రమణాశ్రమం లేఖలు 30 కోపం 26-1-1946
రమణాశ్రమం లేఖలు 30 కోపం 26-1-1946
http://bhagavanraman.blogspot.com/2018/10/30-26-1-1946.html
నిన్న నూతనాగతులగు ఆంధ్ర యువకులొకరు తమ ఇంద్రియ చాపల్యమంతా భగవాన్ తో నివేదించారు. "అంతా మనస్సేనయ్యా, దాన్ని బాగుచేసుకో" అంటే, "అది సరే స్వామీ! ఎంత తగ్గించుకుందామన్నా ఈ కోపం వుందే మళ్ళీ మళ్ళీ వస్తున్నది. ఏం జేసే" దన్నాడా అమాయకుడు. "ఓహో, అట్లాగా ఆ కోపం మీద కోప్పడండి సరిపోతుంది" అన్నారు భగవాన్. హాల్లో అంతా నవ్వులు, నిజంగా అన్నిటి మీదా కోపించుకొనేవానికి తన కోపం మీద కూడా కోపం రాదేమని కొంచెం లోద్రుష్టివస్తే అన్ని కోపాలకి అతీతుడవుతాడు గదా?
https://www.facebook.com/359807631501891/posts/501297424019577/?app=fbl
రెండు మూడేండ్ల క్రిందట చొరవగల భక్తులొకరు వచ్చి తన్నెవరో సదా దూషిస్తున్నారని భగవానునితో ఐదారుసార్లు చెప్పారు. భగవాన్ వింటూ ఊరుకున్నారు. ఎన్నిసార్లు ఎంత దూరం చెప్పినా సమాధానం రాకపోవటం వల్ల ఆ భక్తుడు ఆగలేక "అనవసరంగా అంత తిడుతుంటే నాకూ కోపం వస్తున్నది. ఎంత ఆపుకుందామనుకున్నా ఆగటంలేదే? ఏం జేయాలి?" అన్నాడు. భగవాన్ నవ్వుతూ "ఏం జేయాలా? నీవు గూడా వారితో చేరి నిన్నే తిట్టుకో,సరిపోతుంది" అన్నారు. అందరికీ నవ్వు నచ్చింది. ఆ భక్తున కేమీతోచక "సరిపోయింది. నన్ను నేనే తిట్టుకోవాలా?" అన్నాడు. "ఔనయ్యా! నీ శరీరాన్ని గదా వారు దూషించేది? కోపతాపములకు నిలయమైన ఈ శరీరం కంటే శత్రువులెవ్వరు? దీన్ని స్వతహా మనమే ద్వేషింపవలసి వున్నది. మనమట్లా చేయక ఏమరి ఉన్నప్పుడు ఎవరైనా దూషిస్తే మనల్ను ప్రబోధిస్తున్నారని అనుకొని అప్పుడైనా తెలివి తెచ్చుకొని మనం గూడా వారితో చేరి దీన్ని నిందించి నిరసించాలి గాని ఎదురు తిడితే ఏం లాభం? అట్లా దూషించే వారినే మిత్రులుగా భావించాలి. వారి మధ్యన ఉంటేనే మనకు మేలు. భూషించే వారి వద్ద వుంటే ఏమరిపోతాం" అన్నారు భగవాన్.
https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD
1924 జూన్ లో ఆశ్రమమందు దొంగలు ప్రవేశించి భక్తులను బాదుటయే గాక భగవానులనున్నూ తొడమీద కొట్టి పారిపోయిన వెనుక ఒకరి దెబ్బలొకరు చెప్పుకొనేప్పుడు భక్తులంతా "భగవానుని గూడా కొట్టారే దుర్మార్గు " లని అంటే భగవాన్ నవ్వుతూ "ఓహో,మీరంతా పూలతో పూజిస్తే వారు కర్రతో పూజించారు. అదీ పూజే. ఇది గ్రహించినప్పుడు అది మాత్రం గ్రహించవద్దా ఏమీ?" అని అన్నారట. వారి బోధ ఆచరణ రూపంగా వుంటుందనుట కిదీ నిదర్శనమే గదా?
T.me/BhagavanRaman
Comments
Post a Comment