రమణాశ్రమ లేఖలు 256 (20-4-49)
రమణాశ్రమ లేఖలు 256 (20-4-49)
https://bhagavanraman.blogspot.com/2018/11/256-20-4-49.html
శివం సుందరం
ఆంధ్రదేశం నుండి అప్పుడప్పుడు వస్తూ పోతూ వుండే ఒక జమిందారిణి
(పెదపవని) భర్త ఆజ్ఞానుసారం, పిల్లలూ తానూ గత నెల రెండవ వారంలో
ఇక్కడికి వచ్చి నెలరోజులుండి మొన్ననే వెళ్ళింది. ఆమె అయిదారురోజుల కిందట
ఒక సాయంత్రం వేదపారాయణానంతరం భగవానుని సమీపించి “భగవాన్ నాకు
లోగడ స్వప్నంలో దర్శనమిచ్చి ఉపదేశం చేసారు. ఆ తరువాత ఆత్మను
తెలుసుకున్నాను. కాని నిలకడ కలగడంలేదే?” అన్నది. భగవాన్ దరహాసంతో
"నిలకడ లేకుండా ఎక్కడికి పోయినాం. ఎవరికి నిలకడ లేదంటారు?” అన్నారు.
“అది నిలవటం లేదే?” అన్నదామె. 'నిలకడ లేకుండా ఎక్కడికి పోయా
మండీ?" అన్నారు భగవాన్. “శరీరబాధ వల్లా, సంసార తాపత్రయం వల్లా ఆ
అనుభవానికి నిలకడ కలగడం లేదు” అన్నదామె. “ఆ. అది. అలా చెప్పండి.
వచ్చేవి వస్తవి. పోయేవి పోతవి. మనం మనంగానే వుంటాం” అన్నారు భగవాన్
అలా వుండగల శక్తి తమరు నా కనుగ్రహించాలి,” అన్నదామె. “మీరు ఆత్మను
తెలుసుకున్నారు. దాన్ని తెలుసుకొన్న తరువాత అన్నీ అవే పోతవి,” అన్నారు
భగవాన్. “మరి పోలేదే?” అన్నదామె. భగవాన్ నవ్వుతూ “ఊ…ఊ. పోతవి పోతవి, వాసనలు బహుకాలంగా గూడుకట్టుకొని వున్నవి. మనం దాన్ని తెలుసుకున్నట్లయితే అవి క్రమేణా పోతవి" అని సెలవిచ్చారు. పోగొట్టుకునే శక్తి భగవాన్ అనుగ్రహించాలి" అందామె.భగవాన్"ఊ ఊ.. "అంటూ భగవాన్ వూరుకున్నారు.
మర్నాడు మళ్ళీ అదే వేళకామె భగవాన్ సన్నిధిలో నిలిచి వినయ విదేయతలతో "భగవానే, గృహిణికి గురు సన్నిధిలో నివసించుటకు వీలు
లేదా?” అన్నది. “తానెక్కడ వుంటే అక్కడే గురుసన్నిధి” అన్నారు భగవాన్.
ఆమెకింకా సమాధానం కుదరక “లోకమంతా బ్రహ్మమయంగా చూడవలెనా?
తన్నే ప్రధానంగా చూడవలెనా?” అంది. “మనమున్నాము. జగత్తు బ్రహ్మముగానే
వుంది. ఇక బ్రహ్మమయంగా చూచేదేమి?” అన్నారు భగవాన్ . ఆమె నివ్వెరపోయి
నిలుచున్నది. భగవాన్ అనుగ్రహ దృష్టితో చూస్తూ “అదేనండీ. మనం ఉండనే
వున్నాం కదా. జగత్తు కూడా బ్రహ్మమయంగా ఉన్నదేనాయే. ఇక జగత్తును
బ్రహ్మమయంగా చూచేదేమి? మన దృష్టిని బ్రహ్మమయంగా చేయాలి. 'దృష్టిం
జ్ఞానమయీం కృత్వా పశ్యేద్ బ్రహ్మమయం జగత్' అన్నారు. మనం ఎలా
చూస్తే అల్లాగే వుంటుంది. స్థూలంగా చూస్తే స్థూలంగా వుంటుంది, బ్రహ్మముగా చూస్తే బ్రహ్మముగా ఉంటుంది. అందువల్ల మన దృష్టిని మార్చుకోవాలి. స్క్రీన్
(తెర) లేకుండా బొమ్మలు చూస్తామా? మనం మనంగా వుంటే అన్నీ సరిపోతవి."
అని సెలవిచ్చారు.
ఆమె సంతోషంతో తృప్తి చెంది బయటికి వచ్చి భగవాన్ సోఫాకు ఎదురుగా
వున్న వసారా గడపలో కూర్చున్నది. భగవాన్ మందహాసం చిందులాడే ముఖంతో
మౌనముద్రాంకితులై సోఫామీద కూర్చుని వున్నారు. షోడశకళాపరిపూర్ణ సుధాకర
బింబంవలె శాంతి సమృద్ధమై ప్రకాశించే భగవానుని వదనమండలం ఆమె
చూచి అప్రయత్నంగానే “ఆహా! భగవాన్ ఎంత సుందరంగా వున్నారో" అంది. ఆ మాట
ఆ మాట వింటూ వున్న భక్తులొకరు శ్రీవారిని సమీపించి "భగవాన్ ఎంత
సుందరంగా ఉన్నారో అంటున్నదామె" భగవాన్ తల ఊపుతూ " శివం సుందరం"అన్నారు సుమా. ఎంత చక్కని మాటో.
Telegram
T.me/bhagavanRaman
Comments
Post a Comment