రమణాశ్రమ లేఖలు 257 (24-9-49)

రమణాశ్రమ లేఖలు 257 (24-9-49)
https://bhagavanraman.blogspot.com/2018/11/257-24-9-49.html

మొదలియారుపాటి

ఎచ్చమ్మగారితో పాటు భగవానుకు భిక్షాకైంకర్యం చేస్తూ వున్న మొదలియారు
పాటి (అవ్వ) నిన్న రాత్రి శరీరయాత్ర చాలించి శ్రీరమణ చరణారవిందములలో
ఐక్యమైంది. ఈ మధ్యాహ్నం గౌండరు కాంపౌండులో సమాధి చేసారు. ఆమె
పూర్వనివాస భూమి కారైక్కాల్ సమీపంలో ఉన్న తిల్లైయ్యాడి అనే గ్రామం.
తొండమండల మొదలియారు జాతి. పేరు అలంకారత్తమ్మణ్ణి. సుబ్బయ్య
మొదలియారనే కుమారుడు, కామాక్షి అనే కోడలు ఉండేవారట. ఆ మువ్వురు
కార్తియప్పస్వామి అనే వృద్ద సన్యాసిని సేవిస్తూ సద్గోష్టితో కాలం గడుపుతూ
వచ్చారు. ఆ స్వామి 1908లోనో 1909లోనో శరీరం విడిచారట. వారి
చరమదశలో ఈ కుటుంబంవారంతా “స్వామీ, మా గతి ఏమి'' టని విలపిస్తే
"అరుణాచలంలో ఉంది” అన్నారట వారు..

   ఆ తరువాత 1910లో కొడుకునూ కోడలిని వెంటబెట్టుకొని ఇక్కడకు
వచ్చిందట. అప్పటికి రెండేండ్ల నుండీ ఎచ్చమ్మ భగవానునకు భిక్షాకైంకర్యం చేస్తూ ఉంది. అలంకారత్తమ్మణ్ణి కూడా అదే విధంగా ఆరంభించి క్రమంగా రమణభక్తులకూ అప్పుడప్పుడు భోజనం పెడుతూ వచ్చిందట. కొడుకూ కోడలూ సహాయపడే వాళ్ళు.
కొన్నాళ్ళకా కొడుకు విరక్తుడై తీరుప్పనంతాళ్ మఠంలో
సం
సంన్యాసదీక్ష నంగీకరించి, తంపురానుగా పర్యటనం ఆరంభించాడట. కోడలు
కామాక్షి తదేకనిష్టతో, వచ్చింది మొదలు తిరిగి రైల్వేస్టేషనైనా చూడక భర్త
విడనాడినందుకు భయపడక, భగవాన్ కైంకర్యమందే మనస్సును లగ్నం చేసి
1938 -1939 ఆ ప్రాంతంలో శరీరయాత్ర చాలించింది. ఆ ప్రాంతంలో శరీరయాత్ర చాలించింది.

  అప్పటికి పాటి చేతులో డబ్బు లేదు. ఇంట్లో సహాయం లేదు. ఒంట్లో శక్తి లేదు. అది చూచి జాలితో సర్వాధికారి నిరంజనానందస్వామి , కుంజుస్వామి, రంగనాథ గౌండరూ మొదలైన వారంతా " పాటీ! ఇక నీవు ఈ కైంకర్యం
కొఱకు కష్టపడలేవు. ఇప్పుడు ఆశ్రమం అందరికీ ఆశ్రయభూతంగా ఉంది. కనుక నువ్వు ఇక్కడే తిని భగవాన్ సన్నిధిలో కళ్ళు మూసుకుని కూర్చో, లేదా ఇంటికే అన్నం పంపుతాము. తిని ఇంట్లో ఉండు." అని బోధిస్తే , ఏ చిక్కులు రానీ,
కానీ, ఈ కైంకర్యం విడువను. కాసు లేకుంటే కర్ర పొడుచుకుంటూ
వెళ్ళి బిచ్చమేతైనా భగవానుకు పెట్టి నేను తింటానుగాని ఊరుకోను " అని కళ్ళ
నీరు కారుస్తూ వెళ్ళిపోయిందట పాటీ. కుంజుస్వామీ,గౌండరు మొదలైన
భకులకు జాలి కలిగి, రెక్కసహాయమూ, ధనసహాయమూ చేస్తూ కైంకర్యం
నడపసాగారు. ఆ తరువాతనే రంగస్వామి గౌండరు రమణనగరంలో ప్రస్తుతం
కుంజుస్వామీ ఉంటున్న స్థలంకొని ధర్మశాలగా రెండిళ్ళు కట్టించి, కుంజుస్వామి
ఉన్నంతవరకూ వారూ, వారి తదనంతరం సాధుసంఘానికిన్నీ వ్యయపరచేటట్టుగా
కొంత ఆస్తి ఏర్పరచి, పాటిని అక్కడకు తీసుకొని వచ్చారు. కడపటి కాలంలో
సంన్యాసిగా ఉన్న తంపురాను తల్లివద్దకు వచ్చి కైంకర్యంలో  పాల్గొంటూ ఉన్నాడు. ఈ విధంగా దాదాపు నలువదేండ్లనుండీ దినము తప్పక భగవదారాధన
చేసిన ఇంకొక భక్తురాలి ఐహికజీవితం అస్తమించింది.

   పాటికి భగవాన్ వద్ద చాలా స్వతంత్రం, నేనిక్కడికి వచ్చిన కొత్తలో అన్నం
తానే తెచ్చి భగవానుకు స్వయంగా వడ్డించేది. పట్టెడు కూరా, పట్టెడు అన్నం
పెట్టేది. ఒకనాడు భగవాన్ "అంతంత పెడితే ఎల్లాగ తినటం? అని
గదమాయించారు. పాటి స్వతంత్రంగా “ఏంత సామీ! కొంచెమేనే?" అన్నది.
“మిగతావన్నీ ఉన్నవాయే. కడుపు పట్టవద్దూ?" అన్నారు భగవాన్. "అంతా
తలపే కదా స్వామీ?” అంటూ యథాప్రకారం పెట్టి వెళ్ళింది పాటి. భగవాన్
నవ్వుతూ సమీపస్తులతో “చూచారా? నా మాట (ఉపదేశం} నాకే ఒప్ప
చెపుతోంది" అన్నారు.

  రెండు మూడేండ్ల నుండి పాటికి కళ్ళు సరిగా కనుపించనందువల్ల
వడ్డన మానివేసి ఎవరిచేతనో అన్నం పంపుతూ వచ్చింది. ఆ మధ్య భగవాన్ శరీరం శుష్కించిందని ఎవరో చెప్పారట. తాను వడ్డించడం మానినందువల్లనే భగవాన్ శరీరం సుష్కించిందని, వారితో వీరితో అంటూ, ఒకనాడు శ్రీవారిని చూచేందుకు,వచ్చింది
పాటి. వచ్చి భగవానుని సమీపించి కంటికి చెయ్యి అడ్డం పెట్టుకుని చూచి
"ఎంత శుష్కించిందో శరీరం" అంటూ విచారించింది. 'ఎవరు చెప్పారు పాటి. బాగానే ఉన్నాను. అదంతా వట్టిదే. అన్నారు
భగవాన్. పాటి వచ్చి ఆడవాళ్ళ స్థలంలో ముందువైపు కూర్చుంది.
భగవాన్ బైటికి వెళ్ళే నిమిత్తం లేచారు. శ్రీవారు లేస్తే  అంతా లేస్తారు కదా.
పాటీ తలుపు పట్టుకొని నుంచుంది. భగవాన్ ఆమెను సమీపించి నవ్వుతూ
"పాటీ. చిక్కానా, ఎంత బాగున్నానో చూడూ. అమ్మకు కన్ను తెలియలేదు."
అంటూ బయటికి వెళ్ళారు.

ఇటీవల ఆమెకు బొత్తిగా కళ్లు కనుపించడం లేదు. అలా ఉండే నాలుగు
నెలల క్రితం భగవాన్ సన్నిధికి వెడతానంటే భక్తులొకరు పట్టుకొని తీసుకొని
వచ్చారు. భగవాన్ సమీపంలో ఉన్న వారెవరో "పాటీ  భగవానుని చూచేందుకు
కళ్లు కనుపించవు కదా. ఎందుకు వచ్చావు?” అంటే నాకు భగవాన్ శరీరం
కనుపించకున్నా భగవాన్ దృష్టిలో నా శరీరం పడుతుంది కదా" అన్నది పాటి.
భగవాన్ చేతి పుండుకు ఆపరేషన్ చేస్తారని విని ఆమె పడ్డ పరితాపం ఇంతని
చెప్పలేము. ఎచ్చమ్మ నిర్యాణ మయినప్పుడు “ఇంకా ఆ మొదలియగారు వాటి
ఉంది” అని సెలవిచ్చారు భగవాన్. ఇప్పుడు ఆమె కూడా గతించింది. భగవాన్
తమ భారం తీరినట్లు పల్కకుండా ఊరుకున్నారు సుమా. ఆమె భాగ్యవతియే కాని, నా మనసెందుకో వ్యాకులపడుతూ ఉంది.
Telegram
T.me/bhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ