రమణాశ్రమ లేఖలు 242 (16-5-49)

రమణాశ్రమ లేఖలు 242 (16-5-49)
https://bhagavanraman.blogspot.com/2018/12/242-16-5-49.html
వేదాభ్యాసం

డాక్టరు శ్రీనివాసరావుగారు ఇక్కడకు వచ్చినప్పుడల్లా పాఠశాల విద్యార్ధులతో
పాటు వేదపారాయణం చేయడం మామూలే కదా. ఈసారి కూడా అలాగే
చేస్తున్నారు. రెండు మూడురోజుల క్రిందట ఒక సాయంత్రం వేద పారాయణ
వేళకు విద్యార్థులతో కలిసి గూడకట్టు పంచతో వచ్చి కూర్చున్నారు. భగవాన్
ఇది కొన్నాళ్ళుగా గమనిస్తూనే ఉన్నారుగాని ఏమీ అనలేదు. ఆ సాయంత్రం
డాక్టర్ను చూచి తమలో తామే నవ్వుకుంటున్నారు. ఏదో విశేషం ఉందని
అనుకున్నాను. పారాయణ ముగించి లేవగానే డాక్టరు నుద్దేశించి “ఏమండీ
మీరు విశేష పర్వదినాల్లోనైనా గోచీపెట్టి పంచ కడతారా? లేదా?” అన్నారు
భగవాన్.

   ఆ డాక్టరు జంకుతూ “కడతాను భగవాన్. ఇక్కడ ఏదో ఇల్లా కట్టాను.
రేపటినుండీ అల్లాగే కట్టుకుంటాను” అన్నారు. “అహ. అదికాదు లెండి. ఇక్కడ
పారాయణకు వచ్చే శాస్రుల్లవారంతా అలా కడతారు కదూ? అందుకడిగాను
మీరు మహరాష్ట్రులు కూడానాయే. గృహస్థులు కదా. అసలు అలవాటున్నదా? లేదా? అన్నానంతే” అన్నారు భగవాన్, "లేదు భగవాన్. రేపటినుండి అలాగే కడతాను
శ్రీ భగవాన్” అంటూ చేతులు జోడించి, మరుదినమే శాస్త్రులవారలే
గోచీ పెట్టి పంచె కట్టుకొని హాజరైనారు డాక్టర్. భగవాన్ చూచి తమలో తామే నవ్వుకున్నారు
సుమా.

ఎవరు గానీ వేదాధ్యయన విషయంలో ఏదైనా పొరపాటు చేస్తే ఈ విధంగానే
సున్నితంగా మందలించి సవరిస్తూ వుంటారు భగవాన్. 1938లో శంకరం అనే
*మళయాళీ భక్తుడు తమ భాషలో భగవాన్ చరిత్ర రాసి తెచ్చి "అచ్చుకు పంపాలని అనుకుంటున్నాం. భగవాన్ చూచి దిద్దవలసినది. దిద్ది దయచేయా”
లని ప్రార్థిస్తూ శ్రీవారికి ఇచ్చారట. భగవాన్ అది చూస్తూ అక్కడక్కడ రవంత
సవరణలుచేసి ఆ సవరణలు అక్కడున్న వారందరికీ చెపుతూ వచ్చారట. ఆ
పుస్తకంలో ఒక చోట “అన్ని జాతులవారున్నూ వేదాధ్యయనం చేయవచ్చును”
అని రాసి ఉండడం భగవాన్ చూచి 'వేదాధ్యయనం' అనేది తుడుపుపెట్టి
'వేదాభ్యాసం చేయవచ్చును' అని దీద్దారట. అంటే, అధ్యయనానికి బదులు
అభ్యాసమని రాసారన్నమాట. రామనాథయ్యర్ అప్పుడు హాల్లోనే ఉండడం
వల్ల ఇదంతా విన్నారు. కాని అధ్యయనానికీ, అభ్యాసానికీ వ్యత్యాసం ఉన్నదన్న
విషయం వారికప్పటికి తెలియదు. అందువల్ల భగవాన్ కూడా అన్ని జాతుల
వారూ వేదాధ్యయనం చేయడానికి అంగీకరించారని అనుకొన్నారు. ఈ సంగతి
కుంజుస్వామికి చెప్పుదామని భగవాన్ భోజనానికి వెళ్ళగానే బసకు వచ్చారు.

  ఆ రోజుల్లో కుంజుస్వామీ, రామనాథయ్యరూ పల్లాకొత్తుకు పొయే దారికి పక్కగా ఉన్న రూం లో ఉండేవారట. ఉభయులూ భోజనం చేసి వసారా తిన్నె మీద కూర్చుని ఇష్టాగోష్టిగా మాట్లాడుకుంటూ ప్రసంగవశంగా, “ఇదుగో
కుంజుస్వామీ! రేపటినుండీ మీరూ వేదాధ్యయనం చేయవచ్చును. భగవాన్
తీర్మానం చేసారివాళ” అన్నారట రామనాథయ్యర్. వారా మాట అంటుండగానే
భోజనానంతరం పలాకొత్తుకు వెళ్ళి తిరిగివచ్చే భగవాన్ “ఆ, నేనా తీర్మానం
చేసింది? అధ్యయనం చేయవచ్చును అని నేననలేదే?”అన్నారట.

  వాళ్ళిద్దరూ ఉలిక్కిపడి లేచారట. రామనాథయ్యరు చేతులు జోడిస్తూ “భగవాన్
ఇంతకుముందే హాల్లో శంకరం రాసిన చరిత్రలో అన్ని జాతులవారు
వేదాధ్యయనం చేయవచ్చునన్నది సరి చూచారు కదా?” అన్నారట. “అవును
చూచాను. అభ్యాసమని దిద్దాను కదూ?” అన్నారట భగవాన్. “అధ్యయనానికీ
అభ్యాసానికీ భేదం ఉన్నదా?” అన్నారట అయ్యర్. “లేకేమి. వేదమంటే జ్ఞానమని
అర్థం. అందువల్ల వేదాభ్యాసం చేయవచ్చునన్నాను. అంటే జ్ఞానాభ్యాసం
చేయవచ్చునన్న మాట. అంతేగాని అధ్యయనం చేయవచ్చునని నేననలేదే”
అన్నారట భగవాన్. ఈ అర్థం భగవాన్ ఇప్పుడు వివరంగా సెలవిస్తే తెలిసింది.
అధ్యయనం చేయరాదని విస్పష్టంగా రాయకుంటే ఈ భావం అందరికీ
గోచరించదే?”అన్నారట అయ్యర్. భగవాన్ చిరునవ్వుతో “ఎలా తెలుసుకున్న
వాళ్ళు అలా తెలుసుకుంటారు. మనకేమి? మనమా అందుకు బాధ్యులం?"
అని సెలవిచ్చి ఆశ్రమంవైపుకు వెళ్ళిపోయారట.

Telegram
T.me/bhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ