రమణాశ్రమ లేఖలు 244 (22-5-49)
రమణాశ్రమ లేఖలు 244 (22-5-49)
https://bhagavanraman.blogspot.com/2018/12/244-22-5-49.html
సమదర్శిత్వం
ఈ వైశాఖశుద్ధ చతుర్ధి సోమవారానికి సరియైన 2--5-49 తేదీన శ్రీ మాతృభూతేశ్వర ఆలయంలో మండలాభిషేకం జరిగింది. వైశాఖ బహుళ
నవమీ శనివారానికి సరియైన 21-5-49 తేదీన
మహాపూజ కదా. అప్పటికి
పని చాలాభాగం ముగిసింది. అందువల్ల సర్వాధికారి తన సహచరులతో
యోచించి, ఈ రెండునాళ్ళు ఇక్కడ ఉండవలసిందని కోరుతూ 20 వి తేదీన మధ్యాహ్నం రెండుగంటలకే భగవానుని ముఖమండపానికి తీసుకు వచ్చారట. నేనెందుకో ఆనాడు కొంచెం తొందరగా వెళ్ళాను.
గేటు దాటేసరికి ముఖమండపం వద్ద హడావిడిగా ఉంది. ఏమా అని వసారాలోకి వెళ్ళి చూస్తే యోగాసనం మీద ఆసీనులై ఉన్నారు భగవాన్. ముఖం వికసించినట్లు లేదు అలా ఉన్నారేమా అని అనుకున్నాను. ఎవరిని అడుగుటకు వీలేకపోయింది
భగవాన్ సోఫాకు ఎదురుగా సర్వాధికారి నిరంజనానంద స్వాములు, వారి
స్నేహితులూ, ఆశ్రమ నిర్వాహకులలో ప్రముఖులూ నిలిలి ఏదో మాట్లాడుతూ ఉంటే అన్నిటికీ “సరి సరి” అంటూ సాక్షిమాత్రంగా ఊరుకున్నారు భగవాన్. ఈ సందర్భంలో లోపల ప్రవేశించడానికి జంకి, వసారాలోనే
నిలుచున్నాను. భగవాన్ కిటికీ సందులలోనుండి నేను రావటం, లోపల
ప్రవేశించేందుకు జంకటం, చూస్తూనే ఉన్నారు. పది నిమిషాలు అలా గడిచింది.
తరువాత, ఆ జట్టువారంతా వెళ్ళిపోయారు. భగవాన్ సమీపంలో శివానందం
మాత్రమే ఉన్నాడు. నూతనులు ఇద్దరో ముగ్గురో దూరంగా కూర్చున్నారు.
భగవాన్ ఆ హాలు పై భాగమూ, ప్రక్కనున్న చెక్కడాలూ, ఎలక్ట్రిక్ లైట్ల బలుబులూ, ఫేనులూ
అన్ని పరకాయించి చూస్తున్నారు. ఇక తొందర లేదని, లోపల
నమస్కరించి లేచానో లేదో భగవాన్ నావైపు చూచి కరుణాపూరిత స్వరంతో " ఇదిగో
చూచారా? నన్ను, ఈ నాలుగుగోడల మధ్యన బంధించి వేసారు. ఎవరూ దగ్గరకు రాకుండా ఖైదీ చేసారు. ఇక్కడకు ఎవరు వచ్చేందుకు
సందు లేదు చూడండి" అంటూ రెప్పలల్లార్చి హాలు పై భాగం " ఎక్కడ
సందన్న మాటే లేదు. వారు (ఉడుతలు) ఎలా రాగలరు" అని సెలవిచ్చి ఎత్తిన
ముఖం దింపక అలాగే ఉండిపోయినారు భగవాన్.
నేనూ ఆ కరుణామూర్తిని చూచి స్తంభించినట్లు కొంచెంసేపు అలాగే నిలిచాను.
పక్కనున్న శివానందం అందుకొని “ఇక్కడుంటే వాన వచ్చినా ఎండ కాసినా భగవాన్ శరీరానికి బాధ లేకుండా భద్రంగా ఉంటుందని
(సర్వాధికారి) ఆశ” అన్నాడు. తదేకదృష్టితో పుస్న భగవాన్ ఆ మాటకు ఉలికి
పడ్డట్టు కదలి, శివానందాన్ని చూస్తూ “సరేనయ్యా. మస సౌఖ్యం కొఱకు చూస్తే
వారందరికీ కష్టం కాదూ? ఉడుతలూ, కోతులూ, నెమళ్ళూ, ఆవులూ
వారెవ్వరూ ఇక్కడకు వచ్చేటందుకు లేదు. వారందరి నోటా మట్టి కొట్టినట్లే కదూ.
స్వామికి ఇదేదో సౌఖ్యమని అనుకుంటారు. ఏం చేసేదీ?” అని
సెలవిచ్చారు. అప్పటికే శ్రీవారి కంఠం గద్దదిక వహించింది. ఆ సేవకుడు
అందుకొని “అవును. అది నిజమే. మనుష్యులు తప్ప పశుపక్ష్యాదులు
స్వతంత్రంగా వచ్చేందుకు లేదు” అన్నాడు. భగవాన్ మాట్లాడలేదు.
మరి కొంచెం సేపటికల్లా ధనికులైన కొందరు భక్తులు వచ్చి భగవానుకు
ఎదురుగా కూర్చున్నారు. వారి వెనుకనే ఒకరిద్దరు దరిద్రులు వచ్చి లోపల
ప్రవేశించుటకు జంకి కిటికీ సందులలో నుండే భగవానుని చూస్తున్నారు.
శ్రీవారది గమనిస్తూ, ఆ సేవకుని ఉద్దేశించి 'అదుగోనయ్యా! అటు చూడూ,
మనుష్యులు వచ్చేటందుకు వీలున్నదన్నావు కదా. వారుమాత్రం అంతా
వచ్చేందుకుందా. లైట్లూ, ఫానులూ, కటకటాల తలుపులు మొదలైన అట్టహాసంతో ఉన్న ఇటువంటి కట్టడాలను ధనవంతులు సహజంగా చూస్తూ ఉంటారు కనుక ఛట్టున లోపలకు వస్తారు. నా వంటి దరిద్రులు 'అమ్మా అది
గొప్పవారుండే చోటు. మనం పోతే ఏమంటారో' అన్న భీతితో అదుగో చూడూ,
వారివలెనే కిటికీ సందుల్లోనుంచి చూచి చక్కాపోతారు. వారికి ఇక్కడ చోటేదీ?
పాపం వారు చూడూ" అంటూ మరి మాట్లాడక మౌనం వహించారు భగవాన్.
సాయంత్రం కాగానే సమాపవర్తులను చూచి “వారంతా (కోతులూ, నెమళ్ళూ)
అక్కడికి వచ్చేవేళ అయిందయ్యా. స్వామి మమ్మల్ని ఏమార్చి ఎక్కడికో పోయినారనుకుంటారో ఏమో పొండయ్యా పొండి. పాపం, ఆహారమైనా యిచ్చి రండి" అని
తొందరించి పంపారు భగవాన్. వారు వెళ్ళి ఆహారం ఇచ్చి రాగానే “ఏమి?
అందరికీ యిచ్చారా?” అని అడుగుతూ 'స్వామి మమ్మల్ని ఇక్కడ వదిలివేసి,
మాత్రం సుఖంగా అక్కడ కూర్చున్నాడు. మమ్మల్ని మరచే పోయినాడని
అనుకున్నారో ఏమో, వారిక్కడికి వచ్చేటందుకు లేదాయె. ఏం చేసేదీ?' అంటూ
గద్గదకంఠులైనారు భగవాన్. తమ సన్నిధికి పశుపక్ష్యాదులలో ఏవి రానీ
"వారెవరో” అంటారే కానీ, అలక్ష్యంగా చూడడం లేనేలేదు. సేవకులు ఎవరైనా
వాటిని అనాదరణగా చూస్తే సహించక “అవే చేష్టలు. పైన కప్పుకున్న తోలును
చూస్తారేకాని లోపలవున్న ఆసామిని గమనించరు. తాము గొప్పవారనీ, వారు
కొద్దివారనీ, వారినేమో తరమచూస్తారు. మనం వచ్చినట్లే వారూ వచ్చారు.
మనకు వచ్చినట్లే వారికీ వస్తుంది. మనకున్న హక్కు వారికిమాత్రం ఎందుకు
లేదు?” అని మందలిస్తూ ఉంటారు భగవాన్. అందువల్ల ఆస్థానమండపంవలె
లైట్లూ, ఫానులూ, ఇనుప కటకటాల తలుపులూ, పోలీసు కాపలా మొదలైన
అట్టహాసంతో ఉన్న ఆ హాలులో తిర్యక్ జాతులకూ, దరిద్రులకూ తావు వుండదే
అన్న జాలి కలగడంలో ఆశ్చర్యం ఏమున్నది. సమదర్శిత్వం శ్రీవారికి సహజ
లక్షణం కదా!
Telegram
T.me/bhagavanRaman
Comments
Post a Comment