రమణాశ్రమ లేఖలు (3-6-1946) జపతపాలు


శ్రీ రమణాశ్రమ లేఖలు (3-6-1946)

జపతపాలు

నిన్ననొక పెద్దమనిషి వచ్చాడిక్కడికి, సద్బ్రాహ్మణుడు. ఆయన మాటలవల్లా, మెళ్ళో వున్న రుద్రాక్షమాల వల్లా,మంత్ర జపపరాయణుడని తెలుస్తున్నది. భగవాన్ విరూపాక్ష గుహలో వుండగా ఒకసారి దర్శించానని చెప్పాడు. ఈ మధ్యాహ్నం శ్రీవారిని సమీపించి "స్వామీ! పంచాక్షరి గాని తారకం గాని, ఏదో ఒక మంత్రం జపిస్తూ వుంటే సురపానాది దోషాలన్నీ హరింపగలవా?" అని ప్రశ్నించాడు. "అంటే ఏమిటి మీ ఉద్దేశ్యం" అన్నారు భగవాన్. 'పైన చెప్పిన మంత్రాలన్నీ జపిస్తూ వున్న వారు జారత్వ చోరత్వ సురాపానాదులు చేసినా, ఆ మంత్రజపం వల్ల ఈ దోషాలు హరింపబడగలవా? ఆ పాపము వారినంటకుండునా?" అని మళ్ళీ తర్కించి అడిగాడా విప్రుడు.

"నేను జపిస్తున్నాననే భావం లేకుంటే, వీటివల్ల కలిగే దోషం వారి కంటదు. నేను జపిస్తున్నాననే భావం వున్నప్పుడు దురభ్యాసాల వల్ల కలిగే పాపం మాత్రం ఎందుకంటదు?" అన్నారు భగవాన్. "ఈ పుణ్యం ఆ పాపాన్ని హరింపదా?" అన్నాడా బ్రాహ్మణుడు. "నేను చేస్తున్నాననే అహంభావం ఉన్నంతవరకు దేనికది అనుభవింపవలసిందే. ఒక దానితో వేరొకదాన్ని కప్పిపుచ్చటం ఎట్లా పొసగుతుంది? నేను చేస్తున్నాననే భావన పోయినప్పుడు తనకేదీ అంటదు. తానెవరో తెలుసుకుంటే గాని నేను చేస్తున్నాననే భావన పోదు. తన్ను దా నరసిన వానికి జపమేది? తపమేది? ప్రారబ్ద వశంగా శరీర యాత్ర సాగుతుందే గాని వాడొక్కదానిని ఇచ్చింపడు. ప్రారబ్దం అనేది ఇచ్చా ప్రారబ్ధం, అనిచ్చాప్రారబ్ధం, పరేచ్చాప్రారబ్ధం అని మూడు విధాలు గదా? తన్ను దా నెరిగిన తత్త్వజ్ఞునకు ఇచ్చా ప్రారబ్ధం లేనేలేదు. అనిచ్చా,పరేచ్చా రెండే ఉంటవి. వారు ఏది చేసినా పరులకొరకే. ప్రారబ్ధానుసారం చేయవలసిన పనులుంటే చేస్తారుగాని తత్ఫలితం వారి నంటదు. అటువంటి వారు ఏది చేసినా పుణ్యపాపములు లేవు. అయితే వారు ఎప్పుడు లోకాన్ననుసరించే నడుస్తారు గాని అవకతవక పనులు చేయరు" అని యుక్తియుక్తముగా సెలవిచ్చారు భగవాన్.

"తన్ను తా నెరిగినవానికి ఇచ్చాప్రారబ్ధం లేనేలేదు. అనిచ్చా, పరేచ్చా రెండే ఉంట" వని ఆ వృచ్చకులకు సమాధానంగా భగవాన్ చెప్పారేగాని వారియధార్థ సిద్ధాంతం 'వున్నది నలువది' అనుబంధమందు ఎట్లా విశదీకరించారో చూడు.

జ్ఞానికి సంచితాగామములు కలుగవు; ప్రారబ్ధము మిగులుననుట పరుల ప్రశ్నకు బలుకుమాట. భర్త పోయిన తర్వాత వైధవ్యమును బొందని భార్య మిగుల కున్నట్లు, కర్తపోయిన కర్మత్రయము మిగులదని కనుము. ==> సూరి నాగమ్మ

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ