రమణాశ్రమ లేఖలు 41 ప్రదక్షిణతత్త్వము 11-4-1946
రమణాశ్రమ లేఖలు 41 ప్రదక్షిణతత్త్వము 11-4-1946
http://bhagavanraman.blogspot.com/2018/10/41-11-4-1946.html
ఇవాళ ఎంత సుదినమనుకున్నావు! భగవంతులొక దివ్యమైన ఉపదేశం చేశారు. నేనిక్కడికి వచ్చినది మొదలు ఉదయం, సాయంత్రం హాలు చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేసి భగవానులకు నమస్కరించటం మామూలు.
https://www.facebook.com/359807631501891/posts/494306308052022/?app=fbl
ఈ ఉదయం ఎనిమిది గంటలకు యథాప్రకారం ప్రదక్షిణం చేస్తూ వుంటే ఏదో అలౌకిక వాణి భగవన్ముఖస్థమై వెడలి వేణువల్లే నా చెవులకు తాకింది. ఏమా అని తలెత్తి కిటికీలోనుంచి భగవాన్ సోఫా వైపు చూచాను. బాల భానుని కిరణాలు భగవాన్ శరీరం మీద సోకి వింత శోభను చేకూరుస్తూ వున్నవి. డాక్టరు శ్రీనివాసరావు గారు కాళ్ళకు తైలం రుద్దుతూ వున్నారు. శ్రీవారి ముఖంలో మందహాసం చిందులాడుతూ వుంది. 'ఓహో! నాగమ్మేనా? ఎవరో ననుకున్నాను" అంటున్నారు. సరే ఏదో చెపుతారనుకొని హాలులోకి వచ్చి నమస్కరించి లేచానో లేదో, మందహాసంతో, "ఏమి? వారందరినీ చూచి నేర్చుకుంటిరా ఏమి? ఎన్నిసార్లు ప్రదక్షిణ జేసేది?" అన్నారు భగవాన్. నాకూ నవ్వు వచ్చింది. కాని ఎన్నిసార్లని అడగటం వల్ల మూడుసార్లు అన్నాను. "సరి సరి, ఇక చాలును. మీరు చేస్తే అంతా చేస్తారు. అదొక ఉపద్రవం. వారికి వద్దని చెప్పాను. మీకు కూడా చెపుతున్నాను. ఏం? ఏమి?" అన్నారు భగవాన్. "దానికేమి, వద్దంటే మానుతాను" అని కూర్చున్నాను. భగవాన్ నా వైపు చూచి "అదుగో వారంతా హాలు చుట్టూ తిరుగుతూ వూరికే ప్రదక్షిణం చేస్తూనే వుంటారు. ఎందుకది? నిన్ననే వారందరికీ వద్దని చెప్పాను. నాగమ్మ కూడా ప్రదక్షిణం చేస్తున్నదే. ఆమెకు మాత్రం చెప్పవద్డా అని అనుకుంటారని మీకు చెప్పాను" అని చెప్పి వెనుక అందరికీ బోధగా ప్రదక్షిణాన్ని గురించి ఈ విధంగా బోధించారు భగవాన్.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
"ప్రదక్షిణ మంటే ఏమిటి? 'పరిభ్రమతి బ్రహ్మాండ సహస్రాణి మహేశ్వరే! కూటస్థాఖిలరూపేస్మిన్ ఇతి ధ్యానం ప్రదక్షిణం' అని గదా శంకరులు చెప్పారు. మీరు హాలు చుట్టూ తిరగటం చూస్తే అందరు ఇట్లాగే చేయాలి గాబోలని కొత్తవారంతా కోవెల చుట్టూ తిరిగినట్లు తిరగటం ప్రారంభిస్తారు. ఎందుకది?"
"శంకరులు దేనిలో వ్రాశారిది?" అన్నారొక భక్తులు, "పరాపూజ", "ఆత్మపూజ" అని పూజలు రెండుగా వ్రాశారు వారు. ఆ రెండూ కలిపి వ్రాసి 'పరాత్మపూజ' అని నేను పేరు పెట్టాను. ఈ శ్లోకం దానిలో వున్నది. ఆ భావమే తీసుకొని అరవంలో ఋభుగీతాకారులు ఇంకా వివరంగా చెప్పారు చూడండి" అని భగవాన్ ఆ పుస్తకం తెప్పించి చదివి చెప్పారిట్లా. "ఓ ఈశ్వరా! నిన్ను ప్రదక్షిణిద్దామని బ్రహ్మాండ కోట్లు తిరిగాను. ఎక్కడా నీవే నిండి వున్నావు. నిన్నెట్లా చుట్టి వచ్చేది? కూటస్థాఖిల రూపుడవని ధ్యానిస్తాను. అదే నీకు ప్రదక్షిణం' అని భావం. నమస్కారమంటేనూ అంతే. మనస్సు స్వస్థితియందడగుటే నమస్కారంగాని లేస్తే ఒకసారి, కూర్చుంటే ఒకసారి, అటుపోతూ ఒకసారి, ఇటు వస్తూ ఒకసారి మొక్కటం కాదు".
"తామిప్పుడు సెలవిచ్చిన ఆ ప్రదక్షిణ నమస్కారాదులు అతీతస్థితిగల వారికి గాని మాలాంటి వారికి గురువందనాదులు వలదా? ముల్లోకములతో అద్ద్వైతం చూపినా గురువుతో చూపరాదని వున్నది గదా?" అన్నారు డాక్టరు, మొదలియారున్నూ. "అవును. నిజమే. అద్వైతమంటే అసలు నమస్కారం చేయరాదనా? అతి కూడదన్నారుగాని. భావమందద్వైతం వుండాలిగాని బాహ్యానికి పనికి వస్తుందా. అన్నిటినీ సమదృష్టితో చూడమన్నారని కుక్కవలె అది తినే ఆహారం దానితో సమంగా తినగలమా? పిట్టకు పిడికెడాహారం సరిపోతుందని మనకు చాలునా? మనము పట్టెడన్నం తిన్నామని ఏనుగుకు అంతే ఇస్తే పోసగుతుందా? అందువల్ల భావమందద్వైతం వుంచుకొని, బాహ్యానికి లోకాన్ననుసరించి వర్తించాలి. జ్ఞానికి కష్ట సుఖా లేవీ సోకనప్పటికీ పరుల కోసం అన్ని కార్యాలూ చేస్తాడు. కూలికి గుండె బాదుకొని ఏడ్చే వారివలె. అంతే. వారికేదీ అంటదు" అన్నారు భగవాన్.
"కూలికి గుండె బాదుకోవటం ఏమిటి?" అన్నారొకరు. "పూర్వం ఒక ఆచారం వుండేది. ఇంట్లో ఒక వృద్దు గతించారనుకోండి. ఇంటి వారికి ఏడుపు రాదు. అయితేనేమి? మరణించినందుకు ఎవరో ఒకరు ఏడ్చి తీరాలి. అది ఆచారం. కూలికి పని చేసినట్లు డబ్బు తీసుకొని ఏడవటం వృత్తిగా ఏర్పరచుకున్న వాళ్ళుండేవాళ్ళు. వాళ్ళని పిలిపిస్తే భజన చేసినట్లు ఇదికూడా సాగించి సొంతజనం కంటే ఎక్కువగా గుండె బాదుకుంటూ రకరకాల ఏడ్పులు ఏడ్చి, ప్రాక్టీసయి వుండటం వల్లనో, ఉల్లిపాయ మొదలైనవి కంట్లోపెట్టుకోనో, కళ్ళ నీళ్ళు ధారగా కారుస్తూ, యథా విధిగా అభినయించి ముగించేవారు. అట్లాగే ఎదుటి వారి చిత్తవృత్తికి తగినట్లు తానుకూడా క్రమం తప్పకుండా జ్ఞాని వర్తిస్తాడు. ఏ పాటకు ఆ తాళం వేస్తాడు. అన్నీ బాగా అభ్యాసం చేసి వుండటం వల్ల ఏదీ వారికి కొట్టలేదు. ఎవరెట్లా పిలిస్తే అట్లా వెడతాడు. ఏ వేషం కావాలంటే ఆ వేషం వేస్తాడు. ఆనీ ఇతరుల కోసమే గాని వారి కొక్కటీ అక్కరలేదు. అడిగేవారి అర్హతను బట్టి ఆచరణ జరుగుతుంది. మంచి చెడ్డలు ఎవరికి వారే గమనించుకోవాలి" అన్నారు భగవాన్.
లోగడ సమీపవర్తులగు భక్త సహోదరులను గురించి స్వతంత్రంగా "ఇదెందుకు చేయటం? అదెందుకు చేయలేదు?" అని భగవాన్ అంటూ వుంటే "నా కా భాగ్యంలేదే" అని అనుకునేదాన్ని. నేడాకోరిక తీరటమే గాక, ఒక ఉపదేశం కూడా లభించింది. "నేను అంతటా నిండివుంటే, నా కెట్లా ప్రదక్షిణం చేస్తావు? కోవెల చుట్టి వచ్చినట్లు తిరగటానికి, నేనేం రాతి విగ్రహానన్ననుకున్నావా?" అన్నట్లున్నది శ్రీవారి వాక్కు.
T.me/BhagavanRaman
Comments
Post a Comment