల జనమంతా ఆశ్రమానికి కూడా వస్తారనీ, ముఖ్యంగా
గవర్నర్ దంపతులు రాగలరనీ, వారంతా వస్తే చోటు చాలదనీ, వారం రోజులు ముందుగానే, అంటే ఏప్రిల్ చివరన్నమాట, జూబ్లీహాల్లో వున్న భగవాన్ సోఫాకు కుడిపక్కనున్న స్థలంలో ఈ పాక నానుకొని పందిరి వేసి వేదపారాయణకూ,
స్త్రీలు కూర్చునేందుకూ వసతి చేసాడు కృష్ణస్వామి. కొత్త పందిరాయి. పైగా ఆ
పక్కనంతా క్రోటన్లు పెట్టి వట్టివేళ్ళ తడికలు కట్టి నీళ్ళు చల్లుతూ వుండడంవల
అదంతా చల్లగా వుంటూ వచ్చింది. ఆ పందిరివేసిన నాల్గురోజులకు మధ్యాహం
వేళ నేనెందుకో తొందరగా వెళ్ళాను. భగవాన్ అప్పుడే బయటికి వెళ్ళి వచ్చి
కూర్చున్నారు. దగ్గర ఎవరూ లేరు. నమస్కరించి ఆ పందిరికిందనే కూర్చున్నాను.
భగవాన్ సోఫా ప్రక్కనున్న క్రోటన్ల సందుగా ఆకుపచ్చ వర్ణంగల పెద్ద పామొకటి
జరజరా కదిలి పందిరెక్కి కూర్చుంది. నాకేమీ జంకు కలగలేదు. ఆ పామువంకా
భగవాన్ వంక చూస్తూ ఊరుకున్నాను. భగవాన్ నా భావం గ్రహించి చిరునవ్వుతో
“ఇక్కడ చల్లగా ఉందని వచ్చారు వారు” అన్నారు. “ఎంత సేపు అయిందో?"
అన్నాను. “నేను మధ్యాహ్నం భోజనానంతరం బయటికి వెళ్ళి రాగానే వారూ
వచ్చారు. ఆ పందిరిమీదా, ఆ క్రోటన్లమధ్యనా తిరుగుతూ ఇక్కడే ఉన్నారు"
అన్నారు భగవాన్. “అలాగా” అన్నాను. “ఊ ఊ. మూడు రోజులుగా ఇలా
వచ్చి రెండున్నర కాగానే వెళ్ళి పోతున్నారు” అన్నారు భగవాన్, “వారే పుణ్యాత్ములో
భగవానుని ఏకాంతంగా సేవించే నిమిత్తం ఆ రూపంతో వచ్చి ఉంటారు” అన్నాను.
ఈ మాట అంటూ ఉండగా కృష్ణస్వామి వచ్చి “ఏమోనమ్మా. నిత్యం వస్తున్నది. భగవాన్ తరమరాదంటారు"
అన్నాడు. “వస్తే మనలను ఏం చేసారయ్యా?” అన్నారు భగవాన్. “మనలను ఏమీ చేయలేదు. పదిమంది వచ్చి పోయే చోటాయె. ఉపద్రవం కాదా?” అన్నాడు కృష్ణస్వామి. “రెండున్నరకు
ఉతున్నారుగా?” అన్నారు భగవాన్. “ఇప్పుడంటే సరే. సందడి రోజుల్లో
ఎప్పుడంటే అప్పుడే జనం వస్తారు” అన్నాడు కృష్ణస్వామి. “ఓహో! అదా నీ
సందేహం” అంటూ ఆ పాము వైపూ నా వైపూ చూచారు భగవాన్.
నేనూ అలాగే ఆ పాము వంకా భగవాన్ వంక చూస్తూ “వారు, భగవాన్
సేవకొలకే వచ్చి ఉంటారు గాని, ఈ చొక్కాతో వస్తే జనసామాన్యంవల్ల వారికీ,
వారివల్ల జనసామాన్యానికీ అలజడిగా ఉంటుందేమో?” అన్నాను. “అదిసరి”
అంటూ క్షణమాత్రం అచంచలమైన అనుగ్రహదృష్టితో ఆ పామువైపు చూచారు
భగవాన్. అంతవరకూ మా మాటలన్నీ వింటూ కదలక నిలిచిన ఆ పాము
శ్రీవారి అనుగ్రహదృష్టిలో ఏ ఆశయాన్ని గుర్తించిందో కాని, జరజరా పందిరి దిగి పూదోటలో దూరి అదృశ్యమైంది. గడియారం అరగంట కొట్టింది.
భక్తులందరూ వరుసగా వచ్చి ప్రణమిల్ల సాగారు. బంధరహితదృష్టితో భగవాన్ యథాస్థితికి వచ్చారు. అంతే. మరి మా దృష్టికి ఆ పాము గోచరించ లేదు
సుమా.
భగవాన్ సన్నిధి తిర్యక్ జాతులకేకాక, అబలలకూ, దరిద్రులకూ సదా
ఆశయభూతమేనని తెలియజేసే సంభవాలు ఎన్నో ఉన్నవి. మచ్చుకుగాను
కొన్నిటిని మరొక లేఖలో రాస్తాను.
Telegram
T.me/bhagavanRaman
Comments
Post a Comment