రమణాశ్రమ లేఖలు 255 (2-8-49)

రమణాశ్రమ లేఖలు 255 (2-8-49)
https://bhagavanraman.blogspot.com/2018/11/255-2-8-49.html
ప్రాణాయామం

మొన్న నీవు ఇక్కడికి వచ్చినప్పుడు భగవాన్నడిగిన ప్రశ్నలూ, శ్రీవారి
ప్రత్యుత్తరాలూ సరిగా వినపడలేదనీ, రాసి చూపమనీ ఒక భక్తుడడిగితే రాసి
చూపాను. సరిగా ఉన్నదేమో చూస్తావని నీకూ అన్ని లేఖలతో పాటు ఇదిన్నీ
పంపుతున్నాను. 28-7-49 సాయంత్రం 4 గంటలకు నీవు భగవాన్ సోఫాకు
సమీపంలో కూర్చుని “గాయత్రిలో ‘ధియో యోనః ప్రచోదయాత్' అన్నారే,
దాని భావం ఏమిటి?” అని అడిగావు. భగవాన్ సాదరంగా చూస్తూ “ధీ, అంటే
బుద్ధికదా. ‘ధియో యో నః ప్రచోదయాత్' అంటే, యః ఏ తేజస్సు, నః మాయొక్క ధియః బుద్దులను, ప్రచోదయాత్ ప్రబోధింపచేయుచున్నదో
అని అర్థం. ఆ బుద్దిచేత ప్రేరేపింపబడిన ఇంద్రియముల ద్వారానే కదా సమస్తం
చేయడం?' అన్నారు.

“సాధనకు ప్రాణామాయం అవసరమా?” అన్నావు నీవు. ఊ ఊ ,ఏ ఒక్కపనికైనా ముందు ప్రాణాయామం చేసే కదా ఉపక్రమించడం
ప్రాణానాయమ్య' అన్నారు. అంటే ఆచమనం చేసి, ప్రాణాలను నియమించుకొని
సంకల్పం చెప్పుకో మన్నారన్నమాట. ముందు ప్రాణాయామం చేసి గాయత్రి ని
జపించుమన్నారు. ఏ జపానికైనా అంతే. ముందు ప్రాణాయామం చేయాలి.
అయితే అంతటితో ఆగిపోరాదు. ప్రాణాలను నియమించి జపిస్తే జపించగా
జపించగా జపమేదో తెలుస్తుంది” అన్నారు భగవాన్.

   “ప్రాణాయామంవల్ల అంతగా ప్రయోజనం లేదని కొందరంటారే?" అన్నావు నీవు. “అదే అదే. అపక్వచిత్తులైతే ఊపిరి నిలిపి ధ్యానించాలి, జపించాలి అని అంటారే కాని పక్వచిత్తులకు ధ్యానమే ముఖ్యం. ఊపిరి పీల్చి, బిగబట్టి, ప్రాణాలు
నియమిస్తే ఉక్కిరిబిక్కిరి అయినట్టుంటుంది” అన్నారు భగవాన్. “జాలపక్షిత్
అన్నట్లే కొట్టుకుంటుందన్నమాట” అన్నావు నీవు. “అవునవును. అయితే
అపక్వచిత్తుల కది చేయకుంటే మనస్సు వశపడదు. అందుకే వశపడే వరకూ,
దాన్ని ఉపయోగింపవలసిందని అంటారు. కాని దానితో ఆగరాదన్నారు.
పరిపక్వచిత్తులకు దానంతట అదే ప్రాణాయామం సిద్ధిస్తుంది. ఎందువల్లనంటే
ఉన్నదే ప్రాణాయామం. అది తనంత తానే సదా కలుగుతుంది. జపించినా, ధ్యానించినా మనస్సు ఒక్కచోట నిలుస్తుంది కదా. అప్పుడు
ప్రాణాయామం దానంతట అదే కలుగుతుంది. మనస్సును ఏకాగ్రతకు తేవడానికే
అన్ని సాధనలూ” అన్నారు భగవాన్.

  “ధ్యానం చేస్తుంటే ఒళ్ళంతా వేడెక్కినట్లుంటుందే. ఎందువల్ల? అదిమంచిదేనా?” అన్నావు నీవు. 'అవును, ఉండదా మరి. ఎందువల్ల అంటే మనసు ఏకాగ్రమైతే వాయురోధం దానంతట అదే కలుగుతుంది, వాయురోధన మైతే
ముందు ముందు ఒళ్ళంతా వేడెక్కిన ట్లుంటుంది.ఉంటే ఏమి?   తరువాత సహజమై పోతుంది” అన్నారు భగవాన్.

  చిన్న వదినె అక్కడే ఉంది కదా. ఆమె అందుకొని “జపమన్నా, ధ్యాన
మన్నా ఒకటేనా?” అన్నది. “ఆహా! జపించగా జపించగా జపమేదో తెలుస్తుంది.
దాన్నే ధ్యానమంటారు. అంటే వృత్తి శబ్దరూపమైనప్పుడు జపమనీ, కేవల వృత్తిని
ధ్యానమనీ, వస్తువును జ్ఞానమనీ అంటారు” అని సెలవిచ్చారు భగవాన్.

Telegram
T.me/bhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ