రమణాశ్రమ లేఖలు 53 (28-7-1946)


స్వప్నాలు - భ్రాంతులు

     ఈ మధ్య ఉత్తర హిందూ దేశస్తులొకరు వచ్చి కొన్నాళ్ళు ఉన్నారిక్కడ. ఒకరోజు మధ్యాహ్నం మూడు గంటలకు భగవత్సన్నిధికి వచ్చి ఒక అరవ భక్తుని ద్వారా తన అనుభవం ఇట్లా నివేదించారు: "స్వామీ! నిన్న నేనిక్కడి వసతి గృహంలో నిద్రపోతున్నాను. తమరు వచ్చి నాతో మాట్లాడుతూనే వున్నారు. ఇదేమిటి?" అని అడిగారు. "నీవు నిద్రపోతున్నావు గదా. ఇక మాట్లాడేదెవరితో?" నన్నారు భగవాన్. "నాతోటే" నన్నారు వారు. అందరికీ నవ్వు వచ్చింది.

     "మీరు నిద్రపోతున్నానన్నారు. నిద్రపోయే వారితో ఏమి మాటలు? కాదు, మాట్లాడానంటున్నారు. అంటే శరీరం నిద్రపోతున్నా నీ వున్నావన్నమాట. ఆ నీవెవరో తెలుసుకో ముందు. ఆ వెనుక నిద్రలో మాట్లాడే విచిత్రాల సంగతి ఆలోచిద్దాం" అన్నారు భగవాన్. మరి జవాబు లేదు. కరుణాపూర్ణ దృక్కులతో అందరినీ కలయజూచి 'రెండే వుండేది: సృష్టి, నిద్ర. నిద్రపోతే ఏమీ లేదు. లేస్తే అన్నీ వున్నవి. జాగ్రత్తతో నిద్రపోవటం నేర్చుకుంటే సాక్షి మాత్రంగా ఉండగలుగుతాం. అదే సరైన పంథా" అన్నారు భగవాన్.

     ఇట్లాగే ఆ మధ్య సుబ్బరామయ్యగారు భగవంతులను చూచి ఏదో ప్రసంగవశంగా "అస్పర్శరూపం అంటే ఏమిటి?" అని ప్రశ్నించారు. "రూపం కంటికి కనపడుతుందే గాని స్పర్శకు అందదన్న మాట. అదే అస్పర్శరూపం" అన్నారు భగవాన్. ఛాయారూప మంటే ఏమిటని మళ్ళీ ప్రశ్న. "అదే అదే. ఛాయగా కనపడుతుంది. పరికించి చూస్తే ఏమీ వుండదు. దేవుడో, దయ్యమో, స్వప్నమో, ప్రత్యక్షమో, ఆవేశమో, ఏదో అనుకోండి. ఇంతకు, చూచేవాడుంటే గదా ఇవన్నీను. చూచేవాడేవడో చూచుకుంటే, ఇవేవీ వుండవు. ఏమీ లేనిదేదో, అన్నిటికీ మూలమైనదేదో, అది తాను. తనెవడో చూడక ఇవన్నీ చూచినందువల్ల ప్రయోజనమేమి?" అన్నారు భగవాన్.

     ఈ మధ్య ఒకరు తమ స్నేహితులు సూక్ష్మ శక్తి పరిమాణాలు చూడగలవారున్నారనీ, వారు మహాపురుషుల సూక్ష్మ శక్తి పరిమాణాలు చూచారనీ, అందులో శ్రీ అరవిందుల సూక్ష్మ శక్తి కాంతి ఏడు ఫర్లాంగుల దూరం వ్యాపించిందనీ, భగవాన్ సూక్ష్మ శక్తి యొక్క కాంతి మూడుమైళ్ళ వరకు చూడగలిగితేనే గాని ఆ వెనుక ఎంతవరకు వ్యాపించిందో చూడలేక పోతిననీ, బుద్ధుడు మొదలైన వారిదెవ్వరికీ ఇంతదూరం వ్యాపించలేదనీ చెప్పినట్లుగా భగత్సన్నిధిలో నివేదించారు. చిరునవ్వుతో ఆమూలాగ్రంగా విని, "ఇందరి సూక్ష్మ శక్తి పరిమాణాలు పరిశీలించుటకు ముందు తన సూక్ష్మమేదో పరిశీలించుకోమని చెప్పండి. సూక్ష్మ శక్తి పరిమాణాలట, చూస్తారట, తన సూక్ష్మమేదో చూచుకుంటే ఈ గొడవలుండవు" అన్నారు భగవాన్. తన్నుదా గన్న వానికి ఇవన్నీ భావనా మాత్రములు గదా! ==> సూరి నాగమ్మ

Telegram
T.me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ