రమణాశ్రమ లేఖలు 262 (12-12-49)

రమణాశ్రమ లేఖలు 262 (12-12-49)
https://bhagavanraman.blogspot.com/2018/11/262-12-12-49.html

వచ్చినపని అంతా అయిందా

1943-44 ఆ ప్రాంతంలో కోయంబత్తూరు నుండి 'అలిమేలు' అనే ఒక ఆంధ్రయువతి వచ్చిందిక్కడికి. ఆమె భర్త గతించిన కొత్తరోజులు కావడం వల్ల
ఆ దుఃఖనివారణార్థం తల్లిని వెంట పెట్టుకొని వచ్చింది. సంతానం లేదు. ఆ
తల్లీ బిడ్డలిద్దరూ చాలా కాలంగా వస్తూ పోతూ ఉండేవారే. వచ్చినప్పుడల్లా పది
పదిహేనురోజులుండి నిత్యం ఏదో ఒక పిండివంట చేసి, మధ్యాహ్నం
రెండింటికల్లా తెచ్చి భగవానుకూ, భక్తులకూ ఇస్తూండేవారు. భగవాన్ "ఇదంతా
ఎందు" కని ఎన్నోసార్లు చెప్పిచూచారు. వాళ్ళది వినక “ఈ భక్ష్యం అమ్మకు
ప్రియం. అది నాకు ప్రియం, అది అన్నయ్య వస్తే చేసాను" అంటూ నిత్యం
ఏదో తెచ్చేవాళ్ళు. ఈ పర్యాయం కూడా టవునులో ఇల్లు అద్దెకు తీసుకొని,
దాదాపు నెలరోజులుండి యథాప్రకారం పిండివంటలు తెస్తూనే ఉన్నారు. కష్టంలో
ఉన్నారుకదా అనో ఏమో భగవాన్ ఈసారి ఏమీ అనలేదు. ఇంకేం భగవానుకు
ప్రియమేనన్న భ్రాంతితో వాళ్ళు మరీ జోరుగా చేసారు. కడకు రేపు ఊరికి
వెడతారనగా ఈ సాయంత్రం భగవానుని సమీపించి “రేపు ఊరికి వెడతాము” అన్నారు వాళ్ళు.

       భగవాన్ లోలోపల నవ్వుకుంటూ “ఓహో! అల్లాగా! వచ్చిన పని అయిందా
ఏమి?" అన్నారు ఛలోక్తిగా, వాళ్ళకేమీ బోధపడక “ఇంటి వద్ద ఏవో పనులున్నవట, రమ్మని రాసారు" అన్నారు. అది సరేనమ్మా, ఇక్కడికి వచ్చిన పని అంతా
అయిందా? ఏమైనా బాకీ ఉందా?' అన్నారు భగవాన్. వాళ్ళిద్దరూ ఏమీ తోచక
నివ్వెరపడి నిలుచున్నారు. “అది కాదండీ. వెడతామంటారే, పిండివంటలు
ఇన్ని రకాలూ చేయడం అయిందా? ఇంకా ఏమైనా బాకీ ఉన్నవా? అని
అడుగుతున్నాను" అన్నారు భగవాన్. అందరికీ నవ్వు వచ్చింది. ఆ తల్లీబిడ్డలు
ఇద్దరు బదులు చెప్పలేక చేతులు నలుపుకుంటూ నిలుచున్నారు. భగవాన్
నవ్వుతూ “సరి సరి. పోయి రండి" అని సెలవిచ్చారు. వాళ్ళిద్దరూ నమస్కరించి 
వెళ్ళగానే సమీపంలో ఉన్న దామచంద్రయ్యర్ ను చూచి వచ్చిన పని
చూచుకోండర్రా అంటే వినరు.  ఇదంతా ఎందుకని ఎన్నిసార్లో చెప్పాను. ఏం
లాభం. నిత్యం ఆ భక్ష్యం చేద్ధామా,, ఈ భక్ష్యం  చేద్దామా, స్వామికి ఏది ప్రియమో,
ఇదే ధ్యాస. ఇందుకా వచ్చింది? స్వామికి  ఇదేనా ప్రియం! చాలామంది ఇదే
మాదిరి. ఎందుకు వస్తారో ఆ పని మరచిపోతారు. ఏం చేసేదీ' అని సెలవిచ్ఛారు
భగవాన్.

Telegram
T.me/bhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ