రమణాశ్రమ లేఖలు 260 ( 21-11-49)
రమణాశ్రమ లేఖలు 260 ( 21-11-49)
https://bhagavanraman.blogspot.com/2018/11/260-21-11-49.html
1945 మార్చి, ఏప్రిల్ ఆ ప్రాంతంలో తమిళ భక్త విజయంలో ఉన్న
వీఠోబా జ్ఞానేశ్వర సంవాదానికి తెలుగు అనువాదం రాసాను కదా. ఇప్పుడొక
చిత్రం జరిగింది. ఏమంటే 1944లో మను సుబేదారు వచ్చి వెళ్ళిన తరువాత
ఆ సిద్ధసాధక సంవాదం భగవాన్ ఒక భక్తునిచేత ఇంగ్లీషులోకి తర్జుమా చేయించి
మను సుబేదారుకు పంపించినప్పటి నుండీ, ఎవరైనా తెలుగులోనికి అనువదిస్తే
బాగుండునే అన్న ఉబలాటం నాకు కలిగింది. సుబ్బరామయ్య, వెంకటకృష్ణయ్య
ఇక్కడికి వస్తే భగవాన్ సన్నిధిలోనే వాళ్లనడిగితే “నీవు తమిళ్ బాగా మాట్లాడగలవు
కదా, ఎవరిచేతనైనా తమిళ్ చదివించుకొని నీవే రాయడం సరిగానీ
ఇంగ్లీషునుండి రాస్తే బాగుండ" దని ఆ పని నాకే ఒప్పగించి చక్కా పోయినారు.
భగవానది గమనించి ఒకనాడు మురగనారుతో పై విషయమంతా నా ఎదుటనే చెప్పారు. సాయంత్రం భగవాన్ బయటికి వెళ్ళిన సమయంలో మురగనార్ నన్ను చూచి "అమ్మా! భగవాన్ ఇప్పుడు చెప్పిన మాటల ధోరణి
చూస్తే భాషా విషయంలో నీకు చేయవలసిన పని ఎంతో ఉన్నట్లుంది. తమిళ్
నేర్చుకోరాదటమ్మా. ఇతర భాషలైతే నేర్చుకొమ్మని చెప్పనుకాని, భగవాన్
సహజంగా రాసేదీ, మాట్లాడేదీ అరవంలో కదా. అందువల్ల అది నేర్చుకోవాలని
అంటున్నాను' అన్నారు. ఓహో! ఇదే భగవదాదేశం కాబోలునని అరవం,
తెలుగు వున్న బాలబోధిని లైబ్రరీలో ఉంటే తీసుకొని, చూచి చూచి, నా అంతట నేనే అక్షరాలు రాసి దిద్దుకుంటూ ఒక్క వారంలో చదవానూ రాయనూ నేర్చుకున్నాను. కుక్కపాఠం, నక్కపాఠం చదవడానికి మనసొప్పక భక్త విజయమైతే కథాసరళిగా చదివేందుకు బాగుంటుందని తోచి, లైబ్రరీ పనిచూచే వారినది
ఇవ్వండని అడిగాను.
అతనది తెచ్చి సన్నిధిలో ఉండగా నాకు యిస్తూంటే భగవాన్ చూచి "తమిళ్
చదవడం నేర్చుకున్నారా ఏమి?" అన్నారు. “ఏదో కొద్దిగా నేర్చుకున్నా" సని ఆ విషయం నివేదించాను. “సరిసరి. మంచిదయింది" అంటూ "ముందే భక్తవిజయం తీసుకున్నారేమి?" అన్నారు భగవాన్, "భక్తిపరమైన కధలైతే
చదివేందుకు ఉత్సాహంగా ఉంటుందని" అన్నాను. “అయితే, విఠోబా జ్ఞానేశ్వరుల సంవాదం చూస్తారా?" అన్నారు భగవాన్, “ఆ. అది కూడా చూద్దామని ఉంది" అన్నాను. అయితే సరే ఈ పుస్తకం ఇలా తెస్తే ఆ భాగం చూపుతాను. అన్నారు భగవాన్. “సరే” ననీ యిస్తే ఎంతవరకు మన కావశ్యకమో అంతవరకూ ఎర్రసిరాతో గుర్తులు పెట్టి ఆ భాగం నాకు చూపించి యిస్తూ ఆ భాగం తెలుగులో రాస్తారా ఏమి?” అన్నారు భగవాన్. "ఊరికే చూతామని
తీసుకున్నానే కాని రాయడానికి అర్థం కావద్దా?” అన్నాను. 'సరే మీ యిష్టంకాని..
ఎవరినైనా సహాయమడిగి తెలుసుకొని రాస్తే రాయవచ్చునే' అన్నారు భగవాన్.
ఆ తరువాత “భగవాన్ ఈ విధంగా సెలవిచ్చారు. సహాయం చేయగలవా?
అని విశ్వనాథ బ్రహ్మచారి నడిగితే “సరే, సరే నంటూ కొంచెం సాచివేత చేసాడు. అల్లాగే కొన్ని రోజులు గడిచినవి.కడకు ఒకనాడు అకస్మాత్తుగా
సాయంత్రం వేళ వచ్చి “ఏమమ్మా, భగవానుకు చెప్పకుండా రాసి ఉంచుదామా.
చెపితే తెమ్మంటారు, దిద్దుతారు. భగవానుని శ్రమపెట్టామని వాళ్ళంతా అంటారు.
ఏమంటావు?” అన్నాడు. “ఏదోవిధంగా పని కావడం ప్రధానం కదా. తరువాత
భగవత్సంకల్పం ఎలాగుంటే అలాగవుతుంది. రాద్దాం." అన్నాను. సరే" నని
ఆరంభించీ, ఈ కొంచెం రాసి ఆపుదాం. ఈ కొంచేం, ఈ కొంచెం అంటూ
రాత్రి పదింటివరకూ కూర్చుని అంతా ముగించి లేచాం. ఈ లోపల ఏం
జరిగిందనుకున్నావ్. అది శుక్లపక్షం కావడం వల్ల ఐరోపీయస్ స్త్రీ పురుషులు కొందరు వెన్నెల్లో గిరి ప్రదక్షిణానికి వెళ్ళాలని బయలుదేరి ఎనిమిది గంటలకల్లా భగవాన్ వద్దకు వచ్చి "దోవ తెలిసిన వారెవరినైనా తోడు పంపు" డని వేడుకున్నారట,
భగవాన్ సమీపస్తులను చూచి "ఇంగ్లీషు తెలుసును కనుక విశ్వనాథాన్ని పంపితే బాగుంటుంది. పిలవండోయ్" అన్నారట. ఒకరి వెంట ఒకరుగా వెళ్ళి పల్లకోతులో వారుండే కుటీరంలోనూ చుట్టుపక్కలా చూచి
వచ్చి "లే" డన్నారట. “ఎక్కడికి వెళ్ళాడో?” అని భగవానంటే ఎవరికీ తెలియదనే
జవాబు. ఆ తరువాత రమణపురంలో సాధారణంగా ఆయన వెళ్ళే అన్ని యిళ్ళకూ మనుషులను పంపి' ఎక్కడా లేరని ' అన్నారట.'ఎక్కడికి వెళ్ళాడో' అని భగవాన్ అంటే ఎవరికిీ తెలియదనే జవాబు. ఆ తరువాత రమణపురంలో సాధారణంగా ఆయన వెళ్ళే అన్ని ఇళ్ళకూ మనుషుల్ని పంపి ఎక్కడా లేరని అనిపించి, వారికి వేరెవరినో తోడిచ్ఛి పంపారట భగవాన్.
రాత్రి పది దాటిన తరువాత విశ్వనాధులు తన బసకు పెడితే పక్క కుటీరంలో వారు పై సమాచారమంతా చెప్పారట. విశ్వనాధులిక చెప్పక తప్పదు కాబోలనుకుంటూ బ్రాహ్మీ
ముహూర్తంలోనే లేచి భగవాన్ సన్నిధికి వెడితే, చూస్తూనే "ఏమోయ్, రాత్రి ఎక్కడికి వెళ్ళావ్. టవునుకా?" అన్నారట భగవాన్' లేదు'
అన్నారు వారు. "మరెక్కడికి వెళ్ళావ్, వీరంతా రాత్రి రమణపురమంతా వెతికారే"
అన్నారట భగవాన్. “నాగమ్మ యింటికి వెళ్ళా" నన్నారట వారు. "ఓహో అలాగా !
నీవు అంతగా అక్కడికి పోయే వాడుక లేదని వీరక్కడ చూడలేదు అంతసేపూ అక్కడే ఉన్నావా? ఏమైనా చదువుతున్నారా ఏమి?" అన్నారట భగవాన్. ఇంకేం చేస్తాడు, యథార్గం చెప్పక తప్పలేదు. అంతా రాసామని భగవాన్ విని నవ్వుతూ "అదా సమాచారం. పోనీ మంచి పనయింది. అది ఎన్నాళ్ళనుంచో
సంవాదం తెలుగులో కావాలని ఎందరినో అడిగింది. దీనికేమోయ్, సత్కార్యమే కదా , నాతో చెప్పకుంటే మానే. ప్రక్కగదిలో నైనా చెప్పి పోకూడదూ? ఎకడికి
వెళావో ఏమోనని ఎంతమంది వెతికారో చూడూ" అన్నారట భగవాన్.
ఉదయం ఏడున్నరకు యథాప్రకారం నేను వెళ్ళాను. చూస్తూనే తమలో
తాము నవ్వుకుంటున్నారు భగవాన్. ఎందుకో నాకు అర్థం కాలేదు. నమస్కరించి
లేవగానే “ఏమి, విఠోబా జ్ఞానేశ్వర సంవాదం రాత్రి రాసారటగా?" అన్నారు
భగవాన్, నేను ఏమీ చెప్పక నివ్వెరపడి నిలుచున్నాను. “అడుగో విశ్వనాథం.చీకటితోనే చెప్పాడు. 'అలాగా' అని వారి వైపు చూస్తే
నవ్వి ఊరుకున్నారు వారు. 'అంతా రాయటం అయిందా? ఏదీ?" అన్నారు “అయిందిగాని చిత్తుగా వున్నది. సాఫీ రాసి తెస్తా" నన్నాను. "సరే దానికేం, అల్లాగే చేయండి" అన్నారు భగవాన్
భగవాన్ బయటికి వెళ్ళిన సమయంలో విశ్వనాథ బ్రహ్మచారి, రాత్రి జరిగిన సమాచారం అంతా చెప్పి ' గుట్టుగా రాద్ధామంటే బట్టబయలు అయ్యిందమ్మా భగవానుని ఏమర్చడానికి ఎవరి వశం, శ్రీవారే తెమ్మంటున్నారు కనుక భయపడవలసిన పనిలేదు. సాఫీ రాసి తెమ్మని తగిన సహాయం చేసాడు.
సాఫీ రాసి తెచ్చేంతవరుకు "అయిందా అయిందా" అంటూ అడుగుతూ తెచ్చి ఇచ్చిన తరువాత తప్పులు దిద్ధించారు భగవాన్. ఆ తరువాత లేఖల ప్రధమ భాగం ముద్రణలో "అనుబంధంగా అచ్ఛయితే మంచి"దని భగవాన్ సెలవీయడం, నీవు అందుకు అంగీకరించటం మొదలైనవన్నీ నీకు తెలిసిన విషయాలే. భగవాన్ సత్కార్యాలకు ఇదే విధంగా సహాయం చేస్తూ ఉంటారు సుమా.
Telegram
T.me/bhagavanRaman
Comments
Post a Comment