రమణాశ్రమ లేఖలు 259 (14-11-49)

రమణాశ్రమ లేఖలు 259 (14-11-49)
https://bhagavanraman.blogspot.com/2018/11/259-14-11-49.html
చిన్ననాటి చర్యలు

తిరుచ్చుళినుండి వచ్చిననాటి ఉదయం కుశల ప్రశ్నలతో గడిచిపోయింది.
మధ్యాహ్నం రెండింటికే భగవాన్ సన్నిధికి వెళ్ళాను. నమస్కరించి లేచానో
లేదో “శూలతీర్థంలో స్నానం చేసారా?" అన్నారు భగవాన్. “లేదు. ఆ నీరు
ఇప్పుడంతగా బాగుండలేదు. దానికి కొంచెం దూరంగా వున్న కోనేటిలో స్నానం
చేసాం” అన్నాను. “అవును. ఆ నీరు అంతగా బాగుండదు. మాఘమాసంలో
మఖా నక్షత్రంనాడు అది పొంగి పైకివస్తుంది. ఆనాడే స్వామికి అభిషేకోత్సవం.
బ్రహ్మోత్సవానికి పదవనాడన్నమాట. ఆనాడు, అక్కడి మండపం మీదకు స్వామిని
తీసుకొని వచ్చి త్రిశూలజలంతో అభిషేకం చేస్తారు. ఆ అభిషేకమయిన తరువాత
జనమంతా స్నానం చేస్తారు. నా చిన్నతనంలో పిల్లలం అందరం కలిసి, నిత్యం
ఎంత పొంగుతుందో చూద్దామని, మెట్లమీద రాళ్ళతో గీసి గుర్తుపెట్టేవాళ్ళం.
చిత్రంగా పదిరోజులకు ముందే ఆరంభించి రోజుకొక మెట్టుగా పొంగి
పూర్ణిమనాటికి పూర్తి అయ్యేది. మాకు అదొక వినోదంగా ఉండేది. ఈ మధ్య
సరిగా పొంగటం లేదని కొందరన్నారు. మనవాళ్ళు పరీక్షిద్దామని గత ఏడు వెడితే సరిగానే పొంగిందట. పోనీ పురాణంలో చెప్పిన వాక్యం వృధా కాకుండా పొంగిందిలే అని అనుకున్నాను."అన్నారు భగవాన్.

"ఆ నాటికి  గంగ,యమున, సరస్వతులు అక్కడకి వస్తవని అంటారట కదూ?" అన్నాను. “అదే అదే, అలాఅని స్థల పురాణంలో చెప్పి ఉంది. స్వామికి అభిషేకోత్సవం కాగానే, రోజుకొక మెట్టుగా దిగిపోయేది. కోవెలకు పక్కనున్న కల్యాణమండపంలో మేమెప్తుడూ ఆడుకునేవాళ్ళం. కొన్నాళ్ళక్కడ మా బడి
కూడా పెట్టారు చూచారు కదా అది" అన్నారు భగవాన్.

తండ్రిని  నాయనా అనే అలవాటు వాళ్ళ మూలంగానే అయిందా?" అన్నాను." అది లక్ష్మయ్యరు మూలంగా అయింది. వారికి తెలుగు బాగా తెలుసును. నాయనా అని పిలవడం నేర్పారు. నా తండ్రిని నేను నాయనా అని పిలవడం సాగించిన తరువాత ఊరు వారంతా నాయనా అనే వారిని పిలిచేవారు.ఆ లక్ష్మయ్యరుకు నేనంటే చాలా ముద్దు అంతా వెంకటరామన్ అని పిలుస్తూ ఉంటే, వారు మాత్రం రమణ రమణి అని పిలిచే వారు.కడకు అదే ఖాయం అయింది. గణపతిశాస్త్రి భగవానుకు ఈ 'రమణ మహర్షి' అని పేరు పెట్టినప్పుడు ఈ విషయం తెలుసునా?"అన్నాడు రాజగోపాలయ్యర్. "" ఊం వారికేం తెలుసు,చాలాకాలం గడిచిన తరువాత ప్రసంగవశంగా నేనేం ఈ సంగతి వారితో అన్నానంతే."అన్నారు భగవాన్.

   ' లక్ష్మయ్యరు మన ఇంటికి ఎడమ పక్క ఉండే ఇంట్లో ఉండేవారా? 'అన్నా నేను. కాదు కాదు మన ఇంట్లోనే ఎడమ పక్క భాగంలో కొన్నాళ్ళు కాపురం ఉన్నారు. అప్పుడు అక్కడ ఉద్యోగం కావడం వల్ల వచ్చారు. చాలా కాలం తెలుగు దేశంలో ఉద్యోగం చేసారు. అందువల్ల తెలుగు బాగా వచ్చింది. మరచి పోకుండా ఉండడానికి నాతో తెలుగే మాట్లాడేవారు. మన యింట్లో ఇప్పుడు పూజాదులు నడుపుతున్నారే కర్పూరభట్టు, వారి కుటుంబమే అప్పుడూ మన
పక్క యింట్లో ఉండేది. ఇప్పుడు కర్పూరభట్టు తండ్రి ఉన్నారు. చూచారా?”
అన్నారు భగవాన్. “చూచాను. వృద్దులైనారు' అన్నాను. “వారు నాకన్న రెండు
మూడేళ్ళు చిన్నే. వాళ్ళ సవతి అన్నలు నాకంటే పెద్దవాళ్లు ఇద్దరు ముగ్గురు
వుండేవాళ్ళు, వారు వీడిిని సదా ఏడిపిస్తూ వుండేవారు. ఒకనాడు వీడు ఒక
చెరుకుగడా, చాకూ పట్టుకొని కోసేందుకు చేతకాక అన్నల నడిగితే వాళ్ళు
వినిపించుకోక వెళ్ళిపోయారు. వీడు ఏడుస్తాడు. జాలి వేసింది. అవి తీసుకొని
కోయబోయాను. నా వేలు కోసుకొనిపోయి రక్తం వచ్చింది. అయినా పాపం
పసివాడు ఏడుస్తున్నాడని ఎలాగో కోసి పెట్టి తరువాత వేలికి తడిగుడ్డ చుట్టి
పలక్కుండా వూరుకున్నాను. రక్తం ఆగలేదు. అన్నానికి వేళయిందని పిలిచారు.
పోయి కూర్చుంటే కలుపుకునేందుకు చెయ్యి వీలుకాలేదు. నాయనే అన్నం
కలిపి పెట్టి, తరువాత కట్టుకట్టించి విషయం విచారించి తెలుసుకున్నారు. ఒక
నెలకుగాని ఆ గాయం మానలేదు” అని సెలవిచ్చారు భగవాన్,
“బాల్యంనుండీ సహనశక్తి సహజమే నన్నమాట?” అన్నాను. “అది సరి. దాని కేమి. అంటూ ఆ మాట మార్చి మళ్ళీ' వాళ్ళు పూజారులు కదా కాళయారు
కోవెలపూజ వాళ్ళవంతు వచ్చినప్పుడు సాధారణంగా నివేదనకు ఇంటి వద్దనే
అన్నంవండి పిల్లలకిచ్చి పంపేవారు. అప్పుడప్పుడు ఆ పిల్లలతో నేనూ వెళ్లేవాణ్ణి.
కౌండిన్యనది (పాపహరి) లో స్నానంచేసి, గుళ్ళో లింగంమీద చెంబెడు నీళ్ళు
పోసి, ఈ అన్నం నివేదన చేసిన తరువాత మేము తినేవాళ్ళం. *పల్లెమఠంలోని పిల్లలంతా అక్కడకు చేరేవాళ్ళు. సాయంకాలం వరుకు వారితో ఆటలాడి దీపాల
వేళకు ఇళ్లకు చేరేవాళ్ళం” అన్నారు భగవాన్. “సుందరులు విడిది చేసింది
అక్కడే కదా?” అన్నాను. “అవునవును, అక్కడినుండే జ్యోతివనానికి వెళ్ళారు" అన్నారు భగవాన్. "ఆ నది నిండుగా వచ్చినప్పుడు ఏం చేసేవారో? వేరే మార్గం ఉందా?" అన్నాను. “లేదు. అదేదోవ, అయితే ఆ నది
మొల లోతుకంటె ఎక్కువ ఉండదు. ఎప్పుడైనా పొంగితే తెప్పమీద దాటి వెళ్ళేవారు.ఆ రోజుల్లో పిల్లలను పంపక పెద్దవాళ్ళే  వెళ్ళేవారు., ఆ పొంగు ఎక్కువ
రోజులుండేది కాదు. మీరక్కడ స్నానం చేయలేదూ?”అన్నారు భగవాన్.
"చేసాము. కాని ఆ నీళ్లు త్రాగేందుకు వీలుకాకుండా అదొక రకం
ఉన్నవెందుకో?” అన్నాను.
“నిజమే, త్రాగేందుకు బాగుండవు. ఏదో గంధకసంబంధం చేరినందువల్ల
చర్మవ్యాధులకు మంచిదని స్నానం చేస్తారు, అంతే. అక్కడ  స్నానం చేసి
సోమశీతలుడనే రాజు కుష్టవ్యాధి నుండి విముక్తుడైనాడని పురాణంలో చెప్పబడి
ఉంది. నా కొకసారి గజ్జి వస్తే అమ్మ నిత్యం ఆ నదిలో స్నానం చేయించేది.
అదీ జీవవాహిని. మండు వేసంగిలోనైనా ఏమూలనో ఒక పాయ పారుతూనే
ఉంటుంది. కౌండిన్యుని నిమిత్తం ఉద్భవించింది కనుక కౌండిన్య నది" అన్న నామాంతరం కలిగింది” అన్నారు భగవాన్. “ఆ క్షేత్రాన్ని
కౌండిన్య క్షేత్ర మంటారనిన్నీ రమణలీలలో రాసారే?” అన్నాను. “అవును,  కౌండిన్యుడు క్షేత్రంలో తపస్సు చేసినందున వారి వంశంలో జ్ఞాన  సంబంధులు పుట్టారని  ఎవరో రాసారనీ ఉందందులో." అన్నారు భగవాన్. అయితే సంబంధులు కౌండిన్య  గోత్రోద్భవులా?  అన్నాను.

  “అవును. అందుకే మన వెంకటకృష్ణయ్య రమణలీల మీద తన పేరు
'కృష్ణ కౌండిన్యుడు' అని రాసుకున్నాడు. “కౌండిన్య క్షేత్రంలో భగవాన్
పుట్టారు. నది కౌండిన్య. ముఖ్యశిష్యుడు గణపతిముని కౌండిన్యుడు, భగవాన్
పూర్వరూపంలో జ్ఞాన సంబంధులని చాలామంది అభిప్రాయం. ఆ జ్ఞాన
సంబంధులూ కౌండిన్యులే. కౌండిన్యులంతా వాసిష్ఠులే. వసిష్ట శక్తి పరాశరు
లంతా అద్వైత గురుపరంపరలోని వారే కదా. ఆ ప్రవరయే స్వామికి
జన్మశాఖ అని కదా రమణలీలలో రాసారు. చరిత్ర రాసిన నేనూ కౌండిన్యుడనే.మేమంతా ఒక శాఖలోని వారమే, అద్వైత గురుపరంపరలోని వారమే అని తాత్ఫర్యం," అని చిరునవ్వుతో సెలవిచ్చారు భగవాన్. “ఓహో! అదా సిద్దాంతం'
అన్నాను. "అదే అదే. గణపతి శాస్త్రిగారూ, వారి శిష్యులూ గోత్రం ముందు
రాసుకుంటారు కదూ. వీరూ వారి శిష్యులేనాయే. అది కూడా ఒక కారణమే”
అన్నారు భగవాన్.
  "ఆ క్షేత్ర పురాణం విపులంగా రాయబడలేదు కాబోలును” అన్నారొక
భక్తులు. “లేదు అది స్కాందపురాణాంతర్గతమట. సంస్కృతంలో వ్రాతప్రతి
ఉందట, అరవంలో సంగ్రహంగా ఒక పురాణం ఉంది. జ్యోతివన మాహాత్మ్యం
లోనూ అక్కడా అక్కడా అరవంలో ఆ క్షేత్రానికి సంబంధించినవి కొన్ని
కథలున్నవి. అవన్నీ చేర్చి వచనరూపకంగా ఎవరైనా రాస్తే బాగుండును” అన్నారు
భగవాన్ "విశ్వనాథ బ్రహ్మచారి రాస్తారేమో?” అన్నాడు రాజగోపాల అయ్యర్.
ఏమో, ఆ పురాణాలన్నీ చూచి రాసేందుకు సమ్మతించవద్దూ?” అన్నారు
భగవాన్. "చెప్పి చూద్దాం' అన్నారా భక్తులు. “ఊ…ఊ, కానీ” అన్నారు భగవాన్,
సాయంత్రం విశ్వనాథ బ్రహ్మచారి రాగానే భగవాన్ చిరునవ్వుతో “ఏమోయ్.
వీరంతా త్రిశూలపుర మహాత్మ్యం (తిరుచ్చుళి పురాణం) వచనరూపకంగా
నీవు రాస్తే బాగుండును అని అంటున్నారోయ్” అన్నారు. ఆ తరువాతనే విశ్వనాథ
బ్రహ్మచారి త్రిశూలపుర మాహాత్మ్యం భగవాన్ సహాయంతో తదితర పురాణాలన్నీ
పరిశీలించి వచనరూపకంగా అరవంలోకి అనువదించారు. అది వెంటనే ప్రింట్
అయింది. తెలుగులో నాగనార్యులు పద్యకావ్యంగా రాసి ఉన్నారు. అది
అముద్రితం.

Telegram
T.me/bhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ