శ్రీ రమణాశ్రమ లేఖలు 267. 30-12-49
267 వరకు
బైండు పుస్తకాలు 30-12-49
భగవాన్ సన్నిధికి విషయావలోకనార్థం శిథిలపత్రాలతో ఉన్న పురాతన
గ్రంథాలను కొందరు తెస్తూ ఉండేవారు. భగవాన్ అందులో ఉన్న విషయావలోకనంతోపాటు కాగితాలన్నీ సరిచేస్తూ చినిగిన భాగాలు స్వయంగా రాసి,
అంటిస్తూ కొత్త పుస్తకంలా తయారు చేసేవారు. ఇంకా కొందరు ఏవేవో రాసివున్న
విడి కాగితాలన్నీ “భగవాన్ సరిచూచి దయచేయా" లంటూ కట్టలు కట్టి,
చుట్టలు చుట్టి పంపించేవారు. భగవాన్ అవన్నీ కత్తిరించి, ఒక దానికొకటి
అంటించి, పుస్తకం కుట్టి బైండు చేయించి, దానిమీద పేరుకు సరిపడ తెల్లకాగితం
అంటించి ముత్యాలకోవలాంటి అక్షరాలతో స్వయంగా పేరు రాసి, ఎర్ర సిరాతో
గీటు గీసి ఉంచేవారు.
1942లో గుర్రం సుబ్బరామయ్యగారు కృష్ణదేవరాయ విరచితమైన
'ఆముక్తమాల్యద' అనే గ్రంథం 'భగవాన్ చూడవలసిం దనీ, 'చూచిన తరువాత
ఆశ్రమం లైబ్రరీలో ఉంచవలసిందనీ రాస్తూ అట్టలు సడలీ, మాసీ, చినిగి
పోవడానికి సిద్ధంగా వున్న ఆ పుస్తకం పంపారిక్కడికి. భగవాన్ వెంటనే అదంతా
బాగుచేసి సమీపవర్తులతో కలిసి చక్కని బైండు చేసి, పైన అందించిన తెల్లకాగితం
మీద అచ్చుకంటె హెచ్చైన అక్షరాలతో పేరు రాసి, క్రింద ఎర్ర సిరాతో గీటుగీసి,కొత్తపుస్తకంగా తయారు చేసి “ఇప్పుడెల్లా ఉందో చూడు” అని నాకిచ్చారు.
నవవధువు వలె అందంగా ఉన్న ఆ పుస్తకం చూచి కొన్ని పద్యాలు రాసి
అప్పుడే భగవానునకు అర్పణ చేసాను.
1943 జూన్, జూలై ఆ ప్రాంతంలో భగవదాదేశానుసారం నాకు భగవాన్
సన్నిధిలో తెలుగుకు సంబంధించిన రాతకోతల పని లభించింది. అప్పుడు యుద్దసంకటం వచ్చి పేపరు దొరకడం కష్టతరం కావడంవల్ల చిత్తు రాతకైనా పనికి వస్తవని ఒక పక్క టైపు చేసిన నీ బ్యాంకు పుస్తకం కాగితాలు వృథాగా
ఉంటే తెచ్చుకున్నానా? ఆ కొత్తలోనే జగదీశ్వరశాస్త్రిగారు “శ్రీరమణ పూజావిధానం' నాగరలిపిలో రాస్తే తెలుగక్షరంలో కాపీ చేసే నిమిత్తం ఈ పేపర్లే ఉపయోగించాను. భగవాన్ చూచి “ఈ పేపర్లెక్కడివి?” అన్నారు. విషయం
నివేదించాను. “మంచిదయింది. వాళ్ళిక పారవేసేవే కదా. చిత్తురాతకు ఉపయోగించుకోవచ్చును. నే నెప్పుడూ ఎవరికీ పనికిరాని కాగితాలే ఉపయోగిస్తాను. ఇటువంటి పేపర్లయితే ఒకదాని కొకటి అంటించి చక్కని
బైండ్లి చేయవచ్చును. మేము ఆ విధంగా ఎన్నో చేసాం. వృథాగా విడవడం
ఎందుకు?” అని సెలవిచ్చారు భగవాన్.
ఒక భక్తుడందుకొని “ఎప్పుడో ఒకసారి నాయనగారు కుప్పలో పారవేసిన
కాగితాలన్నీ భగవాన్ ఏరితెచ్చి బైండు చేసారట కదూ?” అన్నాడు. “అవునవును.
నాయన పల్లాకోత్తులో కొన్నాళ్ళున్నారు కదా. అక్కడినుండి ఊరికి వెడుతూ
చిత్తుకాగితాలన్నీ బయట పారవేసారు. వారెప్పుడూ కాగితంలో సగం వరకూ
రాసి వదలివేయడం మామూలు. అల్లా రాసి వదలి వేసిన పుస్తకాలే ఎన్నో
ఉండేవి. ఇక కాగితాలా లక్ష్యం. ఎన్నో అటువంటివి కుప్పగా పోసారు.
మధ్యాహ్నం భోజనానంతరం, మాధవుడూ నేనూ అటుపోయి వస్తూ, అవన్నీ
చూచి ఎందుకు పోనీయాలని ఏరి తెచ్చాం. అన్నీ చింపి, అతికించి కుట్టి
మంచి బైండొకటి తయారుచేసి దాచి ఉంచాం. కొత్తబైండులాగే ఉంది.
కొన్నాళ్ళకు నాయన తిరిగి వచ్చి ఏదో రాసేందుకు 'పుస్తకం కావాలన్నారు. ఆ
బైండివ్వమని నేనంటే మాధవుడు తీసియిచ్చాడు. 'ఎంత బాగుంది. ఎక్కడి
దిది?' అన్నారు నాయన. నేనేమీ చెప్పక నవ్వుతూ ఊరుకున్నాను. మాధవుడు
'నాయనా, మీరు పనికి రావని పారమవేసిన కాగితాలే యివి. భగవాన్ చూచి ఏరి తెమ్మంటే తెచ్చి బైండ్ చేసాం. అన్నాడు. నాయన ఎంతో ఆశ్చర్యపడ్డారు. “సాధారణంగా నేనెప్పుడూ పాతకాగితాలతోనే పుస్తకాలు కుట్టేవాణ్ణి” అని
సెలవిచ్చారు భగవాన్.
Comments
Post a Comment