రమణాశ్రమ లేఖలు 23 గోపూజ 16-7-1946

రమణాశ్రమ లేఖలు 23 గోపూజ 16-7-1946
http://bhagavanraman.blogspot.com/2018/09/23-16-7-1946.html
నిన్న కనుమ పండుగ కదూ. ఈ పండుగకు అన్ని ప్రాంతాలలో పశువులకు అలంకారం చేసి పొంగలి పెడతారు. ఆశ్రమంలో కూడా నిన్న ఉదయం రకరకాల పిండివంటలు వండి దండలుగా గుచ్చి మెడలో వేసి నందిని పూజించుటేగాక, గోశాల ముందర ముగ్గులు పెట్టి, రంభాస్తంభాలు (అరటి) నాటి, పచ్చాకు తోరణాలు కట్టి, గోవులన్నిటినీ స్నానం చేయించి, నుదుట పసుపు కుంకుమ పెట్టి, పూలమాలలతో అలంకరించి, పొంగలి పెట్టి, మంత్రాలు చదివి, టెంకాయలు కొట్టి గోపూజ చేసారు. లక్ష్మి ఆ గోవులకు రాణి కదా! ఆమె శోభను చూచి తీరాలి, నొసట పసుపు రాచి కుంకుమ పెట్టారు. మెడలోనూ కొమ్ములకూ చేమంతి, గన్నేరు, దవనం, రోజా ఇంకా ఎన్నెన్నో రకాల పూలు మాలలుగా కట్టి వేసి, వండిన గారెల దండ, అప్పాల దండ, చక్కెలాల దండ, మణుగుబూరెల దండ, 'జంతికెల దండ మొదలైనవీ, అరటిపళ్లు, చెరకుముక్కలు, కొబ్బరిముక్కలు మొదలైనవీ విడివిడిగా దండలు గుచ్చి మెళ్ళో వేసారు. అంతటితో తృప్తి చెందని పశువుల కాపరి తన యింట్లో సొంతంగా వండిన జంతికలదండ మరొకటి తెచ్చి దాని మెడ నింపాడు. “ఇదేమిరా?” అని నిరంజనానంద స్వామి అడిగితే ఏటేటా నా మామూలిది స్వామీ' అని సగర్వంగా బదులిచ్చాడా కాపు. ఇలా లక్షణంగా  అలంకరింపబడి కామధేనువల్లే కన్నుల విందొనర్చుచున్న ఆ లక్ష్మమ్మను చూస్తే సంతోషంతో నా మనస్సు ఉప్పొంగి కడుపు నిండినట్లు అనిపించింది.
https://www.facebook.com/359807631501891/posts/505620390253947/?app=fbl
   తొమ్మిది ముప్పావుకు బయటికి వెళ్లిన భగవాన్ ఆ బిడ్డలను ఆదరించటానికి పది గంటలకు గోశాలకు వచ్చారు. లక్ష్మీ ప్రక్కనే కుర్చీమీద కూర్చొని ఆమె అలంకారం చూచి ఆనందిస్తూ ఉంటే భక్తులు "న కర్మణా' ఇత్యాది చెపుతూ కర్పూర హారతులిచ్చారు. కొందరు భక్తులు లక్ష్మికి ఫోటో తీస్తామన్నారు. గుంపులు కూడిన భక్తబృందాన్ని పక్కకు తప్పుకోమని గోశాలమధ్య కామెను తీసుకువస్తే తలవూపుతూ ఒయ్యారంగా నిలిచిందా యమ్మ, భగవాన్ లేచివచ్చి పక్కన నిలబడి ఎడమచేత ఆమె శిరమూ ఒళ్లూ నిమురుతూ, “ఉండమ్మా ఉండు, సరిగా ఉండు" అని పలికేసరికి ఆ ఒప్పులకుప్ప నిమీలిత నేత్రాలతో సమాధిస్థవలే కదలక నిలిచింది. శ్రీరమణులు వామహస్తం ఆమె వీపున ఆనించి, దక్షిణ హస్తంతో దండం పట్టుకొని ఠీవిగా నిలుచుంటే, ఫోటోగ్రాఫరులు రెండో మూడో ఫోటోలు తీస్తారు. ఆ దృశ్యం చూచి తీరాలి సుమా. శ్రీవారు తమ అమృతహస్తంతో ఆమె నోటికి పళ్లూ, గారెలూ అందిస్తుంటే మరొక ఫోటో తీసారు, నీవిక్కడికి వచ్చినప్పుడవన్నీ చూడవచ్చును. లక్ష్మీ సహితంగా భగవానులా గోశాలమధ్య ఉన్నప్పటి ఆ దృశ్యం చూస్తే రేపల్లెలోని గోపాలకృష్ణుడు జ్ఞాపకం వచ్చాడు. అదీగాక, బ్రహ్మ వైవర్త పురాణంలో కృష్ణుడు గోలోకనాథుడగు పరమాత్ముడనీ, ప్రకృతియే రాధయనీ చెప్పబడి ఉంది. అవినాభావ సంబంధం గల ప్రకృతి పురుషులే రాధామాధవులని ఆ పురాణ సిద్ధాంతం.
https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD
    శరీరం కొంచెం ఎడమ ప్రక్కకు వొరిగేట్లు ఠీవిగా నిలిచి, ఆ చేయ్యి లక్ష్మిపైన పెట్టి, కుడిచేత వేణువో అన్నట్లు కర్రపట్టి, ఆనంద సముద్రంలోని అలల నురుగా అన్నట్లున్న చిరునవ్వు ముఖంలో చిందులు తొక్కగా, కృపాదృక్కులతో గోగణ సహితంగా నిలుచున్న భక్త బృందాన్ని అవలోకిస్తున్న ఆ సుందర రమణమూర్తిని చూస్తే సవ్యాపసవ్య పాదాంగుష్టాలు ఊతగా నిలిచి జగన్మోహనకరంగా మురళీగానం చేయుచున్న శ్రీకృష్ణుడా! అన్న తలపు కలగటం వింతకాదు. ఆ కృష్ణుడే రమణుడైతే, చెవులు. ఓరబెట్టుకొని అనిమేష నేత్రాలలో భగవత్కర స్పర్శానుభూతి చేత ఆనంద పారవశ్యం పొంది విశ్వమే మరచిన మా లక్ష్మిని ఏమనాలి? ప్రకృతి స్వరూపిణియైన రాధ యందునా? ఆమె దేవాంశసంభూత కాకుంటే మానవ భాష ఎలా అర్థం చేసుకుంటుంది? నిన్న నిజంగా మానవదృష్టికి అగోచరమైన గోలోకమూ, తదధిపతులెన ప్రకృతి పురుషులనూ, చర్మచక్షువులతో చూడగలిగామనటం అతిశయోకి కాదు సుమా! నా వెర్రి భావనకు నవ్వుతావేమో కాని, ఆ దృశ్యం అంత మనోహరంగా ఉంది. ఏటేటా యీ గోపూజ జరుగుతూనే ఉంది కానీ ఈ ఏడు భక్తులు లక్ష్మమ్మకు ఫోటో తీస్తామనటం వల్ల భగవానులామె ప్రక్కన నిలిచి మాకీ దివ్యదర్శనం ఇచ్చారు. ఎంత సుదినమో! నా సంతోషం పట్టలేక నీకు రాస్తున్నా.
T.me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ