రమణాశ్రమ లేఖలు 54 (6-8-1946)


నిర్మలమైన భక్తియే నిజమైన సేవ

     ఈ రోజున ఒక భక్తులు భగవానునితో "స్వామి, తాము కొండమీద వుండగా కరక్కాయలు వచ్చిన సమాచార మేమి?" అని అడిగితే ఇట్లా సెలవిచ్చారు భగవాన్.

     విరూపాక్ష గుహలో వుండగా మలప్రవృత్తికిగాను రాత్రి రాత్రి ఒక్కొక్క కరక్కాయ తింటూ వచ్చాను. ఒకరోజున కరక్కాయలు పూర్తిగా అయిపోయినవి. పలనిస్వామి బజారుకు పోవాలని అనుకుంటూ వుంటే కరక్కాయల సంగతి శేషయ్యరుతో చెపుతావా? అన్నాను. 'త్రోవేగదా, వెళ్ళేటప్పుడు చెప్పి వెడతా' నన్నాడు. ఆ మరుక్షణమే ఒక భక్తులు ఊరినుండి వచ్చారు. వారప్పుడప్పుడు వస్తూవుండేవారే. ఒక్కక్షణం వుండి బయటకి వెళ్ళారు. కొంతసేపటికి పలని బజారుకు వెడదామని బయలుదేరాడు. ఇంతలో ఆ వెళ్ళినవారు తిరిగి వచ్చి 'స్వామీ! మీకు కరక్కాయలు కావాలా?' అన్నారు. ఉంటే ఒకటి రెండివ్వండన్నాము. పెద్దమూట తెచ్చి ముందర పెట్టారు. 'ఇవన్నీ ఎక్కడివయ్యా?' అంటే 'స్వామీ? తమ దర్శనం చేసుకొని ప్రక్కనున్న పల్లెలో పని వుండి బండిలో వెళ్లాను. నా బండి కన్నా ముందే ఈ కరక్కాయలతో నిండిన గోనెలతో ఒక బండి పోతూవున్నది. ఒక గోనెకు చిల్లిపడి ఇవన్నీ దారి కడ్డంగా పడినవి. ఎందుకైనా మంచిదని ఏరి తెచ్చాను. ఉండనీయండి స్వామీ' అన్నారు. అవన్నీ ఎందుకని రెండు మూడు వీశెలు ఎత్తిపెట్టి మిగతావి వారికిచ్చేశాం. ఈలాంటివి ఎన్నో జరిగినవి. ఎన్నని చెప్పగలం? అమ్మ వచ్చి వంట పెట్టిన వెనుక ఇనప గరిటె వుంటే బాగుండునే అనేదామె. చూద్దాంలే అనేవాణ్ణి. మర్నాడో మూడోనాడో అయిదారు రకాల గరిటెలు తెచ్చేవారొకరు. పాత్ర సామాను అంతే. ఇది ఉంటే బాగుండును, అది ఉంటే బాగుండును, అని అమ్మ అనటం, అట్లాగా? అని నేననటం, ఆరోజో, మర్నాడో, ఒకటికి పది రావటం, చాలు చాలు బాబూ అనిపించేది. అవన్నీ ఎవరు కాపాడేది? ఇట్లాంటి సంభవాలెన్నో, అంతేమిటి?" అన్నారు భగవాన్.

     "ద్రాక్షపళ్ళ సంగతేమిటి?" అన్నారా భక్తులు "ఆ, అదీ ఇట్లాగే మలశోధనకు మంచిదని ఎవరన్నా తెచ్చి యిస్తే వాడుతూ వుండేవాళ్ళం. ఒకరోజు పండ్లు అన్నీ అయిపోయినవి. ఎవరైనా అంగడికి వెడుతుంటే చెప్పనా అన్నాడు పలనిస్వామి. చూద్దాంలే, ఏం తొందర అన్నానేను. అంతే. మరి కాస్సేపటి కల్లా పట్నం నుండి గంభీరం శేషయ్య అన్న వచ్చారు. చేతులో పెద్దపొట్లం, ఏమయ్యా అంటే, 'ద్రాక్ష' అన్నారు. 'అరే, ఇంతకు ముందే అయిపోయినవని అనుకున్నాం. నీ కెట్లా తెలిసిందయ్యా' అంటే, 'నాకేం తెలుసు, స్వామీ! ఇక్కడికి రాబోతూ రిక్తహస్తాలతో ఎట్లా పోవటమని బజారుకు వెళ్లాను. ఆదివారం గదా అంగళ్లు అన్నీ మూసివున్నవి ఒకటి తప్ప. 'భగవాన్ దగ్గరకు పోవాలి. ఏం వున్నదయ్యా' అన్నాను. 'ద్రాక్ష మాత్రం వున్నది. ఇవీ ఇంతకుముందే వచ్చినవని' పొట్లం కట్టి ఇచ్చాడు. తెచ్చాను. ఇంతకుముందే స్వామీ నాకీ సంకల్పం కలిగింది! అన్నారు వారు. వేళ సరిచూచుకుంటే ఒక్కటే అయింది. మరీ అయ్యాస్వామి కిది బాగా అనుభవం. ఇక్కడ ఏదో ఒకటి వుంటే బాగని మేమనుకోటం. అదే సమయంలో భగవానుల కిది తీసుకు వెడదామని వారికి తోచటం జరిగేది. ఎట్లా తెలిసిందయ్యా నీ కంటే 'ఏమో స్వామీ! నాకేం తెలుస్తుంది. స్వామికి ఈ వస్తువు తీసుకుపోవాలని తోస్తుంది? తెస్తాను. అంతే. మీరు అదే అనుకున్నామంటారు. ఈ చిత్రం స్వామికే తెలియాలి' అనేవారు అయ్యాస్వామి. నిజంగా వారి మనస్సు అంత స్వచ్ఛంగా ఉంచుకునేవారు. ఇక్కడ మన మేది తలిస్తే అక్కడ వారి మనస్సులో అదే ప్రతిఫలించేది" అన్నారు భగవాన్. మన మనస్సును కల్మషం లేకుండా స్వచ్చమైన స్ఫటికం లాగ ఉంచాలని వేరే చెప్పాలా! అయ్యాస్వామి జీవితమే అందుకు నిదర్శనం గదా! ==> సూరి నాగమ్మ

Telegram
T.me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ