రమణాశ్రమ లేఖలు 51 (12-7-1946)

మాధవుని మరణం

     నాలుగురోజుల క్రితం అంటే 8  లేక 9 తేదీన ఉదయం ఏడున్నరకు భగవత్సన్నిధికి వెళ్ళాను. నమస్కరించి లేచేసరికి "మాధవుడు పోయినాడ" న్నారు భగవాన్. వారప్పుడప్పుడు ఆశ్రమం విడిచి ఇతర క్షేత్రాలకు పోవటం మామూలు గనుక "ఎక్కడికీ?" అన్నాను నేను. చిరునవ్వుతో "ఎక్కడికా? అక్కడికే, శరీరం విడిచి" అన్నారు భగవాన్. ఉలికిపడి "ఎప్పుడూ?" అన్నాను. "మొన్న సాయంత్రం ఆరుగంటల కట" అని చెప్పి, కృష్ణస్వామిని చూచి ఇట్లా అన్నారు భగవాన్. "అక్కడున్న ఆచార్లస్వామి ఇక్కడకు వచ్చి సమాధి అయినారు. ఇక్కడున్న వీరికి అక్కడ సమాధి. వారి వారి ప్రాప్తానుసారం నడుస్తుంది. చాలా కాలం నుంచీ మాధవున కొక కోరిక వున్నది. పై యధికారి లేకుండా తాను స్వతంత్రంగా వుండాలని. ఆ కోర్కె తీరింది. పోనీ, మంచివాడు. నేనేదో తమాషాగా అన్నాను. కుంభకోణం మఠంలో వుండే ఆచార్లస్వామి ఇక్కడ సమాధి అయినారు. ఆ మటంలో ఎవరూ లేరోయి పోతావా? అని. అదే పట్టుకొని వెళ్ళి ఆశ తీర్చుకున్నాడు. చూడండీ చిత్రం. తెలుగు ద్విపద మొదలైనవి నేను మళయాళపు అక్షరాలలో నోటుబుక్కులో వ్రాస్తే తెలుగు వాళ్ళవలెనే చక్కగా చదివేవాడు. వాడి కేదో తెలుగు సంస్కారం వున్నది. ఆ నోటుబుక్కు చూచుకుంటూ ఉంటానని తీసుకపోయాడు. ఉంటే తెమ్మని చెప్పండి. అయ్యా స్వామీ ఇంతే. చూచి తెస్తానని పట్టుక వెళ్ళాడు నోటుబుక్కు. మనిషే తిరిగి రాలేదు. వీడిదీ అట్లాగే అయింది" అంటూ ప్రసంగం మార్చారు. పన్నెండేళ్ళు భగవానులకు నీడగా వర్తించి సేవ జేసిన పరమ సాధువు హఠాత్తుగా ఎక్కడో కుంభకోణంలో మరణించాడంటే కంట తడిపెట్టని ఆశ్రమవాసులు లేరు.

     సమాధిచేసే నిమిత్తం ఇక్కడి నుండి వెళ్ళిన కుంజుస్వామి ఈ ఉదయం ఎనిమిదింటికి వచ్చి నమస్కరించి, "మాధవుడు మనస్చాంచల్యం వల్ల ఎక్కడెక్కడో తిరిగి, స్థిమితపడక నేనింక జీవించనని ఎందరితోనో చెప్పి, కుంభకోణం మఠానికి వచ్చి అకస్మాత్తుగా అతిసారపు వ్యాధితో ఒకరోజే రవంత శ్రమపడి సోడా తాగుతూ ప్రాణం విడిచారనీ, ఆ వెనుకనే పడుకో పెట్టామనీ, సమాధిలో వుండే పోయారనీ, మఠంలో వున్నవారు చెప్పారు. నేను వెళ్ళేవరకు శవం ఉంచారు. మూడోరోజుకైనా ఏమీ చెడలేదు. సమాధి చేసి వచ్చాను. నోటుబుక్కు దొరకలేదు" అని చెప్పి వెళ్ళిపోయాడు.

     వారటుపోగానే కృష్ణస్వామిని చూచి "ఏదో మంచివాడు. అయ్యో పోయాడని విచారిస్తాం. పోయాడని విచారించటం కంటే మనమెప్పుడు పోతామా అని విచారించవలసి వున్నది. జ్ఞాని ఎప్పుడూ ఈ ప్రారబ్ధక్షయం ఎట్లా అవుతుందా, ఎప్పుడీ శరీరం త్రోసి పోదామా అని చూస్తాడు. కూలికి బరువు మోసేవాడు ఎప్పుడు గమ్యస్థానం వస్తుందా అని చూస్తూ ఉంటాడు. యజమాని ఇంటిముందర మూట దింపరా అనగానే అమ్మయ్య అని క్రింద పెడతాడు. అట్లాగే వివేకికిన్నీ ఈ శరీరం బరువుగా వుంటుంది. వారు పోయినారు. మన మెప్పుడు పోతామా అని నేనెదురు చూస్తాను. ఏమిటో, ఆ కాస్తా పోతే, నలుగురు మోయాలి ఈ దేహాన్ని. ఆ చైతన్యం వుంటే, బరువే లేదు. అది పోతే దీనంత భారం ఏదీ లేదు. ఈలాంటి దేహం కొరకు కాయకల్ప వ్రతాలు చేస్తారు ఈ దేహంతోటే మోక్షం పొందాలని. ఇంతా చేసి వారూ ఎప్పుడో పోతారు. ఈ దేహంతో స్థిరంగా వుండే వారొకరూ లేరు. తత్త్వం తెలిసిన పిమ్మట అస్థిరమైన దేహం ఎవరికి కావాలి? ఈ భారం త్రోసి వేసి ఎప్పుడు పోదామా అని విచారించాలి" అన్నారు భగవాన్.

     ఈ మాధవస్వామి మళయాళీ. జన్మభూమి పాలఘాటు సమీపంలో ఒక గ్రామం. ఇరువదేండ్లు వయస్సునందే ఇక్కడకు వచ్చి దాదాపు పదిహేనేండ్లు భగవానుని పాదసేవ చేసిన బ్రహ్మచారి. దైవాద్వా క్షేత్రాటనాసక్తుడై కొన్నాళ్ళుగా పోతూ వస్తూ వున్నాడు. కుంభకోణంలో ఒక మఠం కట్టించుకొని వున్న రమణ భక్తుడగు ఆచార్యస్వామి ఈ మధ్య ఇక్కడకు వచ్చి గతించుట వల్ల తానక్కడ మఠాధిపతిగా నిలిచి అచిరకాలమందే గతించిన శాంత భక్తుడు.

== సూరి నాగమ్మ

Telegram
T.me/bhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ