రమణాశ్రమ లేఖలు - 2-1-1946 మాటలేని నా మొరాలకింపవా?
శ్రీ రమణాశ్రమ లేఖలు - 2-1-1946
మాటలేని నా మొరాలకింపవా?
జగదీశ్వర శాస్త్రి గారిని నీవు చూచావు గదూ. వారిక్కడుండగా ఒక కుక్క వారితో తిరుగుతూ వుండేది. ఆ కుక్క చాలా బుద్ధి శాలి. భగవానుని హాలులోకి ఆ శాస్త్రి దంపతులలో ఎవరు వచ్చినా వారితో వచ్చి పొన్నెమ్మలాగా కూర్చొని వారు లేవగానే లేచిపోయేది. దానికి మరీ ఆ గృహిణి దగ్గరే ఎక్కువ చనువు. హాల్లోకి రాకుండా చేయాలని మన వాళ్ళెంత ప్రయత్నించినా అది మానలేదు.
ఒకసారి దాన్నెవరికో ఒప్పగించి ఆ దంపతులిద్దరూ పట్నం వెళ్ళి పదిహేనురోజులదాకా రాలేదు. అది మొదట నాలుగైదు రోజులు హాల్లో వెదకి చూచి, హాలు చుట్టూ తిరిగి, వారు వెళ్ళే చోట్లన్ని వెదకి, విసిగి ఏమీ తోచక గాబోలు ఒక ఉదయం సుమారు పది గంటలకు భగవాన్ సోఫా దగ్గరకు వచ్చి తదేక ధ్యానంగా శ్రీవారిని చూస్తూ నిలిచింది. నే నా ముందువైపే కూర్చుని వున్నాను. భగవాన్ పేపరు చూచుకుంటున్నారు. కృష్ణస్వామి వాళ్ళు ఎంత అదిలించినా పోలేదు. నేనూ చెప్పా పొమ్మని. ఊహు, కదలలేదు. ఈ అలజడి విని భగవాన్ ఇటు చూచారు. దాని వాలకం, మనవాళ్ళ హడావుడీ కాస్సేపు గమనించి, పేపరు అవతల వుంచి, దాని భాష మౌనం వల్లనే గ్రహించినట్లుగా గమనించి, ఊపుతూ "ఏమిరా? ఏమి? మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని అడుగుతున్నావా? ఓహో,సరిసరి, తెలిసింది. వారు పట్నం వెళ్ళారు. ఇంకొక వారంలో వస్తారు. భయం లేదు. జాగ్రత్తగా వుండు. సరేనా. ఇక వెళ్ళు" అన్నారు. వారి మాట పూర్తి కావటమే వ్యవధిగా గిర్రున తిరిగి వెళ్ళిందా కుక్క. వెంటనే భగవాన్ నాతో "చూచారా, మావాళ్ళు ఎక్కడికి వెళ్ళారు. ఎప్పుడు వస్తారు? అని నన్నడుగుతున్నది. వీరెంత అదిలించినా నే చెప్పేదాకా కదలనే లేదు" అన్నారు.
మరొకసారి ఆ కుక్క తప్పుచేస్తే ఆ గృహిణి కోలతో రెండంటించి ఒక పూటంతా గదిలో వుంచి గొళ్ళెం పెట్టిందట. విడువగానే అది ఆమె మీద అలిగి ఆశ్రమానికి వచ్చి భగవాన్ తో చెప్పుకోటమే గాకుండా నాలుగైదు రోజులు వారింటికి పోక ఆశ్రమంలోనే ఉండిపోయింది. భగవాన్ దానికి అన్నం పెట్టించి ఆ ఇల్లాలి నిట్లా మందలించారు. "నీవు దాన్ని ఏమో చేశావు.లేకుంటే దానికెందుకు కోపం వస్తుంది? నాతో చెప్పుకున్నదే. ఏం? ఏం జేశావు?" అన్నారు. కడ కా యమ్మ భగవాన్ సన్నిధిలో తన తప్పు నొప్పుకొని దాన్ని బ్రతిమాలి పిలుచుకుపోయింది. ==> సూరి నాగమ్మ
Comments
Post a Comment