రమణాశ్రమ లేఖలు 55 (10-8-1946)

రమణాశ్రమ లేఖలు 55 (10-8-1946)
http://bhagavanraman.blogspot.com/2018/09/55-10-8-1946.html
సిద్ధులు

     ఈ రోజున భగవత్సన్నిధిలో సిద్ధులను గురించి ప్రసంగం వచ్చింది. ఎవరో సిద్ధులకై ప్రయత్నించారనీ, ఏమో సంపాదించారనీ ఏమేమో మాట్లాడారు కొందరు. భగవాన్ విని విని ఉద్రేక ధ్వనితో "ఏమో సిద్ధులట, ఎక్కడినుంచో సంపాదిస్తారట. అందుకొరకు సాధనలు, తపస్సులూను. రూపంలేని మనకు కళ్ళు, కాళ్ళు, చేతులు, ముక్కు, చెవులు, నోరు ఇత్యాదులతో కూడిన ఈ శరీరం రావటం, దీనితో ఏమేమో చేయటం, ఇదంతా సిద్దేగదా? మనమంతా సిద్ధులమే. అన్నం కావాలంటే అన్నం, నీళ్ళు కావాలంటే నీళ్ళు, పాలు కావాలంటే పాలు, అన్నీ సిద్ధిస్తూ వున్నవి. ఇన్ని రకాల సిద్ధులు ఎప్పుడూ అనుభవిస్తూనే ఇంకా ఏమో సిద్ధులు గావాలని గంతులు పెడతారు. ఏం కావాలో?" నన్నారు భగవాన్.

     దాదాపు రెండేళ్లకు ముందు అఖిల భారత శాసనసభా సభ్యుడు, జ్ఞానేశ్వర భగవద్గీతకు అనువాదకర్త అయిన మనసుబేదారు భగవత్సందర్శనార్థం వచ్చినప్పుడు, శ్రీవారి సన్నిధిలో ప్రసంగవశంగా "అన్ని గ్రంథాలలో సిద్ధపురుషులను గురించి వ్రాశారే గాని సాధకులను గురించి వ్రాసినవి ఎక్కడా కనిపించవే? అట్టి గాధలేమైనా ఉన్నవా?" అని అడిగితే, "తమిళ 'భక్త విజయం' లో జ్ఞానేశ్వర విఠోబాల సంవాదం వున్నది. అది సిద్ద సాధకసంవాదం. దానిలో సాధకుని స్థితి విపులంగా తెలుస్తుంది" అని చెప్పి ఆశ్రమ గ్రంథాలయంలో ఉన్న 'భక్త విజయం' తెప్పించి ఆ భాగం శ్రీవారే చదివి విషయం వివరించి చెప్పారు. మను సుబేదారు స్వస్థానం చేరిన వెనుక ఆ భక్త విజయం పంపమని వ్రాస్తే ఆ పుస్తకం తెప్పించి పంపుతూ ద్రావిడ భాషలో ఉన్న ఆ సంవాదం ఇంగ్లీషులోకి భగవాన్ తర్జుమా చేయించి పంపారు. సుబేదారు దానిని మూడవ కూర్పుగా ప్రచురిస్తూ వున్నా తమ జ్ఞానేస్వరికి అనుబంధంగా చేర్చారు.

     ఈ మధ్యనే ఆ సంవాదాన్ని తెలుగులోకి అనువదించాను. మొన్న పూర్ణిమకు నీవిక్కడికి వచ్చినప్పుడు ఈ సంవాదవిషయమైన ప్రసంగవశాన "జ్ఞానేశ్వరుడు సిద్ధుడు, విఠోబా సాధకుడు" అని భగవాన్ చెప్పారు కదా! అందువల్ల దానికి సిద్ధసాధక సంవాదము అని పేరు పెట్టాను.

     "తన్ను, దా తెలిసి తాను తానుగ నిలువగలుగుట సిద్ధిగాని వేరేదీ సిద్దిగా భావించరాదు" అని భగవానులు అప్పుడప్పుడు అంటూ ఉంటారు. తన తలపు ఆత్మాన్వేషణలో మగ్నం చేస్తే ఎప్పటికైనా యథార్థం గోచరిస్తుంది. అదే ఉత్తమసిద్ధి.

"ఉన్నది నలువదిలో శ్రీవారీ సిద్ధులను గురించి రచించిన వచనమే దీనికి ప్రమాణంగా వ్రాస్తున్నాను చూడు.

సిద్ధమై యుండు వస్తువును యెరిగి యుండుటయే సిద్ధి

ఇతర సిద్ధులు అన్నియు స్వప్న సిద్ధ సిద్దులే నిద్రపోయి మేలు

కొనిన వెనుక అవి సత్యమగునా! సత్య వస్తు నిస్టులై మాయ

వీడిన వారు వానియందు భ్రమ నొందగలరా? దెలియుము.

సిద్ధసాధక సంవాదము:

     శ్రీ పాండురంగ విటలుని యనుగ్రముచే జన్మించిన విఠోబా అడవియందు తపమొనర్చుచుండ వారి బిడ్డలగు జ్ఞానేశ్వరాదులు పట్టణమందున్న మాతా మహునింట నివసించుచుండిరి. ఆ బిడ్డల మేధాసంపత్తికి ఆ దేశపు రాజు ఆశ్చర్యమంది ఇట్టి సంతతి వడసిన జనకుడెంత మహనీయుడో యని చింతించి వారిని పట్టణమునకు రావించి పూజింపదలచి తోడ్కొని వచ్చుటకై దూతలతో సహా జ్ఞానేశ్వరాదులను వారికడ కంపెను. దూతలెంత ప్రార్థించినను విఠోబా నగరమునకు రా నిరాకరించిరి. జ్ఞానేశ్వరులు తామెట్లో తమ తండ్రిని ఒప్పించి తోడ్కొని రాగలమని చెప్పి వారినందరను పట్టణమున కనిపి, పిదప తన వాదముచే జనకుని మెప్పించి పట్టణమునకు తోడ్కొని చనిరి.

విఠోబా జ్ఞానేశ్వర సంవాదము

జ్ఞా: నాయనా! తాము నగరమం దుండక అడవియం దున్నచో మేము మాత్రము

     నగరమున సుఖముగ నుండగలమా? కన్న తండ్రిని విడుతుమా? శీఘ్రమే

     మాతో పట్టణమునకు ప్రయాణము గండు.

వి: అప్పా! జ్ఞానేశ్వరా, కక్కినది ఆయాసము దీర్చు పాయసమే కానీ, దానిని తిను వారుందురా? వాక్కులు ఉత్తములకు రెండుగా నుండునా? అడవికి వచ్చిన పిదప నగరమున ప్రవేశింపవచ్చునా. తెలివిలేని మనుజులతో స్నేహము చేయవచ్చునా? వారిని మచ్చికతో మనసార విశ్వసింపవచ్చునా? అల్పుడగు రాజును పూజింపనగునా? ఎప్పటికినీ నాకీ యరణ్యమే శరణ్యము. మీకు పట్టణమే వాసయోగ్యమగును. కావున నీ పట్టు వదలి పట్టణమున కేగి సుఖముగా ఉండుము.

జ్ఞా: నాయనా! తామీ యడవి యందుండు కారణమేమి?

వి: అప్పా! జ్ఞానేశ్వరా! నగరమున నికమీద నేను పొందదగిన భోగ లాభమేమున్నది? నగరమునకు వచ్చినచో మోక్షమునకు విఘ్నమే గాని సహాయము లేదు. నిర్జనమైన ఈ అడవియే మౌననిష్ఠకు యోగ్యము. ఈ కొండ చరియ యందే సంచరించెదను.

జ్ఞా: ఆకాశ మగపడకుండజేయుటకు తాము కన్నులు మూయక దుప్పటిచేత నాకసమును కప్పదలచినట్లును, చిన్న పిచ్చుక తన పాదములచే పిడుగు నాపదలచినట్లును, దుష్కర్మలొనర్చుచు ధర్మమును వెదకునట్లును, కఠినుడు ఈశ్వర దర్శనమున కాసించినట్లును, అహంబుద్ధి మానక జ్ఞాననిష్ట సాధించునట్లును ఉన్నది నగర మనియు, అడవియనియు బేధభావముతో మీరు బ్రహ్మ నిష్ఠ సాధించుట. అభేదనిష్టలో భేదభావములు ఉండనగునా?

వి: మమకారమున్న పర్యంతము ఆహంకారముగాని, అది యిది యను ద్వైతభావన గాని పోదు. ఈ భేదభావనల పోగొట్టునది నిర్వికల్ప నిష్టయే. ఈ నిర్వికల్పనిష్ట నిస్సంకల్పమునను, నిస్సంగత్వమునను లభించును. కావున ఏకాంతమైన కాననమే మౌననిష్టకు సరియైనదని ఈ స్థలమందు ఉండేదను.

జ్ఞా: తన్ను దెలిసి తానుగా నుండుటే బ్రహ్మనిష్టగాని అడవియం దొంటరిగా నివసించుట నిష్టకాదు.

వి: సద్గురు సన్నిధి తన్ను దా దెలిసికొన్నను తానుగా నిలుచుటకు ఏకాంత స్థానముననే ముఖ్యముగా నుండవలదా?

జ్ఞా: అడవియందు ఏకాంతముగా తప మొనరించిననే అజ్ఞాన నివృత్తి కాదు, అహంకార మమకారములు వీడవు అని ఆత్మజ్ఞానులు అడవియనియు, నగరమనియు, సన్న్యాసమనియు, సంసారమనియు తలపక దృఢచిత్తులై నిర్వికల్ప సమాధిని పొందియుండ మీరు మాత్రము సంసారము కూడదని ఈ యడవియందు ఉండుటకు కారణమేమి?

వి: సాక్షిని తెలిసి సర్వసాక్షిలో నైక్యమైనవారు సంసారమందున్నచో సమాధిసాధనకు విఘ్నము కలిగి సాక్షాత్కారము తప్పిపోవును. అందువలన సహజానందానుభూతి పరులు సంసారాపేక్షను స్వప్నమందైనను చింతింపరు.

జ్ఞా: ఇది వలయుననేడి సంకల్పమును, ఇది వలదనెడు వికల్పమును లేక యున్ననే సహజనిష్ట గాని ఈ అడవి నపేక్షించి నగరమును ఉపేక్షించి ఉండుట నిష్ఠ అగునా?

వి: సంకల్ప వికల్పరహితులకు వ్యాపారమెట్లు సాగును? వ్యవహారమున కుపయోగింపనివాడు నగరముననున్న ప్రయోజనమేమి? శవమునకు వివాహ మొనర్చునటులు అనృతజడ దుఃఖాత్మకమగు నీ దేహపోషణకై బహుసంకటముల కాస్పదమగు జనపదమునం దుండుట కూడనే కూడదు.

జ్ఞా: వ్యాపారమునం దిచ్చలేదు. సమాధి నభ్యసించుచున్నారు. ఆ సాధనయు నొక వ్యాపారమే గదా? ఈ వ్యాపారమున్న వారికి సంసార వ్యాపారమును ఉండనిండు.

వి: సమాధి యొక వ్యాపారమైనను సమస్త సంకల్ప చాంచల్యములను నాశనమోనర్చును. సంసార వ్యాపారమో సమస్త చాంచల్యములను సమకూర్చి సదా కష్టముల నొదవును గదా.

జ్ఞా: సచ్చిదానంద స్వరూపమే తాను. ఇక నిష్టాసాధన మేల చేయవలెను?

వి: జాగ్రదావస్థలో సుషుప్తి పొందుటయే బ్రహ్మనిష్టయని ఉత్తములనెదరు. అట్లుండని సమాధిచే అడ్డులేని యానందము కలుగునా?

జ్ఞా: జాగ్రదావస్థలో ఇంద్రియ చేష్టలును, స్వప్నావస్థలో మనోవ్యాపారమును, సుషుప్త్యవస్తలో శుద్ధశూన్యమును సాక్షివలె గాంచి సంతసించుటే ఆనందమనియు, శ్యేన (గ్రద్ద) చ్చాయ వలె దేనికిని అంటీయంటక యుండుటే జాగ్రత్సుషుప్తి యనియు వేదాంత శాస్త్రములు ఘోషింప, శుద్ధశూన్యమైన సుషుప్తి యందు ఉండుటే ఆనందమనియు జాగ్రత్సుషుప్తి యనియు తాము తలదగునా?

వి: ఏ సాధనము చేయక విచారజ్ఞానము వలన తానే బ్రహ్మ మని యన్నచో దుఃఖమయమైన విషయాదికములను జయింపగలమా? అఖండానందమైన యాత్మలో నైక్యమందగలమా?

జ్ఞా: బ్రతికియున్న పశువే పులిని చంపలేదు. చచ్చిన పశువు చంపునా? అట్లే నిత్యముగను, నిష్కళముగను, అఖండానందముగను ప్రకాశించుచున్న యాత్మను జంకునట్లు దృఢజ్ఞానము వలన పూర్ణుడైన జ్ఞాని సన్నిధికి విషయములు రానే రావు. వచ్చినను పులి ఎదుర్కొను పశువు ఎట్లపాయమును పొందునో అట్లే నశించిపోవును.

వి: వ్యభిచారిణితో గూడి చరించినచో పతివ్రతయు చెడునట్లు అజ్ఞానితో చేరిన సుజ్ఞానియు విషయాదులం జిక్కి మనశ్చాంచల్యమునం జొక్కి దుఃఖమయమై పోయిననో?

జ్ఞా: దృఢ చిత్తయగు పతివ్రత బహువ్యభిచారినులతో కూడియున్నను, నిర్మలముగానే యుండును. దార్ధ్యములేని యాపే ఎవరి సహవాసము లేకయున్నను తన పాతివ్రత్యమును స్వబుద్ధిచేతనే భంగపరచుకొనును. అట్లే దృఢ జ్ఞాని అనేకులగు అజ్ఞానులచే చుట్టుకోనబడినను పూర్వజ్ఞానము నుండి జారకుండును. దార్ధ్యము లేనివాడు ఎకాంతిగా నున్నను జారిపోవును.

వి: సంసార వ్యాపారమున నుండియే సహజ జ్ఞాని యెట్లా కాగలడు?

జ్ఞా: బ్రాహ్మణుడు చండాల వేషము ధరించి నటించినను చండాలుడు గాక బ్రాహ్మణుడే యగునట్లు, సుజ్ఞానియు అజ్ఞానులతో గూడి బహువిధ నటనముల నుండినను పరమానందాను భోగిగనే యుండును.

వి: ఎంత దృఢ ప్రజ్ఞగల వాడైనను ఒక ముహూర్తకాలమేని బ్రహ్మానుసంధానము చేయకున్నచో బ్రహ్మజ్ఞాని యగుట బహు దుర్లభము.

జ్ఞా: చండాల వేషము ధరించి నటించు విప్రుడు మాటి మాటికి నేను విప్రుడనని తలపవలయునా? అట్లు తలపని యెడల చండాలుడైపోవునా? జగమెరిగిన బ్రాహ్మణునకు జందెమేల? నే నను సహంత నశించిన పిదప ఇంకను నేనను నహంకార గ్రంధినే పట్టుకొని 'నేను బ్రహ్మమును' అని బ్రహ్మానుసంధానము చేయవలయునా? జగమెరిగిన విప్రునకు జందెము లేకున్నను అందరిచేతను భూసురుడనియే పూజింపబడినట్లు నేను, నాది, యను నహంకార మమకారములు లేనివాడు ఏ విధమగు ననుసంధానము చేయకున్నను అందరిచేతను పూజింపబడి బ్రహ్మానందాను భోగిగనే యుండును.

వి: జగదీశ్వరునకు సాటివాడైనను తాను బ్రహ్మమను యనుసంధానము ప్రతిదినమును చేయకుండిన యెడల నహంత సులభముగ పోనేపోదు.

జ్ఞా: దీపము చేతబట్టి 'చీకటి! ఉండు' మన్న నుండునా? అటులే దేహాదులు నేనను నజ్ఞానమును ఎదిరించి బ్రహ్మమే తానని తెలిసిన పిదప 'అజ్ఞానమా! ఉండు' మనిన నుండునా? పిల్లిని ప్రక్క నుంచుకొని 'చిలుకా! పలుకు' మన్న పలుకునా? అటులనే జీవేశ్వర జగదాదులు అసత్యమని తెలిసిన వాడు స్త్రీ ఎదుట నేను పురుషుడనని చెప్ప లజ్జపడు పెడివలె బ్రహ్మ సత్యమనియు, మాయ అసత్యమనియు, బ్రహ్మము నిర్వికల్పమనియు, మాయ సంకల్ప వికల్పమనియు, తానే బ్రహ్మమనియు, బ్రహ్మమే తాననియు, సద్గురునాథుని సన్నిధానమున నిస్సందేహముగా నెరిగిన వానికి సంకల్పమేది, వికల్పమేది, బంధమేది,  మోక్షమేది; జననమేది, మరణమేది; నగరమేది, విపినమేది; దానమేది

, తపమేది; సన్యాసమేది, సంసారమేది యని చచ్చిన గొర్రె కన్నువలె జగమందున్న వానిఎదుట మాయ యొక్క సామర్థ్యము అణుమాత్రమైన ఫలించునా? బాగుగా యోజించి చూడుడు. అని ఈ విధముగా జ్ఞానేశ్వరులు పలుకగా విఠోబా సంతసించి వారితో పట్టణమున కరిగెను. అంత నచట రాజుచే పూజింపబడి సుఖముగా నుండెను.

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ