రమణాశ్రమ లేఖలు - 4-1-1946 ధర్మం వేరు ధర్మసూక్ష్మం వేరు

శ్రీ రమణాశ్రమ లేఖలు - 4-1-1946 

ధర్మం వేరు ధర్మసూక్ష్మం వేరు

భగవత్సన్నిధికి అప్పుడప్పుడు తిరుచందూరు సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదమనీ, మధుర మీనాక్షి ప్రసాదమనీ, రామేశ్వర ప్రసాదమనీ ఇంకా ఎక్కడెక్కడో పుణ్యక్షేత్రాల నుంచి విభూతి కుంకుమ వగైరా ప్రసాదాలన్నీ వస్తూ ఉంటవి. భగవాన్ ఎంతో ఆదరంతో "ఇదుగో తిరుచందూరు నుండి సుబ్రహ్మణ్యుడు వచ్చాడు. అదుగో మధుర నుండి మీనాక్షి వచ్చింది. ఇదుగో రామలింగేశ్వరుడు, ఇదుగో వీరు, అదుగో వారు" అంటూ, వారి వారి పేర్లు చెప్పి ఆ విభూతి-కుంకుమ ప్రసాదాలు స్వీకరిస్తూ వుంటారు.

మరి కొందరు గంగాతీర్ధమనీ, గౌతమీ వారియనీ, కావేరి యనీ, కృష్ణ యనీ, ఇంకా ఎన్నెన్ని నదీ తీర్థాలో తెచ్చి ఇవ్వగా భగవాన్" అదుగో గంగ, ఇది గౌతమి, అది కృష్ణ, ఇది కావేరి" అంటూ ఎంతో ఆదరంతో ఆ తీర్థం పుచ్చుకుంటూ వుంటే, మొదట మొదట నాకేమో వింతగా వుండేది. అన్ని దేవతలకు అతీతమై సర్వతీర్ధాలకు మూలమై సాక్షి మాత్రంగా వెలిగే మూలతత్వమే రమణ రూపం ధరిస్తే ఇదిగో ప్రసాదమనీ, అదుగో తీర్థమనీ మహాఘనంగా తెచ్చి ఇస్తారేమో, వీళ్ళకెంత వెఱ్రా, అని అనుకొనేదాన్ని.

మొన్న నీమధ్య సాగరతీర్థం తెచ్చారొకరు. భగవాన్ అత్యంతాదరంతో మందహాస ముఖారవిందులై "అదుగో సాగారులున్నూ వచ్చారు. అన్ని నదులు వచ్చినవి గాని ఇంతకాలం నుంచీ వారు రాలేదు. ఇదే మొదలు రావటం. చాలా మంచిది. ఇట్లా ఇవ్వండి" అంటూ ఆ తీర్థం గ్రహించారు. అది వినీ చూచిన నాకు ఒక్కసారిగా పూర్వగాధలన్నీ జ్ఞాపకం వచ్చి వెనుకటి అభిప్రాయమంతా మారిపోయింది. ఇట్లాంటి మహాపురుషులను సేవించే నిమిత్తం సర్వతీర్థాలు, సప్త సముద్రాలు,సకల దేవతలు వచ్చి పాదాక్రాంతులుగా నిలిచి సేవిస్తారని ఎన్నో గ్రంధాలలో చదివి అతిశయోక్తిగా వ్రాశారే గాని, రాళ్ళు, నదులు నడిచివస్తవా అని అనుకొన్నాం. ఎవరూ కోరుకోకుండానే ఈ పవిత్ర తీర్థాలు, విభూతి ప్రసాదాలు భక్తులు తీసికొని రాగా "అదుగో వారు వచ్చారు. ఇదుగో వీరు వచ్చారు" అని స్వయంగా భగద్వాణి పలుకుతుంటే వినివిని ధర్మం వేరు, ధర్మసూక్ష్మం వేరు అన్నట్లు మహాత్ముల సన్నిధిలో జరిగే విషయాలు అతి సూక్ష్మంగా పరిశీలిస్తేగాని ఆ ధర్మ సూక్ష్మం గోచరించదని తోచింది. భగవాన్ అన్నింటినీ ఆదరంతో స్వీకరించారంటే వారి సేవను స్వీకరించారన్న మాట. ఈ అర్థం సాగరతీర్థం వచ్చినప్పుడు స్ఫురించి లోగడ నన్నావరించిన సందేహమంతా తొలగిపోయింది.

తమ గిరి జీవితంలో పులి వచ్చిన సందర్భమందు "సిద్ధ సంఘానికి చెందినవారు ఎందరో నన్ను చూచే నిమిత్తం బహురూపాలతో రాగల"రని శ్రీవారు సెలవిచ్చి వున్నారు.  ==> సూరి నాగమ్మ 

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ