శ్రీ రమణాశ్రమ లేఖలు 269
269
బాల్య క్రీడలు
15-1-50
తిరుచ్చుళిలో భగవానుని జనన మందిరం మరమ్మతు చేయించాలని
సర్వాధికారి నిరంజనానందస్వామి 1945 జనవరిలో ఆశ్రమంనుంచి చాలా
మంది భక్తులతో బయలుదేరి వెడుతూ ఉంటే కొందరు స్త్రీలతో కలిసి నేనూ
వెళ్ళీ అదంతా చూచి రావటమూ, ఆ సందర్భంలో శ్రీవారు సెలవిచ్చిన చిన్ననాటి
చర్యలూ రాసే ఉన్నాను. అప్పుడు మధురలో శ్రీవారికి జ్ఞానోదయమైన ఇల్లూ
చూచాం. అప్పుడక్కడ సుబ్బమ్మ అనే వృద్ధురాలు భగవానుని గురించి
ప్రశంసించిందని శ్రీవారితో మనవి చేస్తే “ఆమె ఏమి చెప్పిందేమిటి?” అని
తరచి అడిగారు భగవాన్.
"భగవాన్ పారిపోయినప్పుడు ఆ వీధిలోనే ఉన్నాననీ, చిన్నతనంనుండీ
వారి ప్రవర్తనలో సమత్వం వ్యక్తమౌతూనే ఉండేదనీ ఇల్లాగే ఏమేమో సంగతులు
చెప్పింది” అన్నాను. “ఇంకా ఏ సంగతులు?” అన్నారు భగవాన్. "భగవాన్
ఉన్న ఆ యింట్లో నీటి వసతి తక్కువవడంవల్ల ఎదురిళ్ళల్లో నీళ్లు తేవలసి
వచ్చిదనీ, అప్పుడప్పుడు భగవాన్ నీళ్లు తెచ్చీ, ఆ పనీ ఈ పనీ చేసీ, పినతల్లికి
సహాయపడేవారనీ ఏదో చెప్పింది” అన్నాను. “అవును. పిన్ని పెద్దబిందె
ఆగలిగేది కాదు. చిన్నబిందెతో నీళ్ళు ఎన్నితెచ్చినా చాలక, ఒక్కొక్కప్పుడు
ఇబ్బంది అయ్యేది. అందువల్ల అప్పుడప్పుడు పెద్దబిందెతో తెచ్చేవాణ్ణి. దానికేమి?
అన్నారు భగవాన్. "అది అమ్మకు కష్టంతోచి 'అంత పెద్ద బరువు
తీసుకుని
మోయిస్తున్నదే' అని అనుకునేదనీ, ఒకసారి ఏదో పనిమీద అమ్మ మధురకు
వచ్చినప్పుడు ఆమె కూడా నీళ్ళు తేవలసి వచ్చి, ఆ పెద్దబిందె ఎత్తలేక “నాయనా!
కొంచెం నీవు తీసుకురారాదా?' అని భగవాన్‌తో అంటే 'సరే' నని తెస్తూ
పిన్నినన్నావే. నీవేం చేసావిప్పుడు?' అని భగవాన్ సెలవిచ్చారనీ
నిజమేనా?” అన్నాను.
భగవాన్ నవ్వుతూ “సరి సరి. దానికేమి. ఏదో జరిగింది. ఇప్పుడక్కడ
పంపులు పెట్టారుగాని ఆ రోజుల్లో నీటికి చాలా ఇబ్బందిగా ఉండేది. చొక్కనాధ
వీథికి వైఘానది చాలా దూరం. మొట్టమొదట మేముండే యింటికి మాత్రం
చాలా దగ్గరగా ఉండేది. అక్కడుండగా నిత్యం వైఘలో స్నానం చేసేవాళ్ళం.
ఎండలు ముదిరితే నీరుండదు. అప్పుడు మేమంతా సాయంకాలం కాగానే
వెళ్ళి సాధారణమైన బిందె ముణిగేంత లోతుగా చలమలు తీసి ఇసుకలో
ఆడుకొనేవాళ్ళం. మా ఆటలు ముగిసేసరికి చలమలు నిండేవి. ఆ నీళ్ళతో
స్నానంచేసి వచ్చేవాళ్ళం. నిత్యం మేము తీసే గుంటలు ఊళ్లో వాళ్ళకు
ఉపయోగించేవి” అని సెలవిచ్చారు భగవాన్. “మహాత్ముల వినోదక్రీడలూ
పరోపకారంగానే ఉంటవన్నమాట” అన్నాను.
“అది సరి, దానికేమిగాని, మీరు వరదరాజ పెరుమాళ్ళు కోవెలకు వెళ్ళారు
కదూ. అక్కడ, మూడంతస్థులలోనూ మూడు ప్రాకారాలున్నవా. తరచు పిల్లల
మంతా పై ప్రాకారాలలో చేరి బంతులాటలూ, దాగుడుమూతలూ మొదలైనవి
ఆడేవాళ్ళం. చివర అంతస్తులో ఉన్న కిటికీనుంచి చూస్తే దూరంలో పెద్ద
చెలువొకటి కనుపిస్తుందే, ఆ చెఱువుకు అప్పుడప్పుడు వెళ్ళి పందెములు
వేసుకొని ఈదేవాళ్ళం. ఎప్పుడూ గెలుపు నాదే. తిరుప్పురంకుమ్రం పోయే
మార్గంలోనే ఉన్నదా చెఱువు” అన్నారు భగవాన్. “తిరుప్పురంకున్రంలో భగవాన్
బాలురతో విందారగించిన విషయం రమణలీలలో చూచాను. అక్కడికి
వరకు వెళ్లేందుకు వీలు కలుగలేదు” అన్నాను. “అది తిరుచ్చుళికి పోయే మార్గమే.
కొంచెం తిరగాలి అంతే. మధురకు చుట్టూ అటువంటివే పశుమల, నాగమల,
ఏనుగమల ఇంకా ఎన్నో వున్నవి. అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం. వాటి మహత్తంతా
హాలాస్య మాహాత్మ్యంలో ఉంది” అని సెలవిచ్చారు భగవాన్.
"అళగరు కోవెలకున్నూ వెళ్ళేవారటగా?” అన్నాను. “అవునవును. అది
మధురకు పన్నెండు మైళ్ళుంటుంది. కోవెల చాలా పెద్దది. అక్కడ నిత్యం
రెండు వేళలా చక్కెర పొంగలి వినియోగం చేస్తారు. అది ఘుమఘుమ వాసనతో
నెయ్యి వోడుతూ చాలారుచిగా ఉంటుంది. ఒకసారి వెళ్ళినప్పుడు ఆ పొంగలి
అందరితో పాటు నాకూ కొంచెం ఇచ్చారు. మరి కొంచెం ఇస్తే బాగుండునే
అనిపించింది అడిగేందుకు అభిమానం. పలక్కుండా ఊరుకున్నాను. మరోసారి
వెడితే ఏమయిందనుకున్నారు. అక్కడి అర్చకులలో ఒకరి పిల్లలు మధురలో
సెలవు రోజులలో ఇంటికి వెళుతూ ఉంటే నేనూ వెళ్ళి ఒక రోజంతా వాళ్ళ యింట్లోనే ఉండిపోయాను. అప్పుడు అర్చన వంతు వాళ్ళదయింది. వాళ్ళ
యింటికీ, దేవాలయానికి రెండు ఫర్లాంగుల దూరం ఉంటుంది. రాత్రి
పూజ వినియోగాలూ అయిన తరువాత వారి వంతు పొంగలి ఒక పెద్ద పళ్లెం
నిండుగా వచ్చింది. వారు నన్ను చూచి 'ఈ పిల్లవాడు దృఢంగా ఉన్నాడు.
మోయగలడు లెమ్మని ఆ పళ్ళెం నా నెత్తిన పెట్టి వాళ్ళంతా కబుర్లు చెప్పుకుంటూ
ముందు నడిచారు. అది ఎంత బరువనుకున్నారు? మెడలన్నీ నొప్పులు పుట్టాయి.
రాత్రివేళ, చీకటి, భగవత్ప్రసాదం కనుక కింద పడరాదు. ఏం చేసేదీ?
మరికొంచెం పొంగలి ఉంటే బాగుండునని ముందు వచ్చినప్పు డనుకున్నందుకు
ఇది ఫలితం కాబోలునని అనుకుంటూ ఎల్లాగో మోసి ఇల్లు చేర్చాను" అన్నారు
భగవాన్.
“వారెవరూ కొంచెంసేపు తెస్తామనీ అనలేదా?” అన్నాను. “ఊ-వారేదో
వ్యవహార విషయాలు మాట్లాడుతూ నడిచారు. దీన్ని గుణించి జ్ఞాపకమా ఏమి?”
అన్నారు భగవాన్. బరువుగా ఉంది, మోయలేనే అని భగవాన్ అనలేదు
కాబోలు” అన్నాను. “సరిపోయింది. ఏదో మోయవలసి ఉన్నది. మోసాను.
అంతే, వెనక నా ఆకులో పటెడు ముద్ద పెట్టారు. కొంచెం తినేసరికి ముఖం
మొత్తింది. ప్రసాదంకదా పాఱవేయరాదని ఎలాగో తిన్నాను. వాళ్ళెవళ్ళూ వేలువేసి
ముట్టనేలేదు. తెల్లవారిన తరువాత పనివాళ్ళకు పడేసారు. ఏదైనా అంతే.
సమృద్ధిగా ఉంటే ఎవరికీ అక్కరలేదు." అని సెలవిచ్చారు భగవాన్. "జడభరతుడు
పల్లకీ మోసినట్లే భగవాన్ పళ్ళెం మోస్తారన్నమాట" అన్నాను. “ఆ-దానికేమి.
ఏదో పిల్లవాడు బలంగా ఉన్నాడు, మోస్తాడు లెమ్మని అనుకున్నారు కాని ఇదంతా
ఎవరికి తెలుసును” అంటూ ఆ ప్రసంగం తప్పించి కుస్తీ పట్లూ, బంతి ఆటలూ
ఇత్యాది తమ బాల్య క్రీడల విషయం ఎత్తారు భగవాన్. అవన్నీ రమణలీలలో
రాసివున్నవి కదా..
Comments
Post a Comment